శీలం, గుణం ఎలా ఉండాలి ? - ధర్మ సూక్ష్మం
శీలం, గుణం ఎలా ఉండాలి ?
(ఆధ్యాత్మికం - ధర్మ సూక్ష్మం)
ఈ నియమం ఎవరికైనా, ఎంతటివారికైనా,
మహానుభావులకైనా, సామాన్యుడికైనా, ధనవంతుడికైనా, గురువులకైనా ఒక్కటే !
కీర్తి రెండు విధములుగా సంపాదించవచ్చు. ఒకటి, సభలు-సమావేశాల్లో ప్రముఖులచే పొగడ్తలతో కూడిన ప్రసంగాలతోనో, కళలతోనో-కరతాళధ్వనులతోనో, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించో సంపాదిస్తే, రెండవది మంచి నడవడికతోను, ధర్మముతో మిళితమైన జ్ఞానంతోను అయి ఉంటుంది.
అంటే నీవు సంపాదించిన ధనం, ప్రతిష్ఠ, పలుకుబడి గురించి,
నీ ధర్మాచరణ, సత్యము, నీతి, నిజాయితీ, నైతిక విలువ, శీలము, గుణములను చూసి నీ
"ఛాయ (నీడ)" గర్వపడాలి. అప్పుడే నీవు సాధించినదానికి సార్థకత. ఎందుకంటే
అదొక్కటి మాత్రమే నువ్వు చేసిన ప్రతిపనికి సాక్షి. నువ్వు బాహ్యంగా ఎలా
ప్రవర్తించావో, లోలోపల ఏ మనస్తత్వంతో ఎటువంటి శీలంతో ఉన్నావో దానికే తెలుసు. అది
నిన్ను వదలదు, నీవు వదిలించుకోలేవు కూడా! నీ పర్వతమంత కీర్తి, ఆకాశమంత మదము,
సాగరము లాంటి సంపద, పలుకుబడి, మంది మార్బలం ఎవరూ కూడా దానిని నిర్మూలించలేరు.
కారణం...అది అగ్నిలాంటిది. ఎప్పుడైతే నీ "ఛాయ(నీడ)" నిన్ను చూసి
గర్వపడుతుందో అప్పుడే నీకు పరమాత్మ కృప కలిగినట్లు, జన్మ ధన్యమైనట్లు. అలా
కాకపోతే, నీవు కలిపురుషుడి ప్రభావంలో కొట్టుకుపోతున్నావని, కాలిపోతున్నావని
అర్థం! దీని పర్యవసానాలు, పరిణామాలు, ఫలితాలు రాబోయే జన్మలలో వికృతంగా ఉంటుంది.
శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో సుస్పష్ఠంగా చెప్పినట్లు "పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి ప్రాణి మరలా పుట్టక తప్పదు". దీనికి ప్రత్యక్ష సాక్షి మన కళ్ళముందే కనబడుతుంది. ఒకే ఊరిలో ఒకే క్షణములో ధనిక - పేద వ్యత్యాసం లేకుండ ఒకిద్దరు అంగ వైకల్యంతో పుడుతున్నారు. ఇది విచారకరమైనదే ఐనా, కారణం పూర్వజన్మ కర్మలు మాత్రమేనని ఆచరణాత్మకంగా ఋజువు. అంతెందుకు, మన మధ్యే తిరుగుతున్న ఎన్నో లక్షల జీవరాసులు - చీమలు, పాములు, కుక్క, పంది, పక్షులు, పురుగులు, దోమలు, చీమలు, కాకులు, వన్యమృగాలు, అవయవలోపం గల జీవులను చూస్తున్నాము. మరి అవి అలా, మనం ఇలా! శ్రద్ధగా చదివితే మన చేతిలో ఉన్న పురాణ, ఇతిహాస గ్రంథాలు ప్రతి విషయాన్ని తెలియచేస్తాయి.
అందువలన బాహ్యమైన ఆర్భాటాలు, హంగులు, భారీ కట్టడాలు,
పార్కులు, హావభావ వేషధారణలు, గడ్డాలు, గోపురాలు, వనాలు, భవనాలు చూసి దైవం ముసుగులో
వ్యాపారం చేసేవారిని, వారి తేనె లాంటి పలుకులని విని మాయలో పడ్డావా, మోసపోయావు. ఆశ్రమాల
పేరిట ‘అవ’దూతలు సంచరిస్తున్నారు. నిజం కాలకూట విషంలాగానే ఉంటుంది. భయంకరంగా ఉంటుంది.
నమ్మటానికి మనసు అంగీకరించదు. చెపితే చెవులు వినవు. చూస్తూ ఉన్నా కళ్ళు గుడ్డివౌతాయి.
ఇవన్నీ అధిగమించి తెలుసుకుని చేతులెత్తి "ఈశ్వరా ! నేను ఊబిలో పడిపోయాను. బంధించేశారు.
నన్ను బయటపడవెయ్యి" అని వేడుకుంటే, ఆ విషం నుండి నిన్ను, నీ పిల్లలను, నీ ఆస్తిని
కాపాడి అమృతము లాంటి అర్థవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. నేటి ఆధునిక కాలంలో మంచి
చెప్పేవాడిని పరిహాసం చేయడం పరిపాటి అయిపోయింది. ఇదే కలి అంటే ! పాపం హరించుకుపోయి,
పుణ్యం లభించాలనే సత్కర్మ ఉన్నవారికే ఈ విషయంపై తీవ్రత అర్థమౌతుంది.
నిజమైన సనాతన సంప్రదాయ సంస్కారము అలవర్చుకో. నీదైన జీవితాన్ని సరళంగా తృప్తితో సాగించు. తెలియకపోతే, చరిత్ర కలిగిన పవిత్ర గురు-పరంపరలోని గురువునో, ఆచార్యుడినో ఆశ్రయించాలి. వీరే అసలైన మార్గదర్శం చేయగలరు. అదే నీకు శ్రీరామరక్ష! ఈ కాలానికే చెందిన కంచి పరమాచార్య, శృంగేరి శంకరాచార్యులు, శ్రీమద్రామానుజ పరంపరాగత జీయర్ ఆచార్యులు, ఈ మధ్యే వైకుంఠ ప్రాప్తి పొందిన ఉడిపి పెజావర్ విశ్వేశతీర్థులు ఈ పవిత్ర కోవకు చెందిన పురుషోత్తములు. కలి గురువులు, స్వామీజీలు సంచరిస్తున్నారు. విశ్వసనీయమైన మూలాలు లేని వారిని ఆశ్రయించడం ప్రమాదం సుమా ! తస్మాత్ జాగ్రత్త !
- శ్రీరామపాద భాగవతర్, ఆధ్యాత్మికవేత్త
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
.jpeg)
.jpeg)