నీ అక్రమ సంపాదన, మంది మార్బలం నీ వెంటరావు
“కర్మ
నిన్ను తప్పక వెంటాడుతుంది.
నీ అక్రమ సంపాదన, మంది మార్బలం, పలుకుబడి నీ వెంటరావు.
అన్నీ ముళ్ళ పొదలే"
సమాజములో నేడు నెలకొన్న కొంతమంది వికృత ప్రవర్తన, హిందూ సంప్రదాయాల పట్ల విచ్చలవిడి ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలు, అసభ్యకరమైన నడవడిక మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు తక్షణమే దృష్టి పెట్టి భారతదేశ మహోన్నతమైన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కాపాడాలని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ కోరారు.
మహాభారత
యుద్ధం పిదప శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అన్న మాటలను, గరుడ పురాణాంతర్గత కర్మ, శిక్షలను
ఆయన ఈ సందర్భముగా ఉటంకించారు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా,
నీ నేరాలను పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు శిక్షించ లేకపోయినా, నువ్వు తప్పించుకోవాలని
ప్రయత్నించినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుందని, వదలక వెంటాడి వెంటాడి ఆ కర్మ ఫలాన్ని
అనుభవింపచేస్తుందని, కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరని శ్రీరామపాద గుర్తుచేశారు.
త్రవ్వి త్రవ్వి చూసుకుంటే, నీ జాడ నీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది. ఇప్పటికైనా పశ్చాత్తాప పడి, మంచి మార్గాన్ని పట్టు. లేదంటే ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. పురాణ ఇతిహాసాలే కాదు, నేటి పలు సంఘటనలు కూడా ఇందుకు నిరూపణలు. ఇప్పుడు బ్రతికినంత కాలం రాబోయే జన్మ అని ఒకటి ఉంటుందా అని, పాప-పుణ్యం నరకలోకం మీద నీకు అవహేళన అవ్వచ్చు. ఆ…ఎవరు చూశారూ ! అనే వికృత భావం కలిగుండవచ్చు. కాని, నువ్వు చీకటిలో ఒంటరిగా చేసే పనికి కూడా పంచభూతాలు, అష్ట దిక్పాలకులు యమధర్మరాజు న్యాయస్థానములో సాక్షులు అని శ్రీరామపాద భాగవతర్ చెప్పారు.
ఈ శరీరం పడిపోయిన తక్షణం యమదూతలు నీ గతం చూపి, పరులను ఏ విధముగా ఇబ్బంది పెట్టావో, మోసం చేశావో, మానసిక శారీరిక హింసలు పెట్టావో, నీకు ఇచ్చిన సదావకాశం ఎలా దుర్వినియోగం చేశావో చూపించి, నరక లోక శిక్షలు మొదలుపెట్టినపుడు నీ ఆత్మ పడే క్షోభ, నరక బాధలకు దిక్కులు పెక్కటిల్లేలా అరిచినా ప్రయోజనం లేక, ఇక్కడ నీ అవినీతి – అధర్మ – అక్రమ – అసత్య – అన్యాయ – ఈర్ష్య - ద్వేష పూరిత వ్యవహారాలకు భజన చేసిన అనుయాయులు అక్కడ లభించక నువ్వు పడే నరక యాతన అంతా ఇంతా కాదని శ్రీరామపాద తెలియజేశారు. నీ అక్రమ సంపాదన, డబ్బు, భవనాలు, బ్యాంక్ ఖాతాలు, మంది మార్బలం, బినామీలు, అహంకారం, అధికారం, పలుకుబడి ఏమీ నీ వెంటరావు.
నీ తెలివితేటలు అక్కడ పనికిరావు. నీ కుయుక్తులు అక్కడ పనిచేయవు. నరకబాట తప్పించుకోవడానికి కారులు, మరొక ప్రాంతానికి పారిపోవడానికి విమానాలు ఉండవు. నీ వ్యధ వినడానికి భజనపరులు, ప్రసారం చేయడానికి టి.వి. ఛానెల్స్ ఉండవు. ఆఖరికి నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులు సైతం నీకు పెడగానే ఉంటారు. నీ పాప కర్మలకు యమ (ధర్మ) దూతలు సలసల కాగే నూనెలో పడేస్తారు. నిన్ను రక్షించడానికి నీ అవినీతి ముఠా, నీతిమాలిన అధికారులు అక్కడ ఉండరు. అప్పటికే వారంతా అక్కడ పనికిరాని జీవుల శిక్షాస్మృతిలో ఉన్నవారే. అందువలన నువ్వు ఎటుచూసినా ముళ్ళ పొదలే! ఫలితంగా ఎన్నోవేల నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది.
అన్ని రంగాలలోనూ మోసపూరిత వ్యవహారులున్నారు. రాజకీయం, పాలనా యంత్రాంగం, ఉద్యోగ వ్యాపారం, విద్య వినోదం, ప్రకృతి రక్షణ, అభివృద్ధి ఆధ్యాత్మికం, మంత్రులు స్వామీజీలు ... ఇలా చెప్పుకుంటూ పోతే గాడి తప్పుతోంది. ఇది రాను రాను ప్రాణాంతక స్థాయికి చేరుకోవచ్చు. మార్గదర్శులున్నారు, వారి మాట వినాలి. పైవారు (ఉన్నత స్థాయి, స్థితిలో ఉన్నవారు) క్రమశిక్షణ, నైతికతతో కఠినంగా ఉంటే మార్పు తథ్యం. సమాజం బాగుండాలనుకునే వారికే ఇది సాథ్యం. నేను మాత్రం బాగుపడితే చాలనుకునేవారికి ముందు ముందు ముళ్ళపొదలే !
.jpeg)

