మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి
పితృ దోషం, పితృ శాపము, అకాల మరణం
!
సంతానం మీద వాటి తీవ్రత ! తక్షణ
కర్తవ్యం ఏమిటి ?
చెన్నై,
సెప్టెంబర్ 22, 2021 : పితరులను తర్పణం, శ్రాద్ధము ద్వారా మహావిష్ణువునందు లీనం చేయడమే
మహాలయం. మహాలయ పక్షములో విధిగా నిత్య తర్పణము, శ్రాద్ధము అనుసరించవలసిందే !
గతించిన పూర్వీకుల ఉద్ధరణ కోసం అర్హులైన సంతానము నిత్యకర్మ, తీర్థక్షేత్రాలలో పిండప్రదానం, అమావాస్య తర్పణ, మహాలయపక్ష పితృకార్యాలు విధిగా చేయాలి. లేనియెడల అరిష్ఠం. నివసించియున్నంత కాలం తల్లితండ్రులు పిల్లలను ఇబ్బంది పెట్టక జీవిస్తారు. కాని, చనిపోయిన తర్వాత సంతానం చేసే వైదిక శ్రాద్ధకర్మలే వారి పురోగతికి ఆధారం. పితరుల దివ్యదేహార్తి, ఆకలి, దాహార్తిలను తిలోదకాల ద్వారానే తీర్చగలం. వీటి స్వీకరణ కోసమై పితృదేవతలు పుత్రుల గృహద్వారం వద్ద నిలబడి వేచి చూస్తారు. విధిగా ఆచరించిన వారిని దీవించడం, విస్మరించిన వారిని శపించి నిష్క్రమిస్తారనేది శాస్త్ర వచనం.
పితృయజ్ఞ దినేప్రాప్తే గృహద్వారం సమాశ్రితాః
వాయుభూతాః
ప్రవాంఛంతి శ్రాద్ధం పితృగణానృణాం
యావదస్తమయం
భానోః క్షుత్పిపాసా సమాకులాః
నిశ్వస్వ
సుచిరం యాంతి గర్హయంతి స్వవంరాజః
దీనినే పితృ శాపం అంటారు. దీని పర్యవసానం పలు జన్మల్లో వెంటాడుతుంది. ఈ దోషానికి మూలం స్వయంకృతాపరాధమే. పుట్టిన ప్రతివాడు ఎదో ఒకనాడు పితరుల స్థానానికి చేరుకోవలసినదే. ఇప్పుడు నిర్లక్ష్యం చేసి, తెలిసేటప్పటికి శరీరం లేకపోతే ప్రయోజనం లేదు. ఈ జన్మలో అనుభవిస్తున్న ఈతిబాధలకు పూర్వజన్మలో చేసిన పాపం, పితృదోషాలు కారణమంటారు. అంటే రాబోయే జన్మకి ఇప్పటి జన్మ పూర్వజన్మ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రతియొక్కరు కాలం వృధాచేయక ఈ సంస్కారాన్ని పాటించడం మేలు. తద్వారా పితృఋణం తీరి పితృశాప నివృత్తి, స్త్రీ దోషం, అకాల మరణం పొందినవారికి శాంతి, తోబుట్టువుల సఖ్యత, ఉద్యోగ వ్యాపార వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు నివృత్తి అవుతాయి.
వివిధ వర్ణాల పితరులను వేరే పేర్లతో (అగ్నిష్వాత్త, బర్హిషద, కావ్య, సుకాల..) పిలచినా, అధిపతి ఒక్కడే. పితృదేవతలు ఏడుగురు. పితరులు ఏడు లోకాలలో ఎక్కడ ఉన్నా శ్రాద్ధతర్పణ ఫలాలను అందిస్తారు. దీని కోసమే హోమం (అగ్ని), బ్రాహ్మణుడు, నువ్వులు, నీరు, కాకి, గోవు, భూమి ద్వారా పితరులకు పిండం అర్పిస్తాము.
మహాలయపక్ష
విధి చేయడం వల్ల, వెనుక తరాలలో ఎవరి నిర్లక్ష్యం చేతనైనా శ్రాద్ధకర్మలకు భంగము వాటిల్లినా,
చేయకపోయినా వాటి ఫలితంగా సంక్రమించిన దోషాలను ఇప్పుడు నివృత్తి చేసుకోవచ్చు. ఈ దైనందిన
కార్యక్రమ తంతు 20 ని.ల మాత్రమే. ఈ పక్షమంతా పశ్చాత్తాపంతో గరుడపురాణంలోని రుచికృత
పితృస్తోత్రమ్, బృహద్ధర్మ పురాణంలోని బ్రహ్మకృత పితృస్తుతి పఠిస్తే పితృదేవతలు సంతోషించి
సంతానం ప్రాయశ్చిత్తం చేసినట్లు భావించి అనుగ్రహిస్తారు.
మరొక ప్రక్క, గతించిన వారి ఆత్మ 13వ రోజు వరకు యమ/దేవ దూతల సహితముగా గృహము వద్దే తిరుగుతుందని, ఇప్పటివరకు తాను ఎవరిని నమ్మాడో, ఎవరి నిజస్వరూపం ఏమిటో ఆ దూతలు చూపిస్తారని, అది తెలుసుకుని భ్రాంతికి గురైన ఆత్మ, ఆ భ్రష్టులను (సంతానమైనా సరే) శపిస్తుందని పెద్దల ద్వారా తెలుసుకున్నాం. నిజానికి, జీవించియున్నప్పుడే (ధర్మాచరణ చేసేవారి) శాపాలకు గురయ్యేవారు చాలామంది ఉంటారు. వయసు పైబడిన పెద్దలను గృహ బహిష్కరణ చేసిన సంతానాన్ని, స్వలాభం కోసం తల్లితండ్రులు-తోబుట్టువులను ప్రణాళికతో విడదీసి ద్వేషం ఉసిగొల్పిన వారిని, తల్లితండ్రులను మోసం చేసి ధనాన్ని, ఆభరణాలను దొంగిలించి అక్రమంగా హరించివేసిన వారిని, తమ చివరి కోరికగా దేవాలయానికి దానం చేయమని తల్లితండ్రులు ఇచ్చిన సొమ్ముని (ఈశ్వర సొత్తు) ఇవ్వకుండా కాజేసిన వారిని గతించిన ఆత్మ శపిస్తుందని, భగవంతుని ఆగ్రహానికి పాత్రులౌతారనే విషయం తెలుసుకోవాలి.
ఇంకొక
ప్రక్క, ఎంతటి ధర్మాత్ముడైనా, తాను చేసిన పలు పుణ్యకర్మల ఫలముగా స్వర్గలోకంలో ఉన్నా,
తన కుమారుడు చేసిన పాపాలకి బలై నరకలోకానికి నెట్టివేయబడతాడు (రాబోయే కార్తీక మాసములో
దీనికి సంబంధించిన దృష్టాంతం కార్తీక పురాణములో చదవగలరు), అప్పుడు ధర్మాత్ముడి ఆత్మ
పడే క్షోభ ఆ నీచ సంతానానికి శాపమై పరిణమిస్తుంది. అంతే కాక, ఎప్పుడు తన కుమారుడు
సత్యవంతుడై, ధర్మ నిష్ఠాపరుడై పుణ్యకర్మలు ఆచరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది.
అందువలన
సకల పితృకార్యాలను నీతిగా సంపాదించిన ధనముతోనే చేయాలి. అవినీతి సొమ్ముతో ఎన్ని దానాలు,
ధార్మిక కార్యాలు చేసినా ఫలితము శూన్యమే. జన్మనిచ్చిన తల్లితండ్రులు జీవించి ఉన్నప్పుడే
గౌరవించడం, ధర్మ పథమున నడవడం చేయాలి తప్ప వారిని అవమానించడం, హింసించడం, హేళన చేయడం
మహాపాపం. చనిపోయిన తరువాత వారి చిత్రపటాలకి దీప, ధూప, నివేదనలు చేసి ప్రయోజనము లేదు.
ముఖ్యంగా, సుమంగళిగా చనిపోయిన స్త్రీల ఉద్ధరణ కోసం, పెద్ద కుమారుడు మహాలయపక్షములో అవిధవ
నవమి శ్రాద్ధం (తండ్రి జీవించియున్నంత వరకు) చేయాలి. నీట మునిగి, అగ్నిప్రమాదం, హత్య,
ఆత్మహత్య, జంతువుల కాటు మొదలైన ప్రమాదాల వలన చనిపోయినవారికి మహాలయపక్ష చతుర్దశినాడు,
గతించినవారి తిథి తెలియనిచో అమావాస్య నాడు శ్రాద్ధ తర్పణాదులు చేయాలి. మరొక విశేషమేమంటే,
యమధర్మరాజుకు ప్రీతి ఐన భరణి నక్షత్రం రోజున ఈ పక్షంలో "మహాభరణి" శ్రాద్ధము
చేయడం అటు గతించినవారికి ముక్తి లభించడమే కాక, వారి ఆత్మ శాంతించడం వలన శ్రాద్ధకర్మలు
చేసినవారికి శ్రేయస్సు లభిస్తుంది.
పితృకార్యాలు చేసేటపుడు ఆభరణాలు ధరించకూడదు. శ్రేష్ఠమైన బ్రాహ్మణులకు, వేద పండితులకు, వేదాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు దక్షిణ సమర్పించడం, గోసేవ గోగ్రాస నిమిత్తం ధన సహాయం చేయాలి. వంట చేసే బ్రాహ్మణులకు నమస్కరించి దక్షిణ ఇవ్వాలి. పితృ కార్యం అయ్యే వరకు ఇంటి ముంగిట ముగ్గు, అలంకారం చేయకూడదు. గంట మ్రోగించకూడదు. పితృకార్యం ఐన పిదప దీపారాథన చేసిన తరువాతే ఆహారం స్వీకరించాలి.
బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి
బ్రహ్మ ఉవాచ :
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ !
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే !!
2. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే !
సర్వ తీర్థావలోకాయ కరుణాసాగరాయ చ !!
3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః !
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ !!
4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః !
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః !!
5. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం !
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః !!
6. యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృ తర్పణం !
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః !!
ఫలశ్రుతి :
ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః !
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృ శ్రాద్ధ దినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్
నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్
పితృ ప్రీతి కరైర్నిత్యం సర్వ కర్మాణ్య ధార్హతి !!
కనుక, పాపశాపాల నుంచి విముక్తి, తమ సంతానం సుఖ సంతోషాలను కోరుకునేవారు ప్రతి సంవత్సరము పితరులకు శ్రాద్ధ కర్మలు, మహాలయ పక్ష విధులు నిర్వహించడం, గయా శ్రాద్ధం చేయడం పాటించాలి. లేనియేడల గరుడపురాణములో శ్రీమహావిష్ణువు హెచ్చరించినట్లు ఎన్నో జన్మల పర్యంతం నరకయాతన తప్పదని గుర్తుపెట్టుకోవాలి.
అమ్మ ఇచ్చిన "శీలము, జీవితం" అమ్మాయి వలన "అపవిత్రం, అధర్మం, దురాచారము" అవకూడదు. నాన్న పెంచిన కుటుంబ "గౌరవం, జ్ఞానం, ధర్మనిష్ఠ" అబ్బాయి వలన "అక్రమం, అప్రతిష్ఠపాలు" కాకూడదు. అలా చేసినవారు భ్రష్టులు. అందువలన సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు ఆచరించి పిల్లలకు మార్గదర్శం అవ్వాలి. అప్పుడే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.




