ఉపనయనం చిన్న వయసులో చేయడం వృధానా ?
ఉపనయనం చిన్న వయసులో చేయడం వృధానా ?
బ్రాహ్మణులను అగౌరవ పరిస్తే ఏమి జరుగుతుంది ?
ఆగష్టు 11, 2022 : చాలామంది తల్లితండ్రులు ఎంతో కుతూహలంతో సంప్రదాయ బద్ధంగా తమ కుమారులకు చిన్న (5 - 7 సం.ల) వయసులోనే ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి ఉపనయనం చేస్తున్నారని, కాని అది ఒక వేడుకగానే గుర్తుపెట్టుకోవలసిన దుస్థితి నేడు నెలకొందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ విచారం వ్యక్తపరిచారు.
శ్రావణ ఉపాకర్మ, జంధ్యాల పౌర్ణమి సందర్భముగా ఆయన మాట్లాడుతూ, ఎంత మంది క్రమం తప్పకుండా సంధ్యావందనము చేస్తున్నారు? ఎంతమంది తల్లితండ్రులు వటువులతో సంధ్యావందనము చేయించగలుగుతున్నారు? గాయత్రి జపం ప్రాముఖ్యత, పవిత్రత, మహిమ, సత్ఫలితాలు పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని ఆవేదన వ్యక్తపరిచారు. చిన్న వయసులో చేసే ఉపనయనానికి అర్థమే లేకుండా చేస్తున్నారని, ఇది అటు తల్లితండ్రులకు, ఇటు పిల్లవాడికి ఎంతో పాపమని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ముందు ముందు అనుభవించవలసివస్తుందని శ్రీరామపాద అన్నారు. వందల రూ. ఖర్చు చేసి పనికిరాని సినిమాలు, గంటల కొద్దీ టి.వి-మొబైల్ చూడడానికి, హోటల్‌కు వెళ్ళడానికి, అథన ప్రసంగానికి ఎంతో కాలం వృధా చేస్తున్నారు గాని ఒక్క 10 ని.లు సంధ్యావందనము చేయడానికి భక్తి, శ్రద్ధ చూపరు కదా, తల్లి తండ్రులు కూడ నిర్లక్ష్యం వహిస్తున్నారని శ్రీరామపాద భాగవతర్ వాపోయారు. సంధ్యావందనము చేయక, ఎన్ని పారాయణలు, హోమాలు, జపాలు, గుడిలో ప్రదక్షిణలు, తీర్థయాత్రలు చేసినా, ఏ గురువుకు మ్రొక్కినా ఫలితం శూన్యమని ఆయన నొక్కి ఒక్కాణించారు.
వేదోక్త కర్మానుష్ఠానం నిర్విరామంగా చేస్తూ "సర్వే జనాః సుఖినో భవంతు" అని నిత్యం పరితపిస్తూ ఉండేవారు బ్రాహ్మణోత్తములు. అందుకనే "బ్రాహ్మణో బహుజన ప్రియః" అనేది సుప్రసిద్ధ వాక్కని శ్రీరామపాద అన్నారు. ఏ పుణ్యకార్యం చేసినా, సంధ్యావందనములోనూ చివరికి ఫలశృతిగా "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ..." అని ప్రార్థిస్తారు. అంటే గో, బ్రాహ్మణుల సమేతముగా సమస్త వర్ణములు, 84,00,000 జీవరాశులు నిత్యం శుభముగా ఉండుగాక అని అర్థం. అంతటి గొప్ప మనస్తత్వం కలిగిన వారు బ్రాహ్మణులు. అందుకనే యుగయుగాలుగా చక్రవర్తులు, రాజులు, పాలకులు, వ్యాపారవేత్తలు బ్రాహ్మణులను అత్యంత భక్తి, శ్రద్ధలతో గౌరవించేవారని, తత్ఫలితముగా సర్వకాల సర్వావస్థలలోనూ రాజ్యం, ప్రజలు ఎంతో సిరిసంపదలు, శుభిక్షముతో వర్ధిల్లారని గత చరిత్రలను శ్రీరామపాద ఈ సందర్భముగా గుర్తుజేశారు. ఎక్కడ బ్రాహ్మణులకు సరైన స్థానము, గౌరవము లభిస్తుందో అక్కడ సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, బ్రాహ్మణులు నేటి కాలంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటున్నారని, వీటన్నిటినీ అధిగమించాలంటే ముఖ్యమైన ఆయుధం విధిగా "ప్రతిదినం సంధ్యావందనము" చేయడమని, ఆ శక్తితో జీవితం సంతోషంగా, తృప్తిగా ఉంటుందని, లేదంటే పరిణామాలు ఎదో రూపంలో వెంటాడుతూనే వుంటాయని ఆయన హెచ్చరించారు. లోక క్షేమానికి బ్రాహ్మణుల పాత్ర ఎంతో మహత్తరమైనదని, దీనికి సాధన చిన్న వయసులోనే మొదలవుతుందని, ఇది శాస్త్ర నిర్దేశిత కార్యమని శ్రీరామపాద భాగవతర్ తెలియజేశారు. దీని అంతర్యము అంత తేలికగా అర్థమవ్వదని, కాని మహత్యం సామాన్యము కాదని ఆయన చెప్పారు.
కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం, ఎన్నో వేద పరిరక్షణ - బ్రాహ్మణ సంక్షేమ సంస్థలు ఉచితముగా సంధ్యావందనము శిక్షణ ఇస్తున్నారు. వయసుతో నిమిత్తము లేదు. సిగ్గు పడవలసిన అవసరం లేదు. శ్రద్ధ, ఆచారం ముఖ్యం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకముందు జీవితం కోసమైనా వెంటనే సంధ్యావందనము చేయడం మొదలు పెట్టమని శ్రీరామపాద సూచించారు.
"సంధ్యావందనము చేయడం తనకే కాక లోకానికి క్షేమకరమని, అంతే తప్ప గొప్ప కోసం చేసే విందు కాదని" అందరు గ్రహించాలని శ్రీరామపాద భాగవతర్ చెప్పారు 

ఓం గాయత్రి దేవ్యైనమః 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.