దురాచార పరులకు కూడ “కార్తీక మాసం” వరమే !
దురాచార పరులకు కూడ “కార్తీక మాసం” వరమే !
ఈశ్వరుడు ప్రతి మనిషికి తప్పు దిద్దుకునే అవకాశమును ఇవ్వకనే ఇస్తాడు. అందుకు సంబంధించిన విచక్షణా జ్ఞానాన్ని కూడ ఏదో ఒక సందర్భములో ఇస్తాడు. ఆ తరువాతే శిక్షలను నిర్ణయిస్తాడు.
ఎవరికి కాలసూత్ర, రౌరవ నరక బాధలు ?
ఇతరుల ఆస్తిని దొంగతనంగా, మాయమాటలతో, నేరపూరితంగా కాజేసినవాడు, కాజేద్దామనే దురాలోచన చేసేవాడు (సహకరించేవాడు), దేవాలయాలు - క్షేత్రాల ఆగమశాస్త్ర విధివిధానాలు, పవిత్ర పద్ధతులకు ఆటంకం కలిగించేవాడు, వాటి ఆస్తి - ఆదాయాలను దుర్వినియోగం చేసేవాడు, వాటి పరిసర ప్రాంతాల పవిత్రతకు భంగం కలిగించేవాడు, పరుల భూమిని కబ్జా చేసినవాడు, ఉద్యోగ / వ్యాపార హాని కలిగించేవాడు, పొట్టగొట్టేవాడు, మిత్ర ద్రోహి, కష్టం – నష్టం – దుఃఖం – బాధ - అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం పొంది పిదప మర్చిపోయి అపకారం చేసేవాడు, చక్కటి కుటుంబములో కలహాలు సృష్ఠించేవాడు, భార్యాభర్తలను విడగొట్టేవాడు, వివాహ శుభకార్యక్రమాలను చెడగొట్టేవాడు, శాంతి సామరస్య ప్రయత్నాలకు విఘాతం కలిగించేవాడు, వేదశాస్త్ర కోవిదులైన బ్రాహ్మణులను అగౌరవపర్చేవాడు, సదాచారాన్ని ఆచరించనివాడు, పరమాత్మ పేరు దుర్వినియోగం చేసేవాడు, తాను అపవిత్రుడైయుండి పరులకి నీతి, జ్ఞాన బోధలు చెప్పేవాడు, నమ్మిన శిష్యులకు ద్రోహం చేసేవాడు, అసత్యం – అధర్మం – అవినీతి – అన్యాయం – అసూయ – అక్రమం - అక్రమ సంబంధం – కుయుక్తి - కుతర్కం – మోసం - హింస గుణాలు కలవాడు [పామరుడు నుండి రాజు, ప్రధానమంత్రి, (ఆధునిక/దుష్ట) పీఠాధిపతి వరకు ఎంతటివాడైనా సరే] కాలసూత్రము, రౌరవం మున్నగు ఘోర నరకయాతనలను పొంది, పిదప పురుగులూ అమేధ్యముతో నిండిన తప్త రక్త కూపములో పడవేయబడతాడని శ్రీమహావిష్ణువు గరుత్మంతునితో చెప్పిన కఠినమైన ధర్మసూక్ష్మాలు.
"బంధించి బాధించేవి - ఫలవాంచిత కర్మలు"
"ముక్తినిచ్చేవి - ఫలపరి త్యాగకర్మలు"
కాలసూత్రం, రౌరవం మున్నగు నరక యాతనల నుండి తప్పించుకోవడానికి సంవత్సరములో కొన్ని విశేషమైన తిథులు, దినములు, మాసములను ఈశ్వరుడు మనకు కరుణతో ప్రసాదించాడు. ఈ అవకాశాలను అప్రమత్తంగా ఉండి సముచితంగా సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. దురాచార పరులకి కూడ ఈ మాసం ఒక గొప్ప వరము. తమ కుటుంబం, సంతతి యొక్క మంచి కోరుకునేవారు తాము చేసిన దుష్కార్యాలకు పశ్చాత్తాపపడి, తప్పులు సరిదిద్దుకుని, ఇక మీదట తప్పు చేయకూడదనే సంకల్పం చేసుకుని ఈశ్వరుడుని శరణువేడటానికి కార్తీకమాసానికి మించిన సందర్భము మరొకటి లేదు. ఇకపై సదాచారంతో ధర్మబద్ధంగా జీవిస్తానని పశ్చాత్తాపంతో కూడిన సత్సంకల్పం చేసుకోవడానికి ఉత్తమమైన కాలం ఇది.
"పశ్చాత్తాపానికి మించిన మందు, ధర్మాచరణకు మించిన హోదా, పదవి లేదు"
శ్రీహరి నామస్మరణతో, ఈశ్వరుడి కృపకోసం ఆరాధించే అద్భుత కాలం “కార్తీక మాసం”. శ్రీహరి చాతుర్మాస్య కాలానంతరం నిద్ర నుండి మేల్కొనే పవిత్ర ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఈ మాసములోనే వస్తాయి. ఈ సందర్భముగా చేసే సూర్యోదయ నదీ, తీర్థ స్నాన-జపతపాదులు, రుద్రాభిషేకం, అఖండ పంచాక్షరి మంత్ర జపం, నామస్మరణ, ఉపవాస దీక్ష, సాయంత్రం తులసి తీర్థమే ఆహారంగా స్వీకరించడం, వస్త్రం, తులసి, సాలగ్రామ, ఉసిరి, తిల, దీప, పండ్లు, అన్న దానములు అనంతకోటి పుణ్యాన్ని కలిగిస్తాయి.
ఈ మాసమంతా ఉభయ సంధ్యలలో ప్రధానముగా తమ ఇంట
దీపారాధన చేయడం అత్యుత్తమం, ద్వితీయముగా శివ, విష్ణు ఆలయాలలో ధ్వజ-స్తంభం వద్ద దీప
ప్రజ్వలన చేయడం దైవీకం. ఆ తరువాతే మరెక్కడైనా. తమ కష్టార్జితముతో దీపాన్ని
వెలిగిస్తే, ఈశ్వరుడు మిక్కిలి సంతోషిస్తాడు, జీవితంలో వెలుగులను ప్రసాదిస్తాడు.
తమ దోషపరిహార నిమిత్తం తమ గృహములో దీపారాథన చేసి, కార్తీక పురాణాన్ని పఠించడం,
పంచాక్షరీ జపాన్ని అఖండంగా చేయడం శ్రేష్ఠం.
ఒకవేళ “ఏకాదశి - ద్వాదశి” వ్రతమును చేయలేకపోతున్న వారు, కార్తీక శుద్ధ “చతుర్దశి - పూర్ణిమ” దినాలలో చేయవచ్చు. పుణ్యం ఎదురుచూడకుండా ఈశ్వరుడుని ఆరాధించటం, సదాచారమును విధిగా నిర్వర్తించడం ముఖ్యం.
ఓం కార్తీక దామోదరాయ నమః 🙏
ఓం నమః
శివాయ !🙏
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
Note :
Rights reserved. Copy,
alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
