ఎంతటి పెద్ద పుణ్యకార్యమైనా వృధానేనా ?
ఎంతటి పెద్ద పుణ్యకార్యమైనా వృధానేనా ?
वृथा वृष्टिः समुद्रेषु , वृथा तृप्तेषु भोजनम् ।
वृथा दानं धनाद्येषु , वृथा दीपो दिवापि च ॥
వృథా వృష్టిః సముద్రేషు వృథా తృప్తేషు భోజనం ।
వృథా దానం ధనాద్యేషు వృథా దీపో దివాపి చ ॥
సముద్రములో పడిన పెద్ద వర్షం, తృప్తిగా ఉన్నవానికి అన్నం పెట్టడం, ధనవంతునికి దానం ఇవ్వడం, వెలుతురులో దీపం వెలిగించడం. వీటి వలన ఏమాత్రము ప్రయోజనము లేదు, వృధా ! అందుకనే "అపాత్ర దానం శూన్య ఫలితం" అని ఉవాచ. దీనిలో ఎంతో పరమార్థం మిళితమై ఉంది. కష్టపడి నీతిగా సంపాదించిన సొమ్మునే దానధర్మాలకి, పుణ్యకార్యాలకి ఉపయోగించాలి. అలా చేసిన ఒక్క రూపాయి అయినా ఎంతో పుణ్యఫలప్రదం. ఎందుకంటే అటువంటి సొమ్ముని సమర్పించేటపుడు, వినియోగించేడపుడు మాత్రమే ‘మనసు’లో ఎంతో తృప్తి, ఉల్లాసం, తెలియని ఆనందం కలుగుతుంది. అదే మనల్ని, మన సంతానాన్ని కాపాడుతుంది. ఆ మనసే ‘పరమాత్మ’ కాబట్టి ‘ఆత్మసాక్షిగా’ అనేది వేదోక్తి. వేరేవిధంగా సంపాదించిన సొమ్ము అహంకారంతో కూడిన లౌకికఖ్యాతి, భౌతికమైన హోదా ఇవ్వచ్చునేమో గాని, పరమాత్మకృప మాత్రం కలుగదు. కల్మషమైన మనసుతో అధర్మంగా ఆర్జించిన ధనం ఉపయోగించి అతిరుద్ర మహాయాగాలు లాంటివి పవిత్ర కాశి, శ్రీశైలం క్షేత్రంలో చేసినా, కురుక్షేత్రలో భగవద్గీత పారాయణ చేసినా, అయోధ్యలో ఆశ్రమం నిర్మించినా ఫలితం ఉండదు. అవి పాపరాశిని దహనం చేయలేవు.
అందువలన, ఎవరైనా దానధర్మాలు చేయడానికి ముందు ఖఛ్ఛితంగా తెలుసుకొనవలసిన ముఖ్య విషయం, దానం స్వీకరించేవారి గుణగుణాలు, పుణ్య కార్యక్రమం చేసే/జరిపించే/నిర్వహించే వారి శీలం, పవిత్రత. లేదంటే, ఫలితం శూన్యమే కాకుండా, ఆ దాత అవతలివారి పాపంలో భాగస్వామి అయినట్లే. ఈ కారణం చేతనే అపాత్రదానం చేయకూడదని మన పెద్దలు ఎప్పుడో శాస్త్రోక్తంగా హెచ్చరిక జారీచేశారు.
అందువలన ఏ పుణ్యకార్యక్రమం చేసినా స్వంతంగా, మన చేతులతో మనమే చేయటం అత్యుత్తమం. అన్నదానం, వస్త్ర దానం, నిరుపేద విద్యార్థులకి ఉచితంగా పాఠాలు చెప్పడం, వేదాలని, జ్ఞానాన్ని పరులకి పంచడం, రోగికి మందులు కొనివ్వడం, దాహార్తి తీర్చడం, పాదరక్షలు ఇవ్వడం, నిరుపేద కుటుంబంలోని వివాహానికి సహాయం చేయడం…ఇలా చేతనైనది సులభంగా సరళంగా “మన చేతులారా మనమే” చేసుకుంటే పరమాత్మకృప విశేషంగా లభిస్తుంది. ఎక్కడికో వెళ్ళి వేలరూపాయలు ఎవరికో, అదీ ధనబలం, స్థాయి ఉన్నవారికి మూర్ఖంగా సమర్పించేకంటే, మన ఇంట్లోనే మన చేతులారా సత్కర్మలు చేసుకోవడం అత్యుత్తమ ఫలితం. ఇది ధర్మ సూక్ష్మం !
మన వలన అవతలివారు సంపన్నులవుతారు తప్ప, మనకు కలిగే ప్రయోజనము లేదు. దురదృష్టవశాత్తు, నేటి సమాజంలో మన భక్తి-మనోభావాలు-విశ్వాసం మీద వ్యాపారం చేసే ఆధ్యాత్మిక మనుషులు, సంస్థలు ఎక్కువైపోయాయి. ఎటు చూసినా వారే. ఏది సత్యమో తెలుసుకోకపోతే అన్నివిధాలా నష్టపోయేది మనమే !
మరి విశేషమైన దానధర్మాలు ఎవరికి చేయాలి ?
మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు, నిష్ఠా గరిష్ఠులు, నిత్య జపతప హోమ యాగ క్రతువులు, నిత్య దేవతార్చన చేయువారు, శారీరిక మానసిక పవిత్రత, బ్రహ్మనిష్ఠ, కామ క్రోధ లోభ మద మాత్సర్యం, పంచేంద్రియాలపైన నిగ్రహం కలిగి వేదాధ్యయనము చేసి అత్యంత కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించే గురువులకి, ఆచార్యులకి, వేదపండితులకు, బ్రహ్మనిష్టలో నిమగ్నమై నిత్యం భగవన్నామంతో తరిస్తున్న సంత్‌లు, భాగవతోత్తములకు దానము చేయవచ్చు. అప్పుడే దాన ఫలితము లభించును.
గుణపాఠం :
ఎక్కడో, ఎవరి దగ్గరో, యోగుల హృదయాల్లోనే భగవంతుడు ఉంటాడనుకుంటే అది ముమ్మాటికీ పొరపాటే. అటువంటి భ్రమ వలదు, పరుల మాయలో పడజాలదు. పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. శ్రీహరి నారదుడుతో స్వయంగా చెప్పిన మాట,
नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च ।
मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ॥
నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే న చ ।
మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద ॥
"నేను వైకుంఠంలో లేను, యోగి హృదయంలో లేను, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను" అని. అంటే, మనమే ఆయన నామస్మరణ చేస్తూ ఏదైనా పుణ్యకార్యం మన చేతులారా స్వయంగా చేస్తామా అని ప్రతిక్షణం వేచి చూస్తూ ఉంటాడు.
మన చేతులు శుభ్రపడితేనే కదా, ఆయన ప్రసాదాన్ని మనకి ఇవ్వగలడు! మన పాత్ర శుభ్రంగా ఉండాలి కదా, పాలు పాడవకుండా పొంగాలంటే ! ఒక్కటి గట్టిగా గుర్తుపెట్టుకోండి. మనం ఉన్న స్థలమే (ఇల్లే) వేంకటం, వైకుంఠం ! మనం ఉన్న ఇల్లే ఈశ్వరం, కైలాసం ! సర్వే జనాః సుఖినో భవంతు !
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.



