తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు, జాగ్రత్త 🧐
తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు, జాగ్రత్త
చెన్నై, మే 11 : కుటుంబములో సంస్కార లోపం, దాని పర్యవసానాల గురించి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త శ్రీరామపాద భాగవతర్ తెలియజేశారు. దీని సారాంశం క్లుప్తముగా ఇచట పొందుపరుస్తున్నాం.
నేటి ఆధునిక సమాజంలో పిల్లల్ని తప్పు మార్గానికి మళ్ళిస్తున్న మనుషులు, శక్తులు ఎక్కువైపోయాయి. తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు. దీని దుష్ప్రభావాలు అనుభవిస్తున్నా తెలుసుకోలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి.
మొట్టమొదలుగా తల్లితండ్రులను గౌరవించడం, వారి మాటలను పాటించి నడుచుకోవడం, వంశపారపర్యంగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలని పాటించడం నిత్య కర్తవ్యంగా అందరు తప్పక చేయాలి. మన కులదైవము, గ్రామదేవత పట్ల భక్తి కలిగి, నిత్యం మనసులోనైనా స్మరించుకోవాలి. వీటన్నిటినీ పిల్లలకి నేర్పించాలి. ఆ తరువాతే, చివరిగా, మూడవ వ్యక్తి (గురువైనా సరే) కి వందనములు, దానాలు, సేవలు. అందుకనే మన సనాతన సంప్రదాయంలో "మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య (గురు) దేవో భవ " అన్నారు.
చిన్న వయసులోనే పిల్లలకు సంప్రదాయ పద్ధతులు నిత్యకృత్యంగా అలవాటు చేయాలి. లేదంటే, వచ్చే పరిణామాలకి, ఆ పిల్లలే తరువాత కాలంలో, పెద్దలను బాధ్యులుగా చేస్తున్న సంఘటనలు ఇప్పటికే పలుచోట్ల చూస్తున్నాము. సదాచారం నుండి విడిపోతే వచ్చే దుష్ప్రభావాలే ఇవి. ఎక్కడ చూసినా పెద్దలంటే గౌరవం లేకపోవడం, చిన్న పెద్ద లేకుండా వితండ వాదాలు చేయడం, ఆర్భాటాలకు పోయి భార్యా భర్తలు కొట్లాడుకోవడం, అహంకారముతో విడాకులు కోరుకోవడం, అక్రమ సంబంధాలతో దౌర్భాగ్యమైన జీవితం గడపడం, ఇతరులతో పోటీగా తాహతకు మించి అప్పులు చేసి కోలుకోలేకపోవడం, ఒకే కుటుంబంలో తోబుట్టువుల మధ్య విభేదాలు, ఈర్ష్య ద్వేషాలు, భర్త మాట భార్య వినకపోవడం, భార్య మంచి సలహాలు భర్త వినకపోవడం, పిల్లలు ప్రేమ చాటున జీవితాలను నాశనం చేసుకోవడం ఇలా ఎన్నో !
కొంతమంది, ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలను మింగలేక, కక్కలేక, సరిదిద్దలేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటిలో ఒక్కడు సంస్కారవంతుడున్నా ఆ ఇంటిల్లిపాదికీ భాగ్యమే. అతడిని (ఆమెను) ఆదర్శముగా తీసుకొని అనుసరించాలి తప్ప, ఈర్ష్యకు లోను కాకూడదు. ఇలా చేస్తే త్వరితగతిన మంచి మార్గములో పడటానికి ఆస్కారం ఉంది. ఎక్కడికో వెళ్ళి ఎవరి కాళ్ళో పట్టుకునే అవసరం రాదు. ఒక ప్రక్క సంస్కార లోపాన్ని అంగీకరించలేక, మానసికముగా బాధపడుతూ రోగాలను, రక్తపోటు, చక్కెర వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తి ఉన్నా ఇదీ ఒక దరిద్రమే. సమస్య పరిష్కారానికి మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్తే గజిబిజి మాటలతో మనసులో గందరగోళం సృష్ఠించటం తప్ప పరిష్కారం చేయడు, చేయలేడు. పైగా ఆ పరిహారం చేయి, ఇది చేయి అని ఉన్నంతవరకు గుంజుకుని, ఆ పైన నీ పూర్వజన్మ కర్మ అని క్రమేణా మిమ్మల్ని విస్మరిస్తాడు. అప్పుడు ఇంటి పెద్దలు తలపట్టుకుని కూర్చుంటున్నారు. ఎక్కడ చూసినా ఇవే అనుభవాలు. "చేతులు కాలాక కాలు పట్టుకోవడం అంటే ఇదే". అందుకనే మన పెద్దలు ఎప్పుడో హెచ్చరించారు "మొక్కై వంగనిది మానై వంగునా" అని.
ఆళ్వార్ దివ్య ప్రబంధంలో ఉపదేశించినట్లు "మనం ఉన్న స్థలమే (ఇల్లే) వైకుంఠం, వేంకటం". వ్యయప్రయాసలు అనవసరము. ప్రతి రోజు (ధర్మాచరణలో ఉన్న) అమ్మ - నాన్నలకు అంకితమే. ఈశ్వరుడి పాదాలు పట్టుకుని, ఇంట్లో నిత్యం దీపారాథన చేసి మనసులో నామస్మరణ చేస్తే సమస్యలు ఎందుకు పరిష్కారము కావు ? సాధన చేస్తే కదా సుఖం లభించడానికి ! సూక్ష్మం తెలుసుకో, జీవితాన్ని సులువుగా, సంతోషంగా చేసుకో !
సర్వే జనాః సుఖినో భవంతు 🌹
- శ్రీరామపాద భాగవతర్, ఆధ్యాత్మికవేత్త
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.