అపుత్రస్య గతిర్నాస్తి : పిల్లలు లేనివారికి పున్నామ నరకమా?
అపుత్రస్య
గతిర్నాస్తి : పిల్లలు లేనివారికి పున్నామ నరకమా?
నేడు నెలకొన్న విపరీత పరిస్థితుల దృష్ట్యా
చాలామంది మనసులో నెలకొనియున్న వేదనపై ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ స్పందించారు.
శ్రీరామనవమి సందర్భముగా సూర్యవంశ ప్రతిష్ఠ గురించి ఆయన ప్రసంగిస్తూ, వంశోద్ధారం చేసే
కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని వ్యధ పడుతూ ఉంటారని, దీనికి
సంబంధించి శ్రీమహాభారత తాత్పర్య నిర్ణయంలో విశదీకరించారని ఆయన వివరించారు.
వేదోక్త కర్మలు చేసేవారు, ఆధ్యాత్మిక జ్ఞాన
సంపాదన చేసేవారు, ధార్మికంగా జీవిస్తూ శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ
విహిత కార్యములు చేస్తూ సాధన చేసేవారు, పిల్లలున్నా లేకున్నా వారివారి సత్కర్మల వలన
సద్గతి లభిస్తుందనేది శాస్త్ర వచనమని శ్రీరామపాద అన్నారు. పాపులు, దుష్కర్మలు చేసినవారికి,
పుణ్యం క్షీణించడం వల్ల వారి సంతానము చేసిన పుణ్యము చేతనో, సమర్పించిన ధర్మోదకము చేతనో,
శ్రాద్ధ కర్మల చేతనో, పిండ ప్రదానముల చేతనో ఉద్ధరింపబడే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు
లేకపోతే నరకం లభిస్తుందనేది అసత్యం. కాని, భగవద్భక్తి లేక, దానికి తోడు పితరుల సద్గతి
కోసం పాటుపడే పిల్లలు సైతం లేకపోతే నరకమే.
శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి వివరిస్తుందని శ్రీరామపాద తెలియజేశారు. మొదటి కోవకు చెందిన వారు 6 రకాలు. ఔరసుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిధ్ధుడు, క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని, ఆస్తిలో కాని భాగం ఉంటుంది. మరొక కోవకు చెందిన పుత్రులు 6 రకాలు. కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు. వీరికి రాజ్యాధికారము, ఆస్తిలో భాగము లేదని ఆయన తెలిపారు.
మనుమడు (పెద్ద కూతురు యొక్క కొడుకు) కూడా పుత్రుల లెక్కలోకి వస్తాడు. అందుకే తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెట్టి, తర్పణాలు వదులుతారు. యోగ్యులైన కూతురు యొక్క కొడుకు తర్పణాలు విడిచినా అవి ఆ పితరులకు అందుతాయి. కాబట్టి ఒకరికి కొడుకు లేడు అని బాధ పడవలదని శ్రీరామపాద అన్నారు.
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే
నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే
దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందురు. పుత్రులు కలగనివారు, అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని వేదన పడుతుంటారు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు వందమంది పుత్రులు కలిగినను, వారి వలన అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగాడు? అలాగే బ్రహ్మచారిగానే యున్న (సంతతియే ఉండదు) శుకునకు దుర్గతి ఏమైనా కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించకపోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు, మోక్షము సిధ్ధించక పోవచ్చు. పుత్రులు లేనివారికి రెండును సిద్ధించవచ్చు. కావున కొడుకులు లేరని ఎవరూ బాధ పడవలదని దీని అంతరార్థమని, మన పుణ్యం మనమే సంపాదించుకోవాలని, మన ఉద్ధారణ, ఉత్తమ గతులు కోసం మనమే పాటు పడాలని ధర్మసూక్ష్మం హెచ్చరిస్తోందని శ్రీరామపాద భాగవతర్ అన్నారు.
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.