గరుడ పురాణం - నేటి సమాజములోని సంఘటనలు అన్వయించి చూస్తే?
“గరుడ
పురాణం - నేటి సమాజములోని సంఘటనలు అన్వయించి చూస్తే?”
గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచింపబడిన అష్టాదశ
పురాణాలలో ఒకటి. ఈ పురాణము శ్రీమహావిష్ణువు చేత గరుత్మంతునికి ఉపదేశించబడింది కనుక
"గరుడ పురాణం" అని పేరు వచ్చింది. ఈ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.
గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడే ఒక మహత్తరమైన గ్రంథం.
దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోనికి మలచుకోవడానికి ప్రయత్నిస్తాడు.
నిత్యం ఒకే కాలంలో శుచి, శుభ్రము పాటిస్తూ గరుడ పురాణం పఠించవచ్చు. చిన్న వయసులోనే
చదవడం లేదా వినడం వలన జీవితం చక్కగా మలచబడుతుంది.
గరుడ పురాణంలో ముఖ్యంగా, మనిషి, మరణించిన తరువాత వెళ్ళే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా, మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే తదనుగుణంగా సంక్రమించే జన్మలు, పరిణామాలు - ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన ఉంటుంది.
నేడు సమాజములో నెలకొన్న విపత్కర పరిస్థితులలో
"గరుడ పురాణం" మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ప్రత్యేకించి మన హిందూ సనాతన
ధర్మాన్ని అత్యంత విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తున్నామనుకునే ప్రతి ఒక్కరికి ఒక
హెచ్చరికతో కూడిన దిశా నిర్దేశం ఈ మహా గ్రంధం.
తప్పు చేసిన వారికి ఇది భయంకరంగా ఉంటుంది.
మనసు ఆందోళన చెందవచ్చు. కాని, ధృఢమైన మనసుతో కనీసం వినడం ద్వారానైనా తెలుసుకొనగలిగితే
ప్రాయశ్చిత్తపడి, పరిహారాలతో కొంతవరకు పాపం నివృత్తి చేసుకోవచ్చు. చేసిన పాపాలు, ఘోరాలు,
తప్పులు తెలుసుకుని జీవితం మార్చుకుందామనుకునే వారికి ఈ గ్రంధము తల్లిలాంటిది.
జాతస్య హి ధృవో మృత్యుః, ధృవమ్ జన్మ మృతస్య
చ !
పునరపి జననం పునరపి మరణం !
పుట్టినవాడు చనిపోక తప్పదు. చనిపోయినవాడు పుట్టక
తప్పదు !
నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి
నట్టనడుమ నీకెందుకింత తపన !
వయసు పెరుగుతున్నకొద్దీ, ప్రశాంతత పెరగాలి.
కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా ఇంటిలో ఎటు చూసినా "ఇవన్నీ నా కష్టార్జితం,
ధర్మంతో సంపాదించిన డబ్బుతోనే ఇవన్నీ నేను అమర్చుకోగలిగాను" అనే తృప్తి, సంతోషం
కలగాలి. ఇది చాలా ముఖ్యం.
పుట్టినపుడు చూడడానికి ఎవరు వచ్చారో తెలియదు, చనిపోయినపుడు ఎవరు వస్తారో తెలియదు. పుట్టినపుడు ఏడుస్తావు, పోయినపుడు నీ పితృలు రా..రా.. అని ఆ లోకానికి పిలుస్తారు. పుణ్యం చేస్తే వారి దగ్గరికి సంతోషంగా వెళతావు, పాపం చేస్తే యమదూతలు ఈడ్చికెళ్తారు. (కలి) కాలం వేగం పుంజుకుంది. పరిగెడుతోంది. కనుక, జీవించి ఉన్నంత కాలం సంతోషంగా ఉండు, పది మందిని సంతోషపెట్టు, అందరి మనసులో చిరకాలం మంచి చేసి ధర్మంగా నిలిచిపో. పుణ్యవంతుడిగా పుట్టు, పురుగుగా కాదు ! ఇదీ భగవద్గీత, గరుడ పురాణం ద్వారా మనకు లభించే ముఖ్య సందేశాలు. ఈ రెండు గ్రంధాలు మనందరికి అద్భుత వరాలు.
నిర్లక్ష్యంగా, హేళనతో పాపం చేస్తూ ఉంటే కనీసపక్షం
ఈ కలియుగంలో ఇంకొక 10000 జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మన కంటి ముందే
పాము, కప్ప, కుక్క, పంది, పులి, కోతి, బంకపురుగు, చీము పురుగులు, కాకి, త్రాబేలు, మొసలి,
పిల్లి, గాజుపురుగు ఇలా ఎన్నో భయంకరమైన జంతుజన్మలు నిత్యము చూస్తున్నాము. అవి ఎందుకు
అలా పుట్టాయి? ఎన్ని ఘోర పాపాలు చేస్తే ఆ జంతువుల రూపాన్నిచ్చి వాటిలోనికి ఆత్మని ప్రవేశింపచేస్తాడు
ఆ పరమాత్మ? మనం డైరెక్టుగా ఈ జన్మ ఎత్తామని అనుకుంటే పొరపాటే! ఎన్నో వేల, లక్షల జన్మలు
ఎత్తి, క్రమ క్రమేణా పుణ్యం చేస్తేనే ఈ మనుష్యజన్మ లభించింది. దీనికంటే ఉత్తమమైన మార్గం
వైపు వెళ్ళాలి తప్ప, నీచం కాకూడదు. ఒకదాని తరువాత ఒకటిగా ఈ జంతు జన్మలు, చెట్టులు,
వృక్షాలుగా పుట్టాలా? లేదా నిత్యం మంచే ధ్యేయంగా నివశిస్తూ, మరింత ఆనందకరమైన జీవితం
పొందాలా ? అంతెందుకు మనలోనే ఒకరు సుఖసంతోషాలతో, ఇంకొకరు బాధలతో కష్టాలతో ఉన్నారంటే
ఇది గతజన్మ పుణ్య-పాప కర్మల సాక్షిగా వచ్చిందేనని అర్థమౌతోంది కదా! కనుక, మన ప్రవర్తన,
నడవడిక ఎలా ఉంటే జీవితం సుఖమయంగా ఉంటుందో, లక్ష్యం నిర్ణయించుకోవాల్సింది మనమే. రాబోయే
జన్మ మన చేతిలోనే ఉంది సుమా ! ఈ జన్మలో అన్ని సుఖాలు ఉండి పరులకి కష్టం, నష్టం, కీడు,
బాధ కలిగించడం చేసినా ఇతరత్రా పాపాలు చేసినా రాబోయే జన్మ నీచమే ! ఇక్కడ తాత్కాలికంగా
లభించిన భౌతికమైన హోదా, అంతస్థు, పలుకుబడి, మంది మార్బలం ఏమీ పరలోకంలో ఏ కోశాన ఉపయోగపడవు.
ఇక్కడ ఎంతోమంది పొగడ్తలతో ముంచెత్తవచ్చు గాక, కాని ధర్మాచరణ, పుణ్యం మాత్రమే పరలోకంలో
క్షేమాన్ని ఇచ్చేవి. ఇది గ్రహించాలి.
అందువలన, ఈ క్షణం నుండి వాడవాడలా "గరుడ
పురాణ" పఠనం మారుమ్రోగాలి !
తెలియక తప్పు మార్గంలో పడినవారు, తెలుసుకుని ఇప్పటికైనా మారితే, సమాజములో శాంతి, సామరస్యాలు వృద్ధి చెందుతాయి. అన్ని సమస్యల పరిష్కారము మన చేతిలోనే ఉంది. ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనుకుంటే పొరబాటే. సర్వే జనాః సుఖినో భవంతు !
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
.jpeg)

