ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు !

ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు ! మరి మార్గం ఏమిటి ?

 

శులభమైన  మార్గాలు  చేతిలో  పెట్టుకుని ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనుకోవడం అవివేకం. ఎక్కడో  డబ్బు  కట్టేస్తే  దోష పరిహారం అయ్యిందనుకుంటే పొరపాటే. అలాగే మన  తరఫున మరొకరు ఎక్కడో చేయడం, చేయించడం వలన ప్రయోజనం అధమం. ఇది  తెలియక,  తెలుసుకోక  సనాతన  సంప్రదాయాలు  వదిలేసి "అపస్మారకాసుర“ మాయలో పడి మూడవ వ్యక్తి పాదాలు పట్టుకోవడం మూర్ఖత్వం. ఆ సదరు వ్యక్తి ముక్కు పిండి పలు విధాల వసూలు చేస్తూనే ఉంటాడు. మన ధనం పోతూనే ఉంటుంది. సాధించేది మాత్రం ‘శూన్యం’. కనుకనే, సనాతన ధర్మాన్ని పద్ధతిగా ఆచరించడమైనా తెలుసుకోవాలి లేదా వేద-శాస్త్ర సమ్మతమైన గురువుని/ఆచార్యుడిని ఆశ్రయించడమైనా తెలియాలి.

 

ఎప్పుడైతే నిర్మలమైన, నిశ్చలమైన మనసుతో, స్వయంగా పరమాత్మ నామం పలుకుతూ, స్వహస్తాలతో సత్కార్యం మనమే చేసుకుంటామో అప్పుడు మాత్రమే పాపరాశి దహించుకుపోతుంది. ఇదే శీఘ్రమార్గం. అందుకనే పెద్దలు ‘త్రికరణశుద్ధి’గా అని అన్నారు. అప్పుడే కాలం, కర్మ, విధాత కలసివస్తాయి.

 

ప్రతి సమస్యకి సనాతన ధర్మంలో పెద్దలు పరిష్కారం సూచించారు. పూర్వ జన్మ కర్మ దుష్ప్రభావం తగ్గించుకుని సత్ఫలితాలు పొందగలిగే ముఖ్యమైన మార్గం ఈ క్రింద విధానములో-

 

1) 25% : ఇంటిలో నిత్య దీపారాధన, కులదైవం - గ్రామదేవత నిత్య స్మరణ, స్వస్థల పురాతన దేవాలయ దర్శన - సాయంత్రం సంధ్యాకాల ప్రదక్షిణ చేయడం. మనసులో నిత్య భగవన్నామ స్మరణ, తరచుగా కులదేవత క్షేత్ర దర్శనం చేయడం అత్యంత ప్రధానం (కనీసం 6 నె.కి ఒక్కసారి).

 

2) 20% : తల్లి తండ్రి, ఇంటిపెద్దల అనుభవపూర్వక సూచనలు పాటించడం. విస్మరిస్తే స్వయంకృతాపరాధం. దీని పరిణామాలు క్రింది 4వ సూచికకి అదనం.





3) 30% : క్షేత్ర దర్శన, నది స్నానాలు, ‘స్వహస్తాలతో’ దానధర్మాలు, హోమాలు, ‘స్వయంగా’ పరిహార జపాలు, ‘స్వయంగా’ జపం చేయడం, ‘స్వయంగా’ గోపూజ - గోగ్రాసం ఇవ్వడం - గోసేవ చేయడం. ఏ దాన-ధర్మ కార్యాలు చేసినా ‘మన’ కష్టార్జితంతో ‘మన’ చేతులతో, ‘మన’ ఇంట్లో చేయడమే అత్యుత్తమం.

 

4) 25% : పూర్వ జన్మ కర్మ అనుభవించక తప్పదు. మనతో పాటుగా గత జన్మ సుకృతం-దుష్కర్మ ఫలమనే మూటతో వచ్చాము. ఆ మూటలోని పాపరాశి ఖాళి అయ్యేవరకు కష్ట, నష్టాలను అనుభవించాల్సిందే. తప్పదు. కాని, వాటి తీవ్రతను పై మార్గాల ద్వారా శీఘ్రంగా తగ్గించుకోవచ్చు. ఇది ధర్మ సూక్ష్మం. 75% జీవితం, పరిష్కారాలు మన చేతుల్లోనే ఉన్నాయి. 25% ఒడిదుడుకులు వలన తప్పొప్పులు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సంతోషంగా ఉండవచ్చు.

 

పై 1, 2, 3 లో ఏది లోపించినా దాని భాగం 4లో కలుస్తుంది. పూర్వ జన్మ కర్మ ఈ జన్మలో ఎలా అనుభవిస్తున్నామో, ఈ జన్మలో అన్నీ ఉండి కూడా సత్కార్యాలు చేయకపోయినా, కలి ప్రభావిత మార్గాలను ఎంచుకున్నా ఘోర నరకయాతన తప్పదు సరికదా వచ్చే (నీచ) జన్మలో వీటి దుష్ప్రభావం అదే విధంగా కలుస్తుంది. కనుక విచక్షణా జ్ఞానంతో వ్యవహరించాలి. ఇదే మనుష్య జన్మకి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం.

                                                                                              

                                                                                               శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper