పోలింగ్ రోజు - క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని శాసిస్తుంది లేదా శపిస్తుంది !

సామాజిక బాధ్యత

ఓటు హక్కు కోల్పోకూడదు !


  • ఒక్క క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని శాసిస్తుంది లేదా శపిస్తుంది !
  • విద్యావంతులు, ఉద్యోగులు, జ్ఞానులు ఓటు వేస్తే ... రౌడీ, గూండ, అబద్ధాల పుట్టలు, ముఠాలు ఖాళీ !
  • మెరుగైన సమాజం కోసం యువత, విద్యావంతులు తప్పక ఓటెయ్యాలి !
  • మంచి నడవడిక గల అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి !
  • ఎవరికి వారు మనొక్కరమే కదా, ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఏమౌతుందులే అనుకుంటే దుష్టులకు చేయూతనిచ్చినట్లు అవుతుంది.
  • 5 ని.లు ఓటు వేయడానికి బయటకి రాము. ఇది మానసిక, శారీరిక దౌర్భాగ్యం కాక మరేమిటి ?
  • కోట్ల మంది మానసిక క్షోభ అనుభవిస్తున్నాం ! ఇప్పుడు సరైన సమయం ఆసన్నమైంది.
  • ఇంట్లో కూర్చున్నా, సెలవు కదా అని ఓటు వేయకుండా పిక్‌నిక్, ఊరు వెళ్ళినా ఆ దుష్ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. రాబోయే 5 సం.లు ఇబ్బంది పడేది మనమే !


ప్రతిరోజూ ఉదయం పార్కులలో, ఆఫీసులలో, హోటల్స్‌లో, వేడుకలలో, ఇంటికి అతిథులు వచ్చినపుడు లోకజ్ఞానం, ప్రతిభ కనబరుస్తూ రాజకీయాల గురించి, ప్రభుత్వం అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండేది అని, ధరలు పెంచితే విమర్శలతోనూ...ఇలా ఎన్నో విషయాలపై 4 సం.ల 364 రోజులు మాట్లాడుతుంటాము. కాని, మన అభిప్రాయాన్ని, ఆవేదనని ఓటు అనే ఆయుధంతో వెలిబుచ్చి, మనకి కావలసిన అభ్యర్థిని ఎంచుకోవడానికి పోలింగ్ (365వ) రోజున సెలవు అయినప్పటికీ ఒక్క 5 ని.లు ఓటు వేయడానికి బయటకి రాము. ఇది మానసిక, శారీరిక దౌర్భాగ్యం కాక మరేమిటి ?


అందుకనే ఏ పార్టీ కూడా విద్యావంతుల మీద ఇప్పటివరకు ఆధారపడలేదు. ఎందుకంటే విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోక కుటుంబ సమేతంగా టి.వి లు చూస్తూ ఇంట్లో కూర్చునే మూర్ఖులని వారి అభిప్రాయం. జరుగుతున్నదీ అదే! చదువుకున్న వారికి ఇది అవమానం కాదా ? అందుకనే డబ్బు, ఉచితాలు ఎరజూపి పేదలు, బడుగు వర్గాలను ఆకర్షిస్తారు. వీరు వారి బుట్టలో పడి 5 స.లు కష్ట-నష్టాలను ఏరి-కోరి కొనితెచ్చుకుంటున్నారు.  ఉచితాలు నిజం కాదు. వేరే చోట ధరలను పెంచుతారు. "ఇక్కడ ఉచితం, అక్కడ పోటు". అంతిమ ఫలితం అందరం అనుభవిస్తున్నాం. ఉచితాలతో యువత భవిష్యత్తును నాశనం చేసి, బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని అథోగతిపాలు చేయడమే మూలసూత్రంగా కనిపిస్తోంది. అన్ని పోయాక కళ్ళు తెరిస్తే ప్రయోజనం శూన్యం. 


ముఖ్యంగా సనాతన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలను, ధర్మాన్ని గత కొన్ని సం.లుగా మనం ఎన్నుకున్న నాయకులు, పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మన సమాజ శాంతి, శ్రేయస్సు కోసం ఓటు ద్వారానే  అటువంటి వారికి బుద్ధి చెప్పాలి. ఇప్పుడు సరైన సమయం ఆసన్నమైంది. క్షణం వృధా చేసినా, అలసత్వం ప్రదర్శించి ఓటు వేయకపోతే నష్టం ప్రజలకే. ఈ అవకాశం జారవిడుచుకుంటే భయభ్రాంతులతో బ్రతుకుతూ నరకయాతన అనుభవించాల్సివస్తుంది సుమా! ఇలాచేసే, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లోని హిందువులు కొందరు ఓటు వేయక ఆ దేశంలోనే ఇరుక్కుపోయి వేలకొలదీ నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. ఇది చరిత్ర తెలిపే విషయం. దాదాపు ఇటువంటి దుస్థితే మరొక రూపంలో మనకు దాపురించే ప్రమాదం ఉంది. అందుకనే ఓటు వేయాలి. “దుర్మార్గులను దూరం పెట్టాలి, ఇది సనాతన ఉపదేశం".


ప్రస్తుత విషయాన్ని గమనిస్తే, ఎన్నికల ముందు చేతులెత్తి నమస్కరిస్తూ అతివినయంగా కనబడుతూ, ఎన్నికైన తరువాత ప్రజల సమస్యలను లెక్కచేయక పోవడం జరుగుతోంది. ఇది విధ్వంస పాలకుల విధానం. పాప పుణ్య విచక్షణా జ్ఞాన లోపమే నేడు నెలకొన్న దౌర్భాగ్యం. ఇప్పటి పరిస్థితి ఎలా ఐపోయిందంటే "ఇద్దరిలో ఎవరు బెటర్" అని చూడాల్సివస్తోంది తప్ప, పూర్తిగా ఒకరు మంచియని, ధర్మనిష్ఠా గరిష్ఠుడని ఖచ్చితముగా చెప్పలేని దుస్థితి. ఇదీ ఒక దురదృష్టమే. 




అభ్యర్థుల చరిత్ర, చదువు, నడవడిక, మాట, వినయం, సామాజిక బాద్యత ఏమైనా తీసుకున్నారా అని చూసి మాత్రమే ఓటు వేయాలి. అపుడు రాబోయే 5 స.ల కాలం బాగుంటుంది. సామాజిక బాధ్యత అంటే వారి ఆస్తులు పెంచుకోవడం, భూ కబ్జాలు చేయడం, అవినీతిగా, అధర్మముగా కోట్లు గడించడం, పగ - ప్రతీకారం - కక్షలతో ఊగిపోవడం కాదు. న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం, ధిక్కరించడం, అధికార యంత్రాంగాన్ని అగౌరవపరుస్తూ భయానికి గురిచేయడం కాదు. ప్రజలను ద్వేషపూరితంగా విభజించడం కాదు. ప్రజల సొమ్మును పలురకాలుగానూ, అనవసరముగానూ నాశనం చేయడం కాదు. సామాజిక బాధ్యత అంటే కుల, మత విభేదాలు రెచ్చగొట్టి ప్రజల భవిష్యత్తును నాశనం చేయడం కాదు, ప్రజల జీవితాలతో ఆడటం, సమాజ శాంతి - స్ఫూర్తిని ఛిన్నాభిన్నం చేయటం కాదు, పదే పదే అసత్యాలు మాట్లాడుతూ సత్యంగా నమ్మించడం కాదు. సామాజిక బాధ్యత అంటే వనరులను దుర్వినియోగం చేయడం, సంపదను నాశనం చేయడం కాదు. లక్షల కోట్ల కొద్దీ ఋణాలు తెచ్చి ప్రజల తలపై అంతకు మించిన వడ్డీలతో రుద్దడం కాదు. కోట్ల రూపాయల ప్రజల సొమ్మును మోసపూరిత బిల్లులతో స్వాహా చేయడం కాదు. సామాజిక బాధ్యత అంటే భూకబ్జాలు చేయడం కాదు. ఇవన్నీ చేసేవారు ప్రజాసేవకులా, దేశ (సమాజ) ద్రోహులా నిగ్గు తేల్చవలసిన సమయం పోలింగ్ రోజున ప్రజలకు వచ్చింది.


ప్రచార సమయంలో వినయం చూపి, గెలిచిన తరువాత రౌడీగా, దురుసుగా, కోతల రాయుడుగా, అహంకారముతో ప్రవర్తించి ఊరులో భయభ్రాంతులను సృష్టించిన నాయకులను ఎంతో మందిని చూస్తున్నాం.  చట్ట సభల హుందాతనాన్ని ఎలా నాశనం చేస్తున్నారో కళ్ళారా వీక్షిస్తున్నాం. విలువలు లేని రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అపహాస్యం చేస్తున్నారు. ఎవరైతే సమాజంలో, మన ఊరులో, చట్ట సభల్లో అసహ్యాన్ని సృష్టించరో వారికి మాత్రమే ఓటు వేయాలి. బూతులతో దుర్భాషలాడుతూ నేటితరం వారిని పాడు చేస్తున్న దుర్మార్గులకు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే విద్యావంతులు ఎంతో మంది ఓటింగ్‌కు రాకపోవడం వలన అరాచకులు, రౌడీలు, ఆర్థిక నేరస్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలోనికి జొరబడ్డారు. అందువలన, ఉన్న అభ్యర్థులలో మెరుగైన అభ్యర్థికి ఓటు వేయడం ఇప్పటి కర్తవ్యం. ఏ ఏ ప్రభుత్వాలు ఎటువంటి పాలన అందించాయో మనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఒక్క క్షణం నెమరువేసుకుని నిర్ణయం తీసుకోవాలి తప్ప డబ్బు, బ్రాంది, బిర్యాని ఇచ్చారని క్షణికావేశంలో ఓటు వేస్తే ఊబిలో కాలు వేసినట్లే! NOTA, అసలు ఓటు వేయకపోవడం వలన అరాచకులు, నేరస్తులకు లాభం చేకూరే ప్రమాదం ఉంది. యువత, విద్యావంతులు ఓటు వినియోగిస్తే ప్రభావం చాలా ఎక్కువ, "సమాజానికి లాభం”. ఈ దిశగా చైతన్యం వస్తే, మెల్ల మెల్లగా పరివర్తన సంభవమే.


కనుక, పోలింగ్ రోజున హోదా, అంతస్తు, వయస్సు తేడా లేకుండా ప్రతి ఒక్కరు బయటకు రావాలి, ఓటు వేయాలి. ఇది మనందరి సామాజిక బాధ్యత. మెరుగైన సమాజం, మనం కోరుకున్న మౌళిక సదుపాయాలు, వనరుల అభివృద్ధి కోసం, సంపద సృష్టించే నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. చెదపురుగులు, నల్లులు అవి ఆక్రమించుకున్న స్థలాలను ఎలాగైతే నాశనం చేస్తాయో మెదడంతా చెదబట్టినవానికి ఓట్లు వేస్తే రౌడీ మూకలతో మన ఊరు, రాష్ట్రాన్ని ఎన్నో విధాల ధ్వంసం చేస్తారు. ఇప్పటికే తప్పు పద్ధతులతో వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఇవి సరైన మార్గములోనికి రావాల్సిన ఆవశ్యకత ఉంది.  కనుక, ఇంట్లో కూర్చున్నా, సెలవు కదా అని పిక్‌నిక్, ఊరు వెళ్ళినా ఆ దుష్ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడి రాబోయే 5 సం.లు ఇబ్బంది పడేది ప్రజానీకమే ! రాజధాని లేని రాష్ట్రంలో నేడు నెలకొన్న దుర్భర స్థితిలో ఓటు వేయకపోతే రాబోయే 5 సం.లు మానసిక క్షోభ తప్పదు సుమా !


సర్వే జనాః సుఖినో భవంతు. 

                           

                         శ్రీరామపాద భాగవతర్


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper