శివ - విష్ణు భేదం సృష్టించడానికి నీవు ఎవరు ?
శివ - విష్ణు
భేదం సృష్టించడానికి నీవు ఎవరు ?
చెన్నై, 12 జూలై 2023 : నగరములో జరిగిన శ్రీమద్భాగవత సప్తాహము సందర్భముగా ఆధ్యాత్మికవేత్త తెలుగు, తమిళ ప్రవచనకర్త నామసంకీర్తన గాయకులు శ్రీరామపాద భాగవతర్ ఆసక్తి కలిగించే ధర్మ వ్యాఖ్యానం చేశారు. అందులోని ఒక విషయం ఇక్కడ క్లుప్తముగా మీకోసం ఆయన మాటల్లో.
నీ జతలో నీ మనసులో ఉన్న వస్తువు "మనసు" నీకు సరిగానూ, అనుకూలముగానూ లేదు. నీ ఇంద్రియాలు నీ అధీనములో లేవు. మరి, ఎక్కడో ఉన్న వైకుంఠ, కైలాసవాసుల గురించి నీకెందుకు భేదం? నీతోనే వాసం చేస్తున్న పరివారము, పరిచారకులను అక్రమాలు చేయకుండా నియంత్రించలేవు కాని నీకు వైకుంఠ, కైలాసవాసులను విభజించి మాట్లాడటం పరిపాటి ఐపోయింది. శివ-కేశవులకు (వారికి) లేని అనుభూతి నీకెందుకు ?
శివ-కేశవుల స్థాయి తెలుసుకోవడానికి బ్రహ్మాది సమస్త దేవతలు, ఋషులు, సూత శౌనకాది మహా మునులకే సాధ్యం కాలేదు. వారు సహస్ర కాలాల పాటు చేసిన యజ్ఞ - యాగ - తపశ్శక్తికి అంతుచిక్కలేదు. అటువంటిది, ఎన్నో లౌకిక వ్యవహారాలతో ముడిపడిన నీ భగవద్భక్తి ఏపాటిది? ఈ లెక్కన వారి దర్శన భాగ్యం లభించాలంటే నీకు ఎన్ని కల్పాల కాలం కావాలో? నాలుకను అదుపులో పెట్టుకున్నవాడే నారాయణ అనుగ్రహం పొందుతాడు.
వేద శాస్త్రం ఏమి చెప్పింది ?
रुद्रस्य परमो विष्णुर्विष्णोश्च परम: शिवः ।
एक एव द्विधा भूतो लोके चरति नित्यसः ॥
దీనికి విరుద్ధముగా ఎండు బెరడు సిద్ధాంతాన్ని సృష్టించి మాట్లాడుతున్నప్పుడే నీ ఆధ్యాత్మిక స్థితి, పరిపక్వత తేలిపోయింది. ఎవరైతే శివ - విష్ణు భేదాన్ని చూస్తారో వారు మరు జన్మలలో రోగిష్టులుగా పుడతారని శాస్త్ర వచనం. వేద-శాస్త్ర-పురాణ గ్రంధాలను భక్తి భావముతో తిరగవేస్తే కదా తత్వం తెలిసేది?
కలి ప్రభావము వలన నీ మనసు, నా మనసు కల్మషమవడానికి అవకాశం ఉంది. కాని, యుగ యుగాలు గడుస్తున్నా వేద-శాస్త్ర ధర్మాలు, మనువులు - ప్రజాపతులు - మహర్షుల ప్రవచనాలు, భాష్యాలు మారవు. అవి కాలానికి అతీతం. ఎవరైతే వాటిని యథాతథముగా మనకు అందిస్తున్నారో వారే మహనీయులు, పరమపూజ్యులు అవుతారు కానీ ఎవరుపడితే వారు కాదు. వాటిని వక్రీకరించే వారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
నీవు తప్పుడు మార్గములో ఉన్నావని, నిన్ను నమ్మినవారిని దుర్మార్గాన (దుః మార్గము) పడవేయద్దు. వారిని పాపులుగా తీర్చిదిద్దవద్దు. నీవు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నందుకు సంతోషించాలా, లేదా శైవ - వైష్ణవ ద్వేషాన్ని పురిగొల్పుతున్నందుకు బాధపడాలా? ఒకటి మాత్రం స్పష్ఠం "నీకు ఇంకా వైరాగ్యము ప్రాప్తి అవలేదు". వైరాగ్యము అనేది కాషాయ వేష ధారణతోనో, గడ్డం పెంచుకుంటేనో, ఆరు గుడులు కడితేనో అరవై ప్రవచనాలు చెబితేనో పెద్దెత్తున పారాయణలు నిర్వహిస్తేనో, నిత్యం టి.విలో కనిపిస్తేనో, వి.ఐ.పిలు సందర్శించి పొగుడుతేనో రాదు. వివేకము (జ్ఞానము) తోనే వైరాగ్యము సాధ్యం. ఇది తెలుసుకోవాలి. ఇకనైనా, దుస్సావాసాలతో, దుస్సాహసాలతో కాలమును వృధా చేయక ఈశ్వర తత్వాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నముతో కూడిన సాధన చేయి. ఇది ఇహ-పర లోకాలలో నీకు ఉపయుక్తముగా ఉంటుంది సుమా !
శ్రీ భగవతే వాసుదేవాయ నమః 🌹👏
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
