శ్రీరామనవమి ధర్మ సూక్ష్మం


శ్రీరామనవమి ధర్మ సూక్ష్మం



అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంతో ప్రేమ, భక్తితో పురుషోత్తముడైన శ్రీరాముని పుట్టినరోజును మనందరము పెద్ద పండుగగా ఈ రోజున జరుపుకుంటాము. నేటి నుండి వారం - పది రోజులు రామ కథలు, రామాయణ పారాయణలు, భజనలు, భక్తి చిత్రాలు ప్రతి ఇంటిలో, వీధిలో, చిన్న గుడులనుండి క్షేత్రాల వరకు, దేశంలోని ప్రతి మారుమూల అధ్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా కళ్యాణోత్సవం, పట్టాభిషేకం, రథయాత్రలు ఈ పదిరోజులు ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అయోధ్య, రామేశ్వరం, భద్రాచలం, ఒంటిమిట్టలలో విశేషంగా నిర్వహించుకుంటాం.





 

ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం - భగవాన్ శ్రీరాముడి నామాన్ని స్మరించే హక్కు అందరికి ఉండదు. ఎవరైతే సదా సర్వత్రా మనసులో ఆలోచన, మాట, నడవడిక, క్రియలో సత్యం-ధర్మాలని పాటిస్తారో వారికే ఆ హక్కు ఉండడమే కాకుండా ఆ పవిత్రనామ తరంగాలు వారికి రక్షణకవచంగా ఏర్పడుతాయి. ఆ పవిత్ర నామాన్ని దురుపయోగం చేసేవారికి అశాంతికరమైన ప్రభావాలు ఎదురౌతాయి. హనుమంతుడు వారికి తగిన శిక్ష విధిస్తాడు. దీనికి లంకాదహనం నుండి నేటి వరకు ఎన్నో ప్రమాణాలు చూస్తున్నాము. మరోప్రక్క ఎవరైతే ఆ నామాన్ని తారకమంత్రంగా సాధన చేస్తారో, అదే విధంగా సత్యాన్ని గ్రహించి జీవితంలో మార్పుకోరుకునేవారు ఎవరైతే రామనామ జపం నిరంతరం చేస్తూ ఉంటారో, ఆంజనేయుడు అటువంటివారి ప్రక్కనే రక్షణగా నిలబడడమే కాకుండా, ఒక మహత్తరమైన రోజున సీతారామచంద్రుల నిజరూప దర్శనం కలుగజేస్తాడు. వారికి జీవితంలో తిరుగు ఉండదు.



 


“రామో విగ్రహవాన్ ధర్మః” సకల సుగుణాలు, ధర్మం, న్యాయం మూర్తీభవించిన రూపమే శ్రీరాముడు. ఆనాడు ఆదర్శ ప్రభువు, ఆదర్శ పురుషోత్తముడు, ఆదర్శ వీరుడు, ఆదర్శ కుమారుడు, ఆదర్శ సోదరుడు. ఈనాడు భగవంతుడు. ధర్మ సంస్థాపనార్థం ఎందరో రాక్షసులను నిర్జించిన వీరుడు. పట్టాభిషేకాన్ని, వనవాసాన్ని సమానంగా స్వీకరించిన స్థితప్రజ్ఞుడు.





 

ప్రేమ, అనుబంధాలలో చిచ్చులు పెట్టే పాపులు, ఈర్ష్య- ద్వేషం కలవారు మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటారు. వారి ఉచ్చులో పడ్డవాడు దురదృష్టవశాత్తూ పాపి అవుతాడు, విస్మరించి కుటుంబవ్యవస్థని గౌరవించేవాడు పురుషోత్తముడౌతాడు. ఆనాడు కులగురువులు, రాజ్యగురువుల ఆదేశాలు, మార్గదర్శం రాజులు పాటించేవారు. గురువులు ఏ కోశానా తప్పుదోవ పట్టించేవారేకాదు. రాజు, మంత్రుల సలహా తీసుకునేవాడు కాని వారి మీద అధికారం చెలాయించేవాడు కాదు. అదే విధంగా మంత్రులు అధికార దుర్వినియోగం చేసేవారు కాదు సరికదా ప్రజలంటే భక్తిభావంతో ఉండేవారు. కుటుంబంలో ఒకరినొకరు గౌరవించేవారు. చిన్నవారు పెద్దవారి పట్ల భక్తితో మెలిగేవారు. పెద్దవారు చిన్నవారి పట్ల దయతో అండగా ఉండేవారు. ఇదే శ్రీరాముడిలో గొప్పతనం. తల్లిదండ్రుల పట్ల, మిత్రులు, సన్నిహితులు, ప్రజల పట్ల, చివరికి వైరిపక్షాన ఉన్న అసురల మీద ఓకే విధమైన అనురాగం కలిగిఉండడం శ్రీరామునిలోని ప్రత్యేక లక్షణాలు. అందుకనే నేటికీ రామరాజ్యం రావాలి, కావాలి అని అందరం ప్రార్థిస్తూ ఉంటాము. ఎందుకంటే ఎటుచూసినా సుభిక్షంగా ఉండేది. ఎవరు చూసినా సుఖసంతోషాలతో తృప్తిగా రామనామ చేస్తూ గడిపారు.





ఇంతటి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరిలోను ప్రేమ, వినయం, ధర్మం, నిజాయితి సమాజంలోని అన్ని రంగాల వారు, అన్ని వృత్తుల వారు, ప్రైవేట్ నుండి గవర్నమెంట్ వరకు అందరికి పెంపొందాలని గట్టిగా ప్రార్థిస్తున్నాను. ఇది మనందరి సంకల్పం కావాలనేదే నా కోరిక. ఇదే రామాయణంలో శ్రీరాముడు భావితరాలకి వేసిన బాట, జీవితలక్ష్యం.

 

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ జయరామ జయ జయ రామ 🙏🙏🙏


                                                                                 శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

 


Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper