అద్వైత దూషణ సమతామూర్తి ప్రేరణా? - News Article in Telangana Daily Paper

అద్వైత దూషణ సమతామూర్తి ప్రేరణా ?

 


హైదరాబాద్, ఫిబ్రవరి 19, 2022 : శంషాబాద్‌లో కోలాహలంగా సాగిన రామానుజాచార్య విగ్రహ సమారోహం చివరి రోజున హైదరాబాద్‌కు చెందిన శ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి (చిన్నజీయర్) చేసిన వ్యాఖ్యలతో కొంతభాగం నేను ఏకీభవిస్తాను. అవును, దొంగ జగద్గురువులు ఉన్నమాట వాస్తవమే. అటువంటివారి జగత్తు ఏమిటో, ఎలా ఉంటుందో నాకు తెలుసు చిన్నజీయర్‌కు తెలుసు. ఆయన అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిశోధన చేస్తుంటారు. ఇదే పత్రికలో ఈమధ్యే నేను వ్రాసిన సంపాదకీయం "ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి"తో చిన్నజీయర్‌ ఏకీభవించారు. బహుశ, ఆయన వ్యాఖ్యలు శైవ సంప్రదాయం అనుసరించే దొంగ స్వామీజీలు, గురువులపై అయ్యుండవచ్చు. అలాగే, వైష్ణవ సంప్రదాయం అనుసరిస్తూ దురాచారం చేసే ఆచార్యులపై కూడ చిన్నజీయర్ హెచ్చరిక చేసుంటే ఆయన సమతా భావన, సమైక్య దృష్టి, సనాతన ధర్మ ఆచరణ శ్రద్ధకి అద్దం పట్టేది. ఈ విషయంలో స్పష్ఠత-సత్యం అవసరం, ఈమధ్యే వెలుగులోకి వచ్చిన విషయం చిన్నజీయర్ దృష్టికి రాకుండా ఉండడానికి ఆస్కారము లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకున్న సోషల్ నెట్‌వర్క్ పెద్దది, ఏ సమాచారమైనా క్షణాల్లో ఆయన చెంతకు చేరుతుంది. కొన్ని సం.ల క్రితం వైష్ణవ కాషాయవస్త్రధారి అమెరికాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని, బయట మాత్రం సన్యాసి, పవిత్ర బ్రహ్మచారిగా వ్యవహరిస్తాడని, మరి అతగాడు ఆచార్యుడు ఎలా అవుతాడు అనేది దాని సారాంశము. ఇది వైష్ణవ గురువు సంబంధ విషయమని ఉలుకుపలుకు లేకుండ ఉండి, శైవ సంబంధిత గురువులు గూర్చి మాత్రమే మాట్లాడితే, తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్ళడమే కాకుండా చిన్నజీయర్ స్వామి చేసే ఆధ్యాత్మిక శ్రమ-సేవకి కళంకము వస్తుందని నా ఆవేదన. ఇతర సంప్రదాయాలలో ఏమి జరుగుతోందో ఆందోళన చెందే ముందు, మీ సంప్రదాయములో మీ ఆచారాలని ఎవరు భ్రష్ఠు పట్టిస్తున్నారో వారిని పట్టుకుని బహిష్కరించి వైష్ణవ ధర్మాన్ని, రామానుజుల దివ్య ఆశయ స్ఫూర్తిని కాపాడుకోవచ్చుగదా! అటువంటి నీచకృత్యాలు ఆశ్రమధర్మానికి, సంప్రదాయ ఉనికికే ప్రమాదం.





ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్నజీయర్ మాటలు గర్హనీయం, అహంకార అపరిపక్వ పూరితం, ఆయన రియల్ ఎస్టేట్ ప్రమోటర్, ఆయన చెప్పే కొత్తరకం భాష్యాలు రామానుజాచార్య ఉండి ఉంటే అంగీకరించేవారా, శాస్త్ర పురాణ ఇతిహాసాలలో లేని విషయములు కొత్తగా సృష్ఠించి మాట్లాడుతున్నారు, చిన్నజీయర్ ఆధునిక భాష్యాలు శైవ-వైష్ణవ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి, తిరుమల వేంకటేశ్వరస్వామికి రామానుజులు గురువనే ప్రకటన విని వైష్ణవులు సైతం చిన్నజీయర్‌కు మతి భ్రమించియుంటుందని అనడం, 216 అడుగుల విగ్రహ తిరునామం విషయములో వైష్ణవులలోని రెండు గ్రూపులు కొట్టుకొనడం, శైవ ద్వేషియై ఆదిశంకరులంటే గౌరవం లేని జీయర్, జగద్గురు ఆదిశంకరాచార్యులను ఆరాధ్యులుగా కొలిచే ప్రధాని మోడి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజనాథ్‌సింగ్‌, రాష్ట్రపతి చేతుల మీద సమతామూర్తి ప్రాజెక్ట్ ఆవిష్కరింప చేయడం వెనుక ఏమి రహస్యముందో, ఆయన పని ఆయన చూసుకోక ఇతర సంప్రదాయముల మీదే ఎల్లప్పుడూ పడి ఏడవడం ఆయన స్థాయికి తగదు, ఇది ఆధ్యాత్మిక సాధనా అని పెద్దలు పండితులు విస్తుపోవడం మొ.వి. వీటన్నిటినీ చూస్తుంటే శ్రీరంగం దివ్యదేశములో కొలువైయున్న రామానుజాచార్య తిరుమేని (సహజమైన పార్థివ దేహం) ఎంత వేదన చెందుతూ ఉంటుందోనని బాధ వేస్తోంది. ఎన్నో దివ్యదేశాలు శిధిలావస్థలో, ధూప-దీప-నైవేద్యాలకి నోచుకోని పరిస్థితి ఉంటే, వాటి జీర్ణోధ్ధరణకి పాటుపడకుండా వాటి ప్రతిరూప ఆలయాలని రూ.1000 కోట్లతో నిర్మించడము వెనుక ఆధ్యాత్మిక ఉన్నతియా, లౌకిక ఖ్యాతి తపనా అని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. కాంచీపురంలోని దివ్యదేశం "యథోక్తకారి పెరుమాళ్" దర్శనానికి వెళ్ళినపుడు గుడిని నిర్వహించలేక మూసివేశారని తెలిసి బాధతో అక్కడి నుండే తమిళనాట ప్రసిద్ధ వైష్ణవ ఆధ్యాత్మికవేత్త శ్రీరంగమునకు చెందిన శ్రీ వేలుక్కుడి కృష్ణస్వామికి ఫోన్ చేశాను. ఇటువంటివి ఎన్నో ఉన్నాయని తెలుసుకుని ఎంతో వేదనపడ్డాను. పరిస్థితులు ఇలా ఉండగా, సమాజంలోని బలహీనవర్గాల కోసం ఉచిత విద్యాలయాలు, అనాథులు వయోవృద్ధులకు చేయూత, అన్నదానం మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్నజీయర్ స్వామి నిష్కళంకుడుగా ఉండాలనేదే నా తపన.


 

ఒక్క విషయం సుస్పష్ఠం. శైవులైనా, వైష్ణవులైనా, మరెవరైనా శాస్త్రాలకు తమదైన శైలిలో వక్ర భాష్యం చెప్పి, ప్రజల మనసులో గందరగోళం-గజిబిజి సృష్ఠిస్తూ మోసం చేసి, మహనీయుడు, మహాస్వామి, ఆచార్య, జీయర్, జగద్గురు, జగదాచార్య, పరమహంస పరివ్రాజక, యోగి-సిద్ధయోగి, దూత-అవధూత, అయోనిజుడు, అవతారపురుషుడు, సద్గురువుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. భక్తుల అవివేకము, జ్ఞానరాహిత్యంతో వ్యాపారం చేయడము ఘోర నరకాలకు మార్గం. ఇది గరుడ పురాణము నిఘూఢంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. దీని అంతరార్థం “కలిప్రభావం సనాతనధర్మ భ్రష్ఠులపై ఎక్కువగా ఉంటుంది” అని. ఈ భ్రష్ఠులలో ఎక్కువ మంది విశ్వసనీయమైన గురు-పరంపర లేనివారే. భౌతికముగా (ఈ జన్మలోనే) పరమేష్ఠి గురు, పరాత్పర గురు, పరమ గురు, గురువు వ్యవస్థ లేనివారే మోడరన్ స్వామీజీలు, ఆచార్యులు. ఈ క్రమం సక్రమంగా ఉన్నవారు ఏ సంప్రదాయమైనా పవిత్రులుగా బ్రహ్మనిష్ఠ, ధర్మనిష్ఠలోనే నిమగ్నమై సమతా మూర్తులుగా ఉంటారు. అంతటి ప్రాముఖ్యమున్న గురు-పరంపర విషయములో నెలకొన్న అవగాహన రాహిత్యమే అమాయక భక్తులకు గుదిబండ అవుతోందనేది సత్యం. నిజం తెలుసుకునే లోపల జీవితకాలం ముగుస్తుంది. సంపదంతా ఖాళి అవుతుంది. గురువు, శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రసాదం ఇవ్వాలి తప్ప, వారిని అజ్ఞానంలోనికి నెట్టి వ్యాపారం చేస్తే గురువు ఆచార్యుడు ఎలా అవుతాడు? రూ.లక్ష ఖర్చుపెడితే రూ.కోటి కలెక్షన్ చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. గురు-ఆజ్ఞ పేరుతో మానసిక ఒత్తిడి చేసి సేవల పేరున డబ్బులు వసూలు చేయడం, ఇవ్వకపోతే గురు-నింద అని భయ-భ్రాంతులు చేసి ధనం లాగించడం చేస్తున్నారు. ప్రత్యేకించి వీరికి విదేశాలలో నివసిస్తున్న భారతీయులే టార్గెట్. ఒకానొక ఆధునిక స్వామీజీ పాద-పూజ పేరుతో భక్తుల ఇండ్లకు వెళ్ళినపుడు, సభలలోనూ, వారిని ఉద్దేశించి “ఇప్పుడు మీరు డొనేషన్ ఇవ్వకపోతే రేపు మీరు చనిపోయిన తరువాత తానే యముడిగా వచ్చి శిక్షిస్తానని బెదిరించి లక్షలలో వసూలు చేస్తున్నాడు. దురదృష్టవశాత్తూ దేశ ప్రముఖులు ఇవేవీ పరిశీలించక వారి ఆశ్రమాలను దర్శించడం, వ్యాపార గురువులకు జాక్-పాట్‌లు అవుతున్నాయి. ప్రజల మూర్ఖత్వం ఇంతితై తానింతై అని కొంపలు ముంచుతోంది. ఇదే కలి ప్రభావం, తెలుసుకున్నవాడు ధన్యుడు, మూర్ఖుడుకి పీడ. చివరిగా ఒక మాట. నాకైతే రామానుజులు పర సంప్రదాయ ద్వేషి అని తెలియదు. ఆయన దానిని ప్రోత్సహించారని ఎక్కడా చదవలేదు. అలాగే, ఆదిశంకరులు శైవాచార్యులు కాదు. షణ్మతాలను సమన్వయించిన అద్వైతాచార్యులు. శంకరపీఠాలు విష్ణుభక్తిలో ఏమీ తక్కువకావు. వాటిని శైవపీఠాలు అనరాదు, అవి అభేదపీఠాలు. జగద్గురు ఆదిశంకరాచార్యులు పాదము మోపని క్షేత్రము, స్తుతించని భగవత్ స్వరూపము, అందించని స్తోత్రం, భాష్యం, వ్యాకరణ, తిరగని ప్రదేశములు లేవు. భగవంతుని అవతార కాలము చాలా తక్కువుగా ఉంటుంది, కాని మహిమ వర్ణించనలవి కాదు, అలాగే ఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాలు, సర్వజ్ఞ పీఠ పరంపర గురువులందరు శివకేశవుల అబేధ తత్వమునే బోధిస్తారు, పురుషోత్తములంటే అలా ఉంటారు. సరళంగా చెప్పాలంటే, శాస్త్రం నిర్దేశించిన విధముగా భారతదేశ కర్మభూమిలోనే ఉంటూ ధర్మాచరణ, ఉపాసన శక్తి, బ్రహ్మనిష్ఠ, అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారి పాదాల వద్దకు ప్రపంచమే వచ్చి ఆరాధిస్తే జగద్గురువులౌతారు గాని, నిత్యం విమానాలలో భోగముతో కూడిన ఫస్ట్ క్లాస్‌లో ప్రపంచం చుట్టూ తిరిగే సన్యాసులు, గురువులనబడే వ్యక్తులు జగద్గురువులు-జగదాచార్యులు కాలేరు. ఏది ఏమైనా, చిన్న జీయర్ వ్యాఖ్యలు శైవ - వైష్ణవ పరస్పర దూషణకు ఉసిగొల్పినట్లు అయ్యింది. చదువు, ఐశ్వర్యం, అధికారం, అంతస్థు ఉన్నవారికి పొగరు తలమీద కొమ్ములు కాస్తుందని ఇదే వేదికనుండి ప్రజలకి హితోపదేశం చేసిన చిన్నజీయర్‌స్వామికి, దురదృష్టవశాత్తూ అదే లక్షణం తనకు తెలియకుండానే ఆవహించి నాలుక జారిందా అని ఆత్మపరిశీలన చేసుకుంటే ఇటువంటి ఉపద్రవాలు రాబోయే కాలంలో రాకుండ ఉంటాయి. మరొక ప్రక్క చిన్నజీయర్‌స్వామి తన అపార-జ్ఞానాన్ని నిరూపించదలిస్తే, శృంగేరి సంస్థ తెలుగురాష్ట్రాల సంచాలకుల సవాల్‌ని స్వీకరించి పలుశాస్త్రాల మీద అద్వైత పండితులతో వాదించి తనదైన కొత్తరకం భాష్యం సరైనదేనని ఒప్పించవచ్చు. ఇటువంటి విద్వత్ సభలు నేటి సమాజానికి కూడ ఎంతో అవసరం. తద్వారా లోకానికి మంచి చేసినవారవుతారు. ఎందుకంటే ఈ వాక్యార్థ విద్వత్ సభ సంచలనమవ్వడమే కాక, దొంగ స్వామీజీలు/దొంగ గురువులు/దొంగ పీఠాధిపతులకు ఒక హెచ్చరిక లాంటిది. ఈ డిబేట్‌ని కూడ టి.వి. ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. ప్రజలు చూడాలి. ఎవరి జ్ఞానం, విద్వత్తు ఎంతో వీక్షించి తెలుసుకుంటారు. సద్గురువు, సదాచార్యుడు ఓర్పు, సహనం, ప్రేమ, దయ, సహకారం, సత్సంగం, ఐకమత్యం, జ్ఞానమును మాత్రమే శిష్యులకు బోధిస్తాడు. అలా కాక, గురు స్థానంలో ఉన్నవాడే ద్వేషాన్ని రెచ్చగొడితే? నేను 30 సం.లుగా అభిమానించే చిన్నజీయర్ కూడ రాగద్వేషాలకు అతీతులు కాదని ఇప్పుడే తెలుసుకుని బాధపడుతున్నాను. నిన్నే చిన్నజీయర్ బంధువు నాతో "చిన్న జీయర్ ప్రతిష్ఠ, అధికారం, ధనం కోసమే అన్నట్లు కనిపిస్తోంది" అన్నారు. ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులైనా, ఆధునిక గురువులైనా అంగబలం, ఆర్థికబలం, అధికారబలంతో ఏదైనా మాట్లాడతారు. సామాన్యులైన ప్రజలకే విచక్షణా జ్ఞానం అవసరము. ఎందుకంటే ఏ నష్టం జరిగినా ప్రజలకే !


                                                                                     శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.


Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper