ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

గురు-పరంపర అవసరమా ?

ఎందుకంత ప్రాముఖ్యత ? 


  1. గడ్డాలు పెంచుకుని, కాషాయం ధరించలేని వాడు గురువా ?
  2. భక్తి పేరుతో, నిత్యం విమానాల్లో ఫస్ట్ క్లాస్‌లో విదేశాలు తిరిగేవాడు జగద్గురువా ? అలా ఐతే ఈ ప్రపంచంలో వేల జగద్గురువులు ఉన్నట్లే !
  3. లౌకిక వాంఛ గలవాడు గురువు కాగలడా ?
  4. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు అక్రమంగా చేసేవాడు అవతార పురుషుడైపోయాడు !
  5. రాహువు లాలాజలం నుండి ఉద్భవించిన ఉల్లి, వెల్లుల్లి తినేవారు, మద్యం సేవించి స్త్రీలతో సాంగత్యం చేసేవాడు గురువుగా అర్హుడా ? 
  6. స్త్రీలతో వ్యక్తిగతంగా మాట్లాడేవాడు సన్యాసా? 
  7. తన తప్పులు కప్పిపుచ్చడానికి నిత్యం లంచాలు ఇచ్చేవాడు పూజ్యనీయుడౌతాడా?
  8. బ్రహ్మచార్యులమని చెప్పుకుని విచ్చలవిడిగా అక్రమాలు చేసేవారు గురువుకి వ్యక్తిగత కార్యదర్శులా? అటువంటప్పుడు ఆ గురువు పవిత్రుడౌతాడా? 
  9. ఒకానొక ప్రముఖ ఆచార్యుడని చెప్పుకునే సన్యాసి విదేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని విన్నాం. దీనిని ఏ విధముగా అర్థం చేసుకోవాలి ? ఇది అసత్యమని నిర్థారించేది ఎవరు ?
  10. రాగ ద్వేషాలు కలిగి, దొంగ మార్గాన దండాన్ని దొంగిలించి ఆచార్యుడు, మహాస్వామిగా రూపాంతరం చెందడం నీచుల లక్షణం. ఇష్టమైన వారిని ముద్దులు పెట్టుకోవడం, నచ్చనివాడిని నానా మాటలు అనడం కలికాల ధర్మాచారుల నిత్యకృత్యమైపోయింది.
  11. అవివాహిత అబార్షన్‌లు జరిగిన 'అవ' దూత ఆశ్రమాల వైపే అమాయక భక్తులు? ఈ సత్యాన్ని వెలికితీసే దర్యాప్తు ఏ అధికారి, ప్రభుత్వాధినేత చేస్తాడు? ఇటువంటి  స్వామీజీల చేతులు మురికి. నిజాలు బయటకు ఎలా వస్తాయి?
  12. మన తెలుగు ప్రదేశాలలో ప్రముఖమైన ప్రక్క రాష్ట్రంలోని ఒక పీఠంలో బ్రాహ్మణ వర్ణానికి చెందిన "ట్రస్టీ" ఇంటిలో పనిమనిషితో అక్రమం సంబంధం పెట్టుకుని, భార్య వద్ద బహిర్గతమవగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకానొక మధ్వ సంప్రదాయ స్వామి కూడ అక్రమ సంబంధంతో ఈ మధ్యే ఇదే గతి పట్టించుకున్నట్లు మనం తెలుసుకున్నాం. ఇంకొక కాషాయ ప్రముఖుడు లైంగిక వ్యవహారాలతో జైలులో ఉన్నాడు. ఇవన్నీ కర్ణాటక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న ఘటనలు. ఇటువంటివాటినే "ఆధునిక పీఠాలు/మఠాలు" అంటారు.
  13. పది సం.ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండే ఒక "....నంద" స్వామి, ఎల్లప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే మరొక ప్రసిద్ధ "......నంద" స్వామిని విమర్శిస్తూ విదేశాలలో వందల కోట్లు అక్రమంగా సంపాదించాడని అన్నారు. ఏమి జరిగిందో ఏమో ఈ ఇద్దరూ గత ప్రభుత్వ సమయంలో ఒక్కటైపోయారు. మొదటి స్వామికి రెండవ స్వామి చార్టెర్డ్ విమానాన్ని ఆంధ్రాకు పంపి తన ఆశ్రమానికి విశేషంగా ఆహ్వానించి ఎన్నో సపర్యలు చేసి వందల భక్తులనబడే ప్రజల ముందు కౌగిలించుకున్నారు. మరి వీరిద్దరిలో ఎవరిది తప్పు ? ఎవరు ధర్మాచారులు ?
  14. హిందూ ధర్మాన్ని భక్తి ముసుగులో పీఠం, ఆశ్రమమనే గొడుగు నీడలో ఆధ్యాత్మిక లోకాన్ని భ్రష్టుపట్టించడం కాక ఇంకేమిటి? 
  15. ఇటువంటి వారినే సకల దేవతాస్వరూపమని నమ్మిన మూర్ఖపు / అమాయక  భక్తుల మార్గం భగవంతుని దృష్టిలో ఏమౌతుంది ?
  16. కుహక గురువులు ఎవరు ? ఎలా ఉంటారు ?
  17. గురువు అనబడే వ్యక్తి నిజ స్వరూపం ఎలా తెలుసుకోవాలి ?
  18. ఏ రకం స్వామీజీలలో అస్మదీయ రక్షణ ఉంది ?




గురు – పరంపర అంటేఇప్పుడు మనం ప్రత్యక్షముగా చూసే గురువుకు పైన (ముందు) గురువు – పరమ గురువు - పరమేష్టి – పరాత్పర గురువులు ఉండటం, క్రమం ఎన్నో వందల సం.లుగా కొనసాగుతూ ఉండటం. ఇంతటి ప్రాముఖ్యమైన పరంపర భౌతికముగా ఉండాలి తప్ప ఊహాజనితముగా కాదు. ప్రపంచం చుట్టూ వీరు తిరగరు. ప్రపంచమే వీరి పాదాల చెంతకు వస్తుంది. అందుకనే మహాపురుషులను జగద్గురువులు అంటారు.




త్రేత, ద్వాపర యుగాలలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారాలైన శ్రీరామ, శ్రీకృష్ణులు కూడ గురువు దగ్గర విద్యనభ్యసించినవారే. యుగంలో సాక్షాత్ ఈశ్వరావతారమైన ఆదిశంకరాచార్య కూడ గురు శుశ్రూష చేశారు. రామానుజాచార్య, మధ్వాచార్యలు సైతం గురువు వద్ద శిక్షణ పొందినవారేకలియుగంలో దత్తాత్రేయుడు ఈమధ్యే నరసింహ సరస్వతిగా అవతరించినా కృష్ణసరస్వతి యతీశ్వరుల వద్ద శిష్యరికం చేశారు. ఇదే సనాతన ధర్మం, సంప్రదాయము. అందుకనే వందే గురు - పరంపరామ్ అని మహర్షుల శాస్త్ర వచనం.




ఈ క్రింది రెండు పట్టికలు గమనిస్తే కంచి కామకోటి మఠం, శృంగేరి శారదా పీఠములలో అవిచ్చిన్నముగా కొనసాగుతున్న గురు - పరంపర తెలుస్తుంది. ఇటువంటి పరంపరలు ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు ఒక అంకెలో మాత్రమే ఉన్నాయంటే వాటి పవిత్రత అర్థమౌతుంది.






ఇంత ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నేడు చాలా మంది ఆధునిక స్వామీజీలు ఎటువంటి గురువు లేకుండా, గురు - పరంపర లేకుండా, ఏ గురువు వద్ద విద్యనభ్యసించక - అభ్యసించలేక, దేహాభిమానంతో శారీరిక పవిత్రత పాటించలేక, బ్రహ్మ - ధర్మ నిష్ఠలు పాటించలేక, కాషాయవస్త్రం ధరించలేక, కఠిన సత్యానికి కట్టుబడలేక, లౌకిక వ్యామోహాలను త్యజించలేక, వేద-శాస్త్రములు తెలియక, ఆధ్యాత్మిక చరిత్ర లేక, తమ వ్యాపారానికి ఇతరుల కాళ్ళను గుప్తంగా పట్టుకుంటూ, బాహ్యంగా ఎండు బెరడు సిద్ధాంతముతో దొడ్డిదారిన అవతార పురుషుడిగా, ఆచార్యుడిగా ప్రకటించుకుని సదా సర్వకాలం స్వీయస్తుతి చేసుకుంటూ కలికి వశమై, నిజాలను తుంగలో త్రొక్కి మన మధ్యే పూజ్యులుగా తిరుగుతున్నారు. వారిపైన వారే శ్లోకాలను వ్రాసుకుని, గురు - పరంపర లేకపోయినా, ఉన్నట్లుగా ప్రజలకు అర్థం కాని రీతిలో స్తుతి చేయించుకుంటున్నారు. జ్ఞానులు వీరిని కుహక గురువులుగా గుర్తిస్తారు. మనం మాత్రం ఆ కుహకుల ఊబిలో పడతాం (కలికాలం కదా). ఈ కోవకు చెందినవారు శాస్త్ర ప్రకారము చెప్పిన ఎనిమిది (కొన్ని చోట్ల పదిగా వివరించారు) రకాల గురువులలో ఏ కోవకీ చెందరు. అంటే స్వయం ప్రకటిత ఆధునిక గురువులు అని అర్థం. ఇక్కడ గ్రహించవలసినది "ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక గురువు" లకు ఉన్న గంభీరమైన తేడా. "గురు" స్థితి అందరికి కలుగదు మిత్రమా ! నిజం ఎవరో, నకిలీ ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనినే దౌర్..భాగ్యం, దుర్..మార్గం అంటారు. ఎన్నో కుటుంబాలు వారి ఆధ్యాత్మిక రాజకీయ నాటకంలో అతలాకుతలం అయ్యాయి. అవుతూనే ఉన్నారు. కాని, బాధితులు నోరు తెరవలేని దుస్థితి. ఎందుకంటే ఆ అంతర్జాతీయ స్వాముల పలుకుబడి సామాన్యమా ? ప్రశ్నించినవాడిపై పోలీసులతో చేతులు కలిపి అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులను కలుగజేయడం, రౌడీలతో బెదిరించడం. ఇటువంటి దుశ్చర్యలు కేవలం రాజకీయ పార్టీలు, అవి నడిపే ప్రభుత్వాలలోనే నడుస్తాయనుకుంటే పొరపాటే ! ఇవి దైవసాక్షిగా ఆధ్యాత్మిక లోకంలో ఆధునిక ఆశ్రమాలు, మోడరన్ పీఠాలలో జరుగుతున్నాయి. తప్పులు జరుగుతున్నాయని కొందరు హెచ్చరిస్తున్నారంటే నిజమైన గురువైతే వెంటనే సరిదిద్దుకునే చర్యలు తీసుకుంటాడు. అవి చేయక బెదిరింపులతో నోరు మూయించాలని చేసేవారైతే వారిని ఏమంటారు ? పైగా ప్రశ్నించేవాడు తనను ఎన్నో సంవత్సరాలు ధర్మాచరణ కోసం పరితపించి అనుసరించినవాడే.

 

మహాత్ములు ఎవరు, మోసగాళ్ళు ఎవరో రాజకీయం, లౌకికంలో శులభముగా తెలుసుకోవచ్చు. వారిలో మార్పు తీసుకునిరావచ్చు. కాని, ఆధ్యాత్మికంలో అలా కాదు. దొంగ స్వామీజీ, బాబాలను గుర్తించడం సాధ్యం కాదు. పైగా అదొక సురక్షితమైన స్థానం! మనల్ని మానసికంగా నరుకుతూనే మన ధనముతో వారి సామ్రాజ్యాలను విస్తరించుకుంటూ ప్రపంచ సుఖాలను దైవం ముసుగులో అనుభవిస్తూ ఉంటారు. దీనికి సహకరించే బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు పవిత్రులుగా నటిస్తూ వారికిమించి ఈ ప్రపంచములో దైవభక్తులు, గురుభక్తులు లేనట్లు, చివరికి వేదశాస్త్రాలు పఠించే ఘనాపాఠీలు కూడ వీరికి తక్కువే అన్నట్లు విర్రవీగుతూ గాలిలో మాత్రమే నడుస్తుంటారు. పైగా, సంభావనకు ఆశపడి ఆ స్వామీజీల చుట్టూ తిరుగుతూ ఉండే పండితులు ఎక్కువైపోయారు. మూలిగేవాడిమీద తాటిచెట్టు పడినట్లు, వి.వి.ఐ.పిలు వీరిని సందర్శించడం, అది చూసి అమాయక భక్తులు మోసపోవడం, ఇదీ నేడు నెలకొన్న ఆధ్యాత్మిక దౌర్భాగ్యం. ఏ శాస్త్రము, పురాణము తెలియని సామాన్యుడు వారిని చూసి తమ కొంప ముంచుకుంటున్నాడు. ఇది చాప క్రింద నీరు లాంటి ప్రమాదమని తెలుసుకునే సరికి జీవితకాలం అయిపోతుంది. 

 

ఇతర మతస్థులు పేట్రేగిపోవడానికి, నాస్తికులకు హిందూ ధర్మాన్ని కించపరచడానికి అవకాశం ఇటువంటి వారి వలనే దాపురిస్తోంది. బాహ్య హంగులు, ఆర్భాటాలు, నాటకాలు చూసి మురిసిపోయావా, పాప కూపములో భాగమైనట్లే సుమా ! ఇంతకంటే వివరాలు చెప్తే, గుండె పగులుతుంది. ఎవరి గురించి అని చాలా మంది అడుగుతున్నారు. జాగ్రత్త చెప్పడం వరకే ఆధ్యాత్మికవేత్త బాధ్యత.  పరిశోధన సత్యాన్వేషకుల పని, ఎందుకంటే సత్యమే వారి పురోగతికి మెట్టు. ఇది ఎలా తెలుసుకోవాలనేదే చాలా మంది మదిలో ప్రశ్న. పుణ్యం కొద్దీ మనసు ఉంటే, సన్మార్గ దారులు అవే తెరుచుకుంటాయి.


దురదృష్టమేమంటే, రాజకీయాలలోనే కాదు, ఆధ్యాత్మిక (ఆధునిక) సంస్థలలోనూ కుటుంబ పాలన, కుటుంబ పోషణ, అస్మదీయ రక్షణ (అక్రమాల నుండి) ఉంది. ఇవే ..కలి సామ్రాజ్యాలు. అటు ఇటు నష్టపోయేది అవివేక ప్రజలు, మూర్ఖ భక్తులే! వారందరూ కోట్లకు పడగలెత్తుతూ ఉంటారు, ప్రజలు/భక్తుల సొమ్ము మాత్రం హరించుకుపోతూనే ఉంటుంది. ఇదీ, దేశంలో నెలకొన్న కొన్ని ప్రభుత్వం-ప్రజలు, ఆధునిక గురు-శిష్యుల సంబంధం 😑


రామరాజ్యమంటే, భార్యని సైతం ధర్మాచరణ కోసం త్యజించాడు శ్రీరాముడు. అంటే తన, పర భేదం లేక ధర్మాన్ని పాటించడం. అయోధ్యలో రామ మందిరం కట్టినంత మాత్రాన రామరాజ్యం వచ్చినట్లేనా? ఇది సాధ్యమేనా? శ్రీరాముడు ఓపికకు మారుపేరు. ఆఖరికే, అస్త్రాన్ని సంధిస్తాడు! ఇప్పటికైనా, వయసు మీరినా ధర్మ మార్గాన పడితే నీలో ఉన్న ఆత్మకు రాబోయే జన్మలలో జ్ఞానబోధ అవుతుంది. లేదా వచ్చే జన్మలో ఇప్పటి జన్మ కర్మను "పూర్వ జన్మ పాపం"గా గుర్తించి మారిని ఆ దేహంతో కుమిలి కుమిలి ఏడవాల్సివస్తుంది.


అందుకనే ఉత్తమ భవిష్యత్తు, ఉత్తమ జన్మ, పుణ్యార్జనకు ప్రతి ఒక్కరు


వేదములో చెప్పిన నామాన్నే స్మరించాలి.
వేదములో చెప్పిన రూపాన్నే ఆరాథించాలి.
వేదద్రష్టలైన గురువులనే ఆశ్రయించాలి.
వేదమే సనాతన హిందూ ధర్మానికి మూలము.
వేదము చెప్పనిది ఏది చేసినా పాపమే !


- శ్రీరామపాద భాగవతర్,  ఆధ్యాత్మికవేత్త


Note : 

ఇక్కడ, సందర్భోచితముగా విషయాన్ని గ్రహించాలి.  ఉదా: అలాగైతే గడ్డం లేకుండ కాషాయం వేసుకునేవాడు  గురువా అనే అర్థము తీసుకోకూడదు. ఈ వ్యాసము సనాతన సంప్రదాయ అవగాహనా జ్ఞానం కోసం తప్ప విమర్శ, ఆరోపణ కాదు, ఆవేదన ! దయచేసి గ్రహించాలి.


సనాతన హిందూ ధర్మం ఆధునిక స్వామీజీల చేతుల్లో అంత చులకనైపోయిందా? పారాయణలు, పూజలు చేస్తున్నారని సంతోషపడాలా, నిజాన్ని త్రొక్కిపెట్టి భక్తులను మోసం చేస్తున్నందుకు బాధపడాలా? కలి కాలం, నిజాన్ని చెబితే ప్రజలు అంగీకరించే స్థితిలో లేరు. ఇది మరింత విచారకరం. అందుకనే పూర్వులు, విజ్ఞులు "యదార్థవాది లోక విరోధి" అన్నారు. 


వాసుదేవ రక్షమాం 🙏🏼


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper