“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ?
“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ?
“రామరాజ్యం” : ఆ పరిపాలన, పదానికి ఉన్న విలువను కాపాడాలి !
-----------
“రామరాజ్యం” అంటే పాలకునికి కావలసిన ఎన్నో మహోన్నత గుణముల సమాహారం. అందులో అత్యంత ముఖ్యమైనవి కొన్ని.
1) తన, పర భేదము లేకుండా సత్యనిష్ఠతో ధర్మాచరణ చేయడం.
2) కఠినమైన నీతి, న్యాయముతో వ్యవహరించడం.
3) ఋషి పరంపర నుండి వచ్చిన గురు-వాక్యాన్ని పాటించడం.
4) అస్మదీయ రక్షణ, పరుల శిక్షణ తగదు.
5) అన్ని మతాలను వర్గ భేదం లేకుండా సమదృష్టితో చూడటం.
6) ప్రజలను మోసపూరితముగా నమ్మించడం తగదు.
7) ధనిక, పేద భేదం ఉండకూడదు.
8) ప్రజలకు కష్టం, నష్టం, బాధ, శోకం, విచారం, ఆపద, మానసిక అశాంతి - క్షోభ ఏ కోశాన కలిగించకూడదు.
9) స్వయముగా ప్రత్యక్షముగా వేద పోషణ, గో పోషణ, దేవాలయ పోషణ, నది - నదీ పరివాహక ప్రదేశాల రక్షణ, యాగాలు అణునిత్యం జరిగే విధముగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ నిర్వహించేవారిని గుర్తించి గౌరవించడం, అన్ని రకాల చేయూతనివ్వడం.
10) నిత్యం ప్రజలను ప్రాంతాలవారీగా కలిసి వారి బాధలు తెలుసుకుని నిస్పక్షపాతముగా వారికి అనువైన నిర్ణయాలు తీసుకోవడం. అర్థరాత్రి ఎవరైనా గంట కొడితే, వారికి ఏ ఆపద వచ్చిందోనని అయోధ్యా ప్రభువు శ్రీరాముడు పరుగున వెళ్ళేవాడు.
11) అసూయ, ద్వేషం, పగ, ప్రతీకార పాలన చేయకూడదు.
12) సనాతన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలను కాపాడాలి. అవసరమైతే పూడ్చబడిన వైభవాన్ని వెలికితీయాలి. అంతే తప్ప కొత్త సంప్రదాయాలను సృష్టించి సనాతన ధర్మాన్ని భ్రష్టుపట్టించకూడదు.
ఇవన్నీ ఆచరిస్తేనే ఆ పాలకుడు రామరాజ్యాన్ని తలపిస్తున్నాడని అర్థం. ఇవన్నీ ఒక్క శ్రీరాముడుకే పరిమితమయ్యాయి. అందుకనే యుగం మారినా ఆ ప్రభువునే గుర్తుపెట్టుకున్నాం. అంతే తప్ప, ఒకటో రెండో అనుసరిస్తే దాన్ని రామరాజ్యం అనరు. రామరాజ్యం తిరిగి రావాలని ఆకాంక్షించడంలో తప్పు లేదు.
కాని, ఇది నేటి కాలములో సాధ్యమేనా? అంటే ఉదాహరణకు, ప్రస్తుత విషయాన్ని గమనిస్తే, ఎన్నికల ముందు ఒక రకముగానూ ముగిసిన పిదప ప్రజల సమస్యలను లెక్కచేయక పోవడం జరుగుతోంది. ప్రతి పాలకుడు చేస్తున్న పనే. పాప పుణ్య విచక్షణా జ్ఞాన లోపమే నేడు నెలకొన్న దౌర్భాగ్యం. ఇప్పటి పరిస్థితి ఎలా ఐపోయిందంటే "ఇద్దరిలో ఎవరు బెటర్" అని చూడాల్సివస్తోంది తప్ప, పూర్తిగా ఒకరు మంచియని, ధర్మ నిష్ఠా గరిష్ఠుడని ఖచ్చితముగా చెప్పలేని దుస్థితి. కొంచెం సంతోషం, ప్రస్తుత కేంద్ర పాలకుడు విధ్వంస భారత్ నుండి వికాస భారత్‌కు కృషి చేస్తున్నాడు. అలాగే అయోధ్యలో రామ మందిర స్థాపన చేసినట్లే నిజమైన రామరాజ్యం కోసం కఠోర శ్రమ చేయాలి. పైకి చూసేదంతా బంగారం కాదనేది ఉత్తుత్తినే పెద్దలు హెచ్చరించలేదు. అందువలన, ప్రతియొక్క ప్రజా ప్రతినిథి, పాలకుడికి సరైన బుద్ధి, మంచి సంకల్పాన్ని కలిగించవలసిందిగా సూర్యుని సాక్షిగా ఆ శ్రీరాముడి ఆరాధ్య దైవమైన మహాదేవుని ప్రార్థిద్దాం.
.jpg)