Madras High Court : దొంగ స్వామీజీల వలన “నిజమైన ఆధ్యాత్మిక గురువు"ల ఖ్యాతికి కళంకం
మద్రాసు హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు
దొంగ స్వామీజీల వలన “నిజమైన ఆధ్యాత్మిక గురువు"ల ఖ్యాతికి కళంకమని మద్రాసు ప్రధాన న్యాయస్థానం దుఃఖాన్ని వ్యక్తపరచింది.
దొంగ స్వామీజీలు తమ రాజకీయ, ధన బలముతో దురుద్దేశ పూరిత వ్యవహారాలను కొనసాగిస్తున్నారని తెలిపింది. యోగ్యత, మనస్సాక్షి లేని కపట స్వామీజీలు, ‘తేలికగా మోసపోయే ప్రజల’ వలన తమ సామాజిక హోదాని అనుభవిస్తున్నారని న్యాయస్థానం చెప్పింది. స్త్రీలను, అవివాహిత యువతని లైంగిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలియచేసింది.
ఇదే విషయాలపై చెన్నైకు చెందిన ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఇటీవలే వ్రాసిన వ్యాసం (ఎడిటోరియల్ - ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి) ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని చర్చనీయాంశం అయింది.
ముఖ్యంగా అమాయకులు/అవివేకులు/మూర్ఖులు/అజ్ఞానులు అనబడే భక్తులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే, కుహక స్వామీజీలను అనుసరిస్తే ఇటు లౌకికంగా ఉన్న సంపద పోతుంది, అటు ఆధ్యాత్మికంగా సాధించే పరిపక్వత శూన్యమే. ఇప్పటికే చాలా మంది తమకు జరిగిన చేదు అనుభవాలను మింగలేక, కక్కలేక, నోరు తెరిస్తే ఆ ధన-మద స్వాములు ఏమి చేస్తారోనని భయభ్రాంతులై కుమిలి కుమిలి బాధపడుతూ జీవచ్చవాలై ఉన్నారు. చేతులు కాలిన తరువాత, మన స్వయంకృతాపరాథానికి భగవంతుడిని నిందిస్తే లాభం లేదు. కనుక, మనం ఒకరిని గురువుగా స్వీకరించేముందు అతడి పూర్వాపరాలు, వందల సం.ల గురు-పరంపర, ఏ గురువు వద్ద విద్యని అభ్యసించాడో తెలుసుకోవాలి. మాయ మాటలకి పడిపోకూడదు. మన అవగాహనా రాహిత్యమే వారి పెట్టుబడి.
ఈ వ్యాఖ్యలపై శ్రీరామపాదని సంప్రదించగా, ఇటీవల కాలములో చాలా విషయాలలో న్యాయస్థానాలే చొరవ చూపి నిర్ణయాలను ప్రభుత్వాలకు మార్గదర్శం చేస్తున్నాయని, అదే విధముగా నేటి ఆధునిక సంస్థల ప్రక్షాళన అవసరమని, ఆధ్యాత్మికం పేరున వ్యాపారం చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుని, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఇందులో ప్రతి భక్తుడు పూనుకోవాలని ఆకాంక్షించారు. అంతర్గతముగా దుర్గుణ స్వభావము, మోస పూరిత ధోరణి, అధర్మముతో భగవంతుని పేరున వ్యాపారం చేసేవారు ఎంతటి వారైనా, కాశీలో అతిరుద్రయాగాలు, కురుక్షేత్రలో భగవద్గీత పారాయణ యజ్ఞాలు, అయోధ్యలో ఆశ్రమాలు కట్టినా వ్యర్థమేనని ఆయన అన్నారు. సాక్షాత్ శ్రీకృష్ణుడి సన్నిధిలో దశాబ్దాల పర్యంతం కాలము గడిపినా, అన్ని హంగులు కలిగిన కౌరవులకు పాపాన్ని అనుభవించక తప్ప లేదని శ్రీరామపాద గుర్తు చేసారు. పరుల ఆస్తిని, ధనాన్ని బలవంతముగా స్వాధీన పరుచుకోవడం, అనుభవించడము పైగా గురుసేవ, భక్తి పేరున సమర్థించుకోవడము దుర్మార్గము. సీతమ్మను చెరబట్టిన రావణాసురుడు, తమ్ముడి భార్యని చెరబట్టిన వాలిని శ్రీరాముడు సంహరించాడు. ద్రౌపదిని వివస్త్ర చేయాలని హింసించిన ధుర్యోధన-దుశ్శాసనులను శ్రీకృష్ణుడు అంతం గావించాడు. ఎంతో ప్రజ్ఞ, విద్య, మేధస్సు కలిగిన భీష్ముడు, కర్ణులను కూడా అధర్మ పక్షాన నిలబడినందుకు కృష్ణ పరమాత్మ చివరికి శిక్షించాడు. అలాగే శిశుపాలునికి 99 మార్లు తప్పు చేసినా కృష్ణపరమాత్మ మారడానికి అవకాశం ఇచ్చాడు. నూరవ తప్పు చేసిన మరుక్షణము సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సు వధించాడు. అందరికి 99 అవకాశాలు ఇస్తాడని కాదు, కొంత మందికి 2 మార్లే అవకాశం ఇవ్వొచ్చు. కనుక, అధర్మ మార్గం పట్టిన వాడికి వధ తప్పదు. తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదని, ఇటువంటి దృష్టాంతాలు మన పురాణ-ఇతిహాసాలలో ఎన్నోనని శ్రీరామపాద భాగవతర్ గుర్తుచేశారు.
ధర్మాన్ని అనుసరించడమంటే జాతీయ రహదారిలో, కేటాయించిన లైన్‌లో డ్రైవ్ చేసినట్లని, రూల్‌ని ఉల్లంఘిస్తే ప్రమాదకరమని ఆయన అన్నారు. అలాగే సనాతన సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తే క్షేమమని, మూర్ఖులను చూసి పక్కదారి పడితే ఎప్పటికైనా ప్రమాదము, కలిగే లాభము శూన్యమేనని, చూసేదంతా బంగారము కాదని శ్రీరామపాద అన్నారు. నేటి కలి ప్రభావిత కాలంలో పవిత్ర స్థలాలు, పవిత్ర గురువులు, పురుషోత్తములు చాలా చాలా తక్కువని, వెతికి పట్టుకోగలిగితే ధన్యులమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.