ఎక్కడి నుండి వచ్చామో తెలియదు. కాని, ఎక్కడికి వెళ్లాలో మన చేతుల్లోనే ఉంది !
ఎక్కడి నుండి వచ్చామో తెలియదు. కాని, ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించడం మన చేతుల్లోనే ఉంది !
చెన్నై, ధనుర్మాసం, డిసెంబరు 18, 2023 : ఎంతో భక్తి భావముతో ఉత్సాహంగా మొదలైన ధనుర్మాస ఉత్సవాల సందర్భములో నగరానికి చెందిన ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ స్థానిక కపాలీశ్వర క్షేత్ర మాడవీధులలో బ్రహ్మముహూర్తకాల నగర సంకీర్తన చేస్తూ ధర్మసూక్ష్మాలను క్లుప్తంగా తెలియజేశారు. అందులోని సారాంశం మిత్రులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాము.
అదృష్టవశాత్తు మనుష్యులై పుట్టాము. ఇదే మొదటి జన్మ అనుకుంటే పొరపాటు. ఈ 70-80 సం.లు మాత్రమే జీవన కాలము అనుకుంటే మరొక పెద్ద పొరపాటు. ఎన్నో కర్మల ఆధారముగా, ఎన్నో లక్షల జన్మలు ఎత్తాము. ఇక ముందు ఎన్నో, ఏ రూపమో, ఎక్కడో ? మరలా మనుష్యజన్మ గ్యారంటీ అని ఎవరైనా చెప్పగలరా ? చనిపోయిన తరువాత మరలా ఇక్కడే, ఇదే హోదాతో, ఇదే ఇంటిలో, ఇదే ఊరులో పుడతామని గ్యారంటీ ఉందా ? మన కంటి ముందే కుక్క, పంది, పాము, మేక, గాడిద, గుర్రం, పులి, నక్క మొ. వేల జంతువులు, పురుగులు, పక్షులు, అవయవలోపం కలిగిన జీవులు, దౌర్భాగ్యముతో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జీవులెన్నో. ఎందుకు అలా ? కారణం ఏమిటి ? అంటే ఎవరో ఒక న్యాయ నిర్ణేత ఉన్నాడు. తప్పొప్పులన్నీ పరీక్షించి, మరుసటి జన్మని నిర్ణయిస్తున్నాడు. ఇవన్నీ కూడ భగవద్గీత, శాస్త్రాలు, గరుడ పురాణంలో స్పష్ఠంగా చెప్పబడ్డాయి. కనుకనే ధర్మానుష్ఠానం కోసం మన క్షేమం కోరి, ఋషులు కార్తీక-ధనుర్మాసం వ్రతాలు, ఏకాదశి-ద్వాదశి ఉపవాస విధులు, తీర్థ స్నానాలు, భాగవత, శివ పురాణ సప్తాహాలు, సరళమైన నామస్మరణ మొ. మార్గాలను చూపారు.
మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ప్రారబ్ద కర్మ మనమే కరిగించుకోవాలి. ఎవరో ఉద్ధరిస్తారనుకోవడం అవివేకం, మూర్ఖత్వం ! ఎక్కడో గోత్ర, నామాలతో డబ్బు కట్టేసినా, పంపించినా పరిహారం పూర్తి అవదు. వేదపండితుడి సమక్షములో మన ఇంటిలో స్వయముగా చేసుకున్నప్పుడే ఫలితం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఆచార్యుడు, పూజారి చేత దేవాలయములో ప్రత్యక్షముగా చేయాలి. అంతే తప్ప మూలాలు లేని వారిని, ముసుగు దొంగలను, పగటి వేషగాళ్లను (ఆధునిక "అవ"తార స్వామీజీలు) నమ్మి, వారి మురికిపాదాలు పట్టుకుంటే వాడి పాపమంతా మన ఖాతాలోకి జమ అవుతుంది. ఈ కాలములో జగద్గురువు అనే పదానికి అర్థం లేకుండా చేసేశారు కొంతమంది కల్మష హిందూ ధర్మ ప్రచారకులు. వీరికి ఆధ్యాత్మికమంటే వ్యాపారం. దీని తీవ్రత అన్ని స్థాయిలలో ఉంది. కలికాలం కదా! వీరికి పూజ, హోమం, పారాయణ చివరికి భగవద్గీత కూడ వ్యాపార సాధనమే. చదవడానికి, వినడానికి అబద్ధంగానూ, చూడడానికి సత్యంగానూ అగుపిస్తాయి. దురదృష్టవశాత్తు, తమకు విరాళాలు వస్తూనేయుండాలనే ఉద్దేశ్యముతో ఒక ప్రముఖ స్వామీజీ భక్తుల మనోభావాలను కాలరాస్తూ వయసు మీరుతున్నా భక్తులను బిజినెస్ చేయాలని, ఉద్యోగం చేసి జీతం తన పాదాలపై పెట్టాలని శాసిస్తున్నారు. ఇది దుర్మార్గం. అటువంటి గురువులను అనుసరిస్తే పాపాల బుట్టలో పడినట్లే. పైకి మాత్రమే దేవుడి పేరు, భజన, ప్రవచన - పారాయణలు. వీరి గురించి పుంఖాలు పుంఖాలుగా చెప్పవచ్చు. కాని, కలి కాల ప్రభావం వలన ప్రజలు నిజాలను నమ్మే స్థితిలో లేరు కదా !పండితులే పసిగట్టలేకపోతున్నారు. ఎందుకంటే చేతిలో పెట్టే సంభావన మొత్తంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, సత్కారాలతో మురిసిపోతూ అసలు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. శ్రీమద్భాగవతము, శ్రీమద్భగవద్గీత, శివమహాపురాణములో ఎప్పుడో చెప్పారు "ఈ కలికాలంలో ధర్మాచరణ చేయవలసినవారే ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తారు" అని. మన నుదుట బ్రహ్మరాత సరిగా ఉంటే ధర్మనిష్ఠాగరిష్ఠులే మనకు మార్గదర్శక గురువుగా లభిస్తారు.
ఎన్నో లక్షల జన్మలలో ప్రస్తుత జీవితకాలం అత్యల్పభాగం మాత్రమే. కనుక మంచి జన్మ, సుఖ జీవనం కావాలనుకుని ధర్మాన్ని పట్టుకునేవాడు ధన్యుడైతే, మూటల కోసం తపించేవాడు మూర్ఖుడు. మరుక్షణం మన చేతుల్లో లేదు, ఉంటామో లేదో తెలియదు. కనుక, ధనుర్మాసం లాంటి పవిత్ర కాలాన్ని వృధా చేసుకోవద్దు. స్వయం కృషి మొదలుపెట్టండి.
సర్వే జనాః సుఖినో భవంతు🌹
విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్య మంగళమ్ 👏🏻🎻🎶🌻
- Team Srirāmapāda
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
