పుష్కర స్నాన ఫలితం ఎవరికి లభిస్తుంది?
పుష్కర స్నాన ఫలితం ఎవరికి లభిస్తుంది?
చెన్నై, ఏప్రియల్ 9, 2023 : గంగా నది పుష్కరాలు ఈ నెల 22వ తేది నుండి మే 3వ తారీఖు వరకు జరుగనున్న నేపథ్యంలో, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త - సంకీర్తనాపరుడు ఐన శ్రీరామపాద భాగవతర్ ధర్మ సూక్ష్మం, ఫలితాలు, సూచనలు తెలియజేశారు. అణునిత్యం ధర్మనిష్ఠ, బ్రహ్మనిష్ఠ లో ఉన్నవారికి, వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ లోకశాంతి కోసం తపించేవారికి, భగవన్నామ పారాయణ, యజ్ఞ - యాగాదులు చేసేవారికి, నిత్యాగ్నిహోత్రులు - వారికి సహకరించిన వారికి, పరోపకారులకు, దేవాలయాల రక్షణ – పోషణ - సేవ చేసేవారికి, గోశాలల అభివృద్ధి, గో సంరక్షణ, గోసేవ, గోపూజ చేసేవారికి, గోగ్రాసము అందించేవారికి, నిరంతరము దాన ధర్మాలు చేసేవారికి, విద్యా దానం చేసేవారికి, వేద - శాస్త్ర - పురాణ - ఇతిహాస గ్రంధాల జ్ఞానాన్ని ఇతరులకు లాభాపేక్ష లేకుండా పంచినవారికి, ఇంటి పెద్దలు - వృద్ధులకు గౌరవముతో సేవ చేసేవారికి, వేద పండితులను - వేద పాఠశాలలను - వేద విద్యార్థులను పోషిస్తున్నవారికి, సమాజములో శాంతి - సామరస్యం కోసం పుణ్యకార్యాలు చేసేవారికి, మానవ జీవిత పరమావధిని తెలుసుకొనినవాడై తీర్థయాత్రలు - క్షేత్ర దర్శనాలు చేసేవారికి, నిష్కళంక - నిష్కల్మష - నిజమైన గురువుల శుశ్రూష చేస్తున్నవారికి పుష్కర స్నాన ఫలితం వెంటనే అక్షయముగా లభిస్తుందని శ్రీరామపాద శాస్త్రోక్తముగా వివరించారు.
మరొక ప్రక్క వేడుకగానో, పిక్‌నిక్‌గానో, పేరు ప్రఖ్యాతుల కోసమో, విహారయాత్రగానో పుష్కర స్నానము కాదు గదా, మామూలు నదీ స్నానం చేసినా పుణ్యం లభించదని ఆయన అన్నారు. అసత్యం, అక్రమం, అన్యాయం, అవినీతి, అధర్మం లో ఉన్నవాడికి, పరులను - బలహీనులను - సామాన్యులను - భక్తులను మానసికంగానూ భౌతికంగానూ గందరగోళమునకు గురిచేసి లౌకికముగానూ, అలౌకికముగానూ మోసము చేస్తున్నవారికి, కుటుంబ - ఉద్యోగ - వ్యాపార - రాజకీయ - అధికార - ఆధ్యాత్మిక - సామాన్య జీవితాలలో అంగ బలం, ఆర్థిక బలం, అధికార బలములతో “నీతిమంతులకు” ప్రత్యక్ష, పరోక్ష హింస కలిగిస్తున్నవారికి ఎన్ని క్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, అతిరుద్ర మహా యజ్ఞయాగాదులు, పారాయణలు, దాన ధర్మాలు చేసినా ఫలితం శూన్యమేనని, ఇటువంటి వారికి “కలి” వశమవ్వడమే కాక, లక్షల జన్మలు పాప జీవిగా పుడతారని పురాణాలలో ఉద్ఘాటించారని శ్రీరామపాద చెప్పారు.
రోగం
శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే
వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ||
పుష్కరుడు
బ్రహ్మాది సకల దేవతలతో ఈ 12 రోజులు గంగా నదిలో ప్రత్యక్షముగా నివసించి సదాచారవంతులను
తక్షణమే అనుగ్రహిస్తారని, ఎవరిలోనైతే ధర్మాచరణ వైపు మానసికముగా పరివర్తన వస్తుందో వారి
భవిష్యత్తు దివ్యదృష్టిలో చూసి, వారి పాపరాశి త్వరగా నశించాలని ఆశీర్వదిస్తారని, అంటే
అంతర్గత సంకల్పం - బహిర్గత నడవడిక సరితూగాలని, అప్పుడు వారికి ఇహ-పర లోక పుణ్యప్రాప్తి
కలుగడానికి పుష్కర స్నానం, ఇతరత్రా ధర్మ కార్యాలు తోడ్పడతాయని శ్రీరామపాద భాగవతర్ తెలియజేశారు.
ఏదో మూడు మునకలు వేస్తే అన్ని పాపాలు పోతాయనుకుంటే పొరపాటని, అలా ఐతే ధర్మము అనే పదానికి
పవిత్రత, అర్థం ఉండదని లోకములో పుణ్యాత్ములే ఎక్కువై రామరాజ్యం నెలకొన్నట్లే కదా అని
ఆయన ప్రశ్నించారు. కాని, ఇప్పుడు ధర్మం ఒక్క పాదముతోనే నిలబడానికి కష్టబడుతోందని ఆయన
బాధ వ్యక్తపరిచారు. అందుకనే పండితులు ధర్మాన్ని నిక్ఖచ్చిగా చెప్పాలని సవరణలు సూచించకూడదని
శ్రీరామపాద భాగవతర్ అభ్యర్థించారు. నేటి కాలములో వ్యావహారికంగా దేనికైనా సవరణలు ఉండవచ్చునేమో
గాని, వేదశాస్త్ర ప్రమాణాలు - ధర్మాచరణలకు సవరింపులు ఉండవని, ఎన్ని యుగాలు గడిచినా అవి మారవని, అందువలన ప్రతి
ఒక్కరు ధర్మ సూక్ష్మాలను తెలుసుకుని నడుచుకుంటే అన్ని రకాలుగా వారికి, వారి సంతానానికి
మంచిదని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.
చివరిగా,
ధర్మాన్నే ఆశ్రయించిన వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, ఆర్థిక స్థోమత లేనివారు ఈ 12 రోజులు
గంగ...గంగ...గంగ అని 10 సార్లు స్మరిస్తూ “సూర్యోదయ సమయానికి” తమ గృహాలలో (సంకల్ప పూర్వకముగా)
పరిశుద్ధ స్నానం చేసినా ఫలితం లభించకపోదని
శ్రీరామపాద భాగవతర్ సూచించారు. ఇక పుష్కర నదీ స్నానానంతర విధులు, పుణ్యకార్యాలు అందరికి
తెలిసినవేనని ఆయన అన్నారు.
హర
హర గంగే 🌹🙏
- శ్రీరామపాద భాగవతర్, ఆధ్యాత్మికవేత్త
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.


.jpg)
