Must Read .. ఆధ్యాత్మిక గురువు పాదాలకు పూజ చేస్తే కలిగే ప్రయోజనం !
గురువు పాదపూజ ఫలితం !
మీ పాదం మా ఇంట్లో పెడితే చాలని, ఏ గురువుని ఇంటికి తీసుకువచ్చి పాదపూజ చేసినా లేదా ఆయన నెలకొల్పిన ఆశ్రమానికి వెళ్ళి పూజలు చేసినా మన మనసులో ఈశ్వరుని తత్వం, ధర్మాచరణ, స్వధర్మం, సత్యము తెలుసుకునే దిశగా మార్పు రానంతవరకు ప్రయోజనము శూన్యం. అవతలి వ్యక్తికి మాత్రం పాదానికి లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలు లాభం. ఇదే ... నేటి ప్రపంచంలో విస్తృతమైపోయింది. కనుక వృధా ప్రయాసలు త్యజించాలి. ఆధునిక ఆధ్యాత్మిక భక్తి ప్రమాదకరం. ఇక్కడ అవతలి వ్యక్తి అంటే మన మధ్యే విస్తృతముగా తిరుగుతున్న కలి ప్రభావిత ఆధునిక గురువు / స్వామీజీ, మూలాలు లేని 'అవ' తార స్వరూపులు అని అర్థం. 'అవ' అంటే అక్రమం, నిషిద్ధమైన లక్షణం కలిగిన అని అర్థం. వీరు కామ (కర్మ) గురువులు అంటే ఎదో విధముగా ఎదురు ఆశిస్తారు. అక్రమాలను డబ్బుతో నొక్కిపెడతారు. వీరి మాటలకు అందరం బురిడీ కొట్టాల్సిందే. మనం బాహ్యంగా చూసేది వేరు. ఇది పసిగట్టడం చాలా కష్టం. గ్రహించాలంటే, ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, సాధన అవసరం.
గురువు యొక్క పాద-పూజ చేసి నీ మిగతా స్వధర్మాన్ని నిర్వర్తించనక్కరలేదని ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ గురువు కూడ ఈ విధంగా దిశానిర్దేశం చేయడు. ఒక్కటి నిఘూఢంగా పరిశీలిస్తే గురువులు, ఆధునిక స్వామీజీలందరూ ప్రతి క్షేత్రాన్ని దర్శిస్తారు. సనాతన గురు-పరంపర నుండి వచ్చిన జగద్గురువులు ప్రతి భక్తుడికి తీర్థ-క్షేత్రాల దర్శన ప్రాముఖ్యతను తెలియజేస్తుంటే, ఆధునిక స్వామీజీలు మాత్రం తాను అవతార పురుషుడునని పదే పదే డబ్బా కొట్టుకుంటూ, పెద్ద మొత్తంలో తాంబూలం ఇచ్చి ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తున్న పండితులచేత డబ్బా కొట్టించుకుంటూ, తన పాదాలు పట్టుకుంటే చాలని ప్రజలను తప్పు మార్గాన పడేసి వారి ఆస్తిపాస్తులను ప్రపంచ వ్యాప్తంగా కాజేస్తూనేయున్నారు. గుడులు గోపురాలు కట్టినవారు, గడ్డాలు కాషాయ వస్త్ర ధారణ చేసినవారందరూ గురువులైపోరు. ఇందులోనూ లౌకిక వాంఛ కలిగి వ్యాపార ధోరణితో ఆధ్యాత్మికాన్ని ఎంచుకున్నవారు ఎందరో ! మహా అయితే వీరిని హిందూ ధర్మ ప్రచారకులని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంలో దౌర్భాగ్యం అంటే ఇదే ! ఇది విమర్శ కాదు, ఆవేదన. ఇప్పటికీ నిజమైన సన్యాసులు, అవధూతలు ఉత్తర-దక్షిణ భారతంలో అక్కడక్కడా ఉన్నారు. వీరిని భౌతికంగా చూస్తే మనసు చెలిస్తుంది. కాని, వారు మాత్రం బ్రహ్మంతో లీనమై ఉంటారు. దురదృష్టవశాత్తూ మనకు వారు గురువులుగా పనికిరారు. సనాతన సంప్రదాయ ధర్మాన్ని, పద్ధతులను, మార్గాన్ని విడనాడుట క్షేమం కాదు. వయసు మీరిన తరువాత తెలుసుకుంటే ప్రయోజనం లేదు సరికదా ప్రశాంత జీవనం కరువై రోగబాధ, మనోవేదనలు ఎక్కువౌతాయి. అది ముందు జన్మలకు మంచి సంకేతం కాదు. అందుకనే విషయ పరిజ్ఞానం సంపాదించి, అన్వేషించిన తరువాతే సరైన గురువుని ఎంచుకోవాలి.
మరో ప్రక్క నిష్కామ గురువులు ఉన్నారు. మనకు విద్య, వేదం, నాట్యం, సంగీతం, కళలు, అనుష్ఠానం నేర్పిన అధ్యాపకులు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రవచనాల ద్వారా జ్ఞానాన్ని అందించే బ్రహ్మశ్రీలు. వీరికి పాద-పూజ చేస్తే వారి ఆశీర్వాదం అభివృద్ధిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే వీరి ఉద్దేశ్యమే మన పురోగతి.
ఇక వందల సంవత్సరాలుగా సనాతనముగా వస్తున్న అవిఛ్ఛిన్న గురు-పరంపరలోని గురువుల అనుగ్రహ బలం గురించి చెప్పడానికి పదాలు, మాటలు చాలవు. వారి అపార జ్ఞాన సంపద, దైవబలం, మహిమ మన ఊహకు అందదు. అటువంటి పురుషోత్తముల పాద-సేవ జన్మ సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది.
ఎటువంటి అవసరమైనా సరే, వేదోత్తముడైన బ్రాహ్మణుని సమక్షములో నువ్వు స్వయముగా నీ ఇంట్లో చేసే జపం / పరిహార జపం, పారాయణ, పూజ, అనుష్ఠానం, హోమం, దానం మాత్రమే ఫలితాన్ని - పుణ్యాన్ని త్వరిత గతిన ఇస్తాయి. అందునా నేటి కలికాలంలో నామస్మరణే ప్రథానం. ఇది ఎంతో సరళం. వ్యయప్రయాసలు లేవు. నమ్మక - అపనమ్మక సమస్యలు లేవు. ఆఫీస్‌లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా మనసులో చేతనైన భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండడం ఎంతో మేలు, శ్రేయస్కరం. మనసులో చేసే స్మరణకు ఎటువంటి శారీరిక నియమాలు లేవు.
ఇక ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి, ఎవరు నిజమైన గురువులో, మనం అనుసరిస్తున్న స్వామీజీ ఏ కోవకు చెందినవారో తెలుసుకోవాలంటే, నేను సనాతన ధర్మాచరణతో శాస్త్రీయముగా వ్రాసిన ఎడిటోరియల్ (ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ మధ్య పేజి) తప్పక చదవండి. ఎంతో విశ్లేషణ, పరిశోధన, అవగాహనతో కొనసాగిన ఈ వ్యాసం, గుడ్డిగా పరుగుపెడుతున్న నేటి ఆధునిక తరానికే కాకుండా సంసార సాగరంలో పలు సమస్యలతో అలసిపోయి ఏమీ తోచక ఎవరో చెప్తేనో, టి.వి లలో చూసో ఎక్కడికో వెళ్ళి ఎవరి కాళ్ళో పట్టుకుంటున్న గృహస్తులకు కూడా మార్గదర్శంగా ఉంటుంది. ఇక్కడ ఆ లింక్‌ను ఇస్తున్నాను. సత్యం తెలుసుకుని, సన్మార్గాన్ని అనుసరించాలనే జిజ్ఞాస ఉంటే చదవచ్చు.
ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి! | sri rama pada bhagavatar article Guru Purnima (andhrajyothy.com)
https://www.andhrajyothy.com/2021/editorial/sri-rama-pada-bhagavatar-article-guru-purnima-418575.html
https://sriramapada.blogspot.com/2023/12/blog-post.html
నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే 🌷👏
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.

