ఆధ్యాత్మికంలో ఆ..కలి గురువులు - Editorial in Andhra Jyothy
ఆధ్యాత్మికంలో ఆ..కలి గురువులు
వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు. గురువు అజ్ఞాన చీకటిని తొలగిస్తాడని ప్రశస్తి.
మరి సత్యాన్ని అణగదొక్కి అంధకారంలో నెట్టివేస్తే? గుడులు కడుతున్నారనో,
పారాయణ–హోమాలు చేస్తున్నారనో, ప్రవచనం చెప్తున్నారనో వారిని గురువులుగా ఆనందించాలా
లేక బ్రహ్మచర్యం పాటించకుండా సన్యాసులమని ప్రజలను మోసం చేస్తున్నందుకు చింతించాలా?
ఒకప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు సందర్శించిన ఆశ్రమాధిపతులు నేడు చెరసాలలో
ఉన్నారు. కొందరు చాకచక్యంతో ఇంకా తప్పించుకుని మన మధ్యే తిరుగుతున్నారు. ప్రజలను
శైవ, వైష్ణవ విరోధంగా విభజించి సమతాభావ లోపంతో ప్రచారం చేసేవాడు ఒక గురువైతే, తాను
అవతార పురుషుడినని ప్రకటించుకునేవాడు మరొకడు. రాజకీయంగా ప్రసిద్ధి పొందినవారు
కొందరైతే, తప్పిదాలను కప్పిపుచ్చే ప్రణాళికతో తమ కార్యక్రమాలలో వివిఐపిలు ఉండే
విధంగా చూసుకునేవారు కొందరు. ఒక పీఠాధిపతి, తెలుగునాట ప్రసిద్ధుడైన మరొక
పీఠాధిపతిపై పదేళ్ళక్రితం ఆగ్రహం వ్యక్తపరుస్తూ ఆ సదరు స్వామీజీ వందల కోట్లు
గడించాడని విమర్శించాడు. కాని ఆశ్చర్యంగా ఆ ధనపతికి, ఈయనకు మధ్య సయోధ్య ఎందుకు
కుదిరిందో తెలియదు, గత మే నెలలో బహిరంగంగా ప్రజలను మూర్ఖులు చేసి ఒకరినొకరు
కౌగిలించుకున్నారు. వీరి అంతర్గత వ్యవహారాలు తెలియక ఎంతో ఉత్కృష్టమైన గురు–పరంపరకు
చెందిన పీఠాధిపతులు అటువంటి ఆశ్రమాలను సందర్శించడం దొంగ స్వామీజీలకు జాక్‌పాట్
అవుతోంది. ఎలాగైతే విలువలతో కూడిన రాజకీయాలు కరువై సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్న
నాయకులు ఎక్కువయ్యారో, అలాగే సనాతన హిందూ ధర్మాచరణకు తిలోదకాలిచ్చి
ఆధ్యాత్మికాన్ని వ్యాపారమయం చేసే స్వామీజీలు ఎక్కువైపోయారు. పైపెచ్చు
పీఠాధిపత్యంలో కూడ కుటుంబ–పరంపర కొత్తగా మొదలైంది. వీరందరి ఆ‘కలి’ ఒకటే!
వేద శాస్త్రాల మీద పట్టు, ధర్మాచరణ మీద శ్రద్ధ, సన్యాసాశ్రమమంటే భక్తి, భయం వీరికి ఉండవు. బ్రహ్మచారులుగా ఉండిపోయామని ప్రచారం చేసుకోవడం అబద్ధం. ఒక్క విషయం సుస్పష్ఠం. భక్తుల అవివేకం, జ్ఞాన రాహిత్యంతో వ్యాపారం చేయడం ఘోరనరకాలకు పునాది. గురువు/ఆచార్యగా వ్యవహరించేవాడు లౌకికంగా ఎంత ఎదిగినా భగవంతుని దృష్టిలో లెక్కలు వేరు. కీర్తి, ధనార్జన జనాకర్షణ, హోదా కోసం ప్రాకులాడుతూ భాగవత ధర్మాన్ని నిరాదరణ చేస్తున్నవాడు కలి ప్రభావానికి లోనైన పాపి. ఈ కోవకు చెందిన స్వామీజీలు తోటి ఆధునిక స్వామీజీలనే ఇష్టపడతారు. ఒకరినొకరు ఆహ్వానించుకోవడం, పబ్లిసిటి కోసం ఆశ్రమానికి రప్పించుకోవడం, వచ్చినందుకు ముట్టచెప్పడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ హెచ్చరిక చేశాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అసూయతో పరులను దూషించేవాడు, క్షుద్రపూజలు, వశీకరణ చేసేవాడు, భక్తిని వ్యాపారమయం చేసేవాడు గురువులై ప్రసిద్ధి పొందుతారని, అటువంటివారిని ఆశ్రయించే వారు అభాగ్యులని, వారిని విస్మరించి సత్యమార్గాన్ని పట్టేవారు ధన్యులని చెప్పాడు.
అంటే కలిప్రభావం సనాతనధర్మ భ్రష్ఠులపై ఉంటుందని అర్థం. ఈ భ్రష్ఠులలో చాలామంది విశ్వసనీయమైన పరాత్పర–పరమేష్ఠి–పరమ–గురు పరంపర (భౌతిక) వ్యవస్థ లేనివారే. ఈ క్రమం పటిష్ఠంగా ఉన్నవారు, ఇప్పటికీ పవిత్రులుగా బ్రహ్మనిష్ఠ, ధర్మనిష్ఠా గరిష్ఠులై సమతామూర్తులుగా ఉన్నారు. అనుక్షణం వేదవేదాంగాలు, శాస్త్రాలు, భాష్యాలు అంతర్ముఖముగా లీనమై పరిశోధన, అధ్యయనం, సాధన చేస్తూ సమస్త మానవాళి శ్రేయస్సుకై తాము ధర్మాన్ని కఠినంగా ఆచరిస్తూ, తపస్సంపన్నులై, మాయకు లోనుకాకుండా ప్రజలకు బోధిస్తూ మహోన్నతమైన గురు–పరంపరకు చెందిన పురుషోత్తములే జగద్గురువులు. అమాయక భక్తులకు నిజం తెలుసుకునే లోపల జీవితకాలం ముగుస్తుంది. సంపదంతా ఖాళీ అవుతుంది. శాస్త్రం నిర్దేశించిన విధంగా భారతదేశ కర్మభూమిలోనే ఉంటూ ధర్మాచరణ, బ్రహ్మనిష్ఠలో లీనమై, ఉపాసన శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారి పాదాల వద్దకు ప్రపంచమే వచ్చి ఆరాధిస్తే జగద్గురువులౌతారు గాని, విమానాలలో తిరిగే వ్యక్తులు కాలేరు. ఆధునిక స్వామీజీలు ‘శిష్య ద్రోహం’ అనే ఘోరపాపం ఒకటి ఉందని తెలుసుకోవాలి.
ఇప్పటికైనా అన్ని మతాలకు చెందిన కొన్ని కేంద్రాల వికృత నడవడిక, యంత్రాంగం అంతర్గత వ్యవహారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పఠిష్ఠమైన నిఘా పెట్టి భారతదేశ మహోన్నతమైన సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడే దిశగా చర్యలు చేపట్టాలి. వదిలేస్తే, మన దేశానికి ఆయువు పట్టైన సనాతన ధర్మం క్షీణించి దేశ ఉనికికే ప్రమాదమౌతుంది. రాబోయే తరాలు అన్యాయంగా నశించిపోతాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే, అమలు చేయడానికి నీతివంతమైన అధికారులు ఇంకా ఉన్నారు. మహాభారత యుద్ధం పిదప శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అన్న మాటలు ‘నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించినా, నీ కర్మ నిన్ను వెంటాడి ఆ పాపఫలాన్ని అనుభవింపచేస్తుంది. ఇప్పటికైనా పశ్చాత్తాపపడి, మంచి మార్గాన్ని పట్టు. లేదంటే ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు’. ప్రజలకు సరళమైన జీవన విధానం బోధించే హైఫై స్వామీజీల జీవితం విలాసవంతంగా, భోగభాగ్యాలతో ఉంటోంది. భక్తుల జీవితం మాత్రం ప్యాసింజర్ బస్సులు, ద్విచక్ర వాహనాలు, అప్పుసప్పులతోనే కొనసాగుతోంది. అపాత్ర దానం చేసే బదులు ఒకటో రెండో ఇండ్లు సమకూర్చుకోవచ్చు. ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులైనా, ఆధునిక గురువులైనా అంగ –ఆర్థిక –అధికారబలంతో ఏదైనా మాట్లాడతారు. సామాన్యులైన ప్రజలకే విచక్షణా జ్ఞానం అవసరం. ఎందుకంటే ఏ నష్టం జరిగినా ప్రజలకే!. ఒక పక్క హిందువులను విభజించి దేశాన్ని విచ్చిన్నం చేయాలని విద్రోహ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, ఉన్నతస్థానంలో ఉన్నవారు విజ్ఞత కోల్పోతే ఆ దుష్టచర్యలకు ఆజ్యం పోసినవారౌతారు. ఆర్థిక, ఆధ్యాత్మిక నేరగాళ్ళను పట్టుకోవడం, శిక్షించడం అందుకనే కష్టతరమౌతోంది!
⯁ శ్రీరామపాద భాగవతర్
ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ (సంపాదకీయం)
This is a published editorial in Andhra Jyothi, a Telugu leading daily newspaper
https://www.andhrajyothy.com/2022/editorial/in-spiritual-aa-kali-gurusngtseditorial-737616.html
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Rights reserved. Copy, alteration, reproduction is prohibited. Sharing as it is permitted.
