"వసుదైవ(ధైక) కుటుంబకం" అనడానికి ఎవరు అనర్హులు ?
"వసుదైవ(ధైక)
కుటుంబకం" అనడానికి ఎవరు అనర్హులు ?
అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం "ఇది ఎంతో పవిత్ర వాక్యం". ఇష్టమొచ్చినట్లు వ్యాపారం కోసమో, కృత్రిమ అభిమానం కోసమో వాడకూడదు. తమ లౌకిక ప్రయత్నాలకి రంగుపూసి గొప్ప సాధించడం కోసం ఈమధ్య ఈ వాక్యాన్ని ఉపయోగించడం ఎక్కువైపోయింది. పోనీ ఉన్నతమైన మనసు, భావం, వినయం, భక్తి కలవారా అంటే అదీ లేదు. ఇది చాలా దురదృష్టము.
ఒక వ్యక్తి తాను "వసుదైవ(ధైక) కుటుంబకం" అనే మంత్రాన్ని నమ్ముతానని అనాలంటే, తాను మానసికముగా పరిపూర్ణుడై, జాతి కుల మత ధనిక పేద పశు పక్షి ప్రాంతీయ భేదములు లేనివాడై, అందరిని ప్రేమించగలిగినవాడై ఉండాలి. అన్ని విధాల హింస మార్గాన్ని విడనాడి, జీవిత సత్యాన్ని గ్రహించినవాడై, మానసికంగాను - అలోచనా విధానంలోను - నడవడికలోను - మాటలలోను - చేతలలోను ధర్మ మార్గాన్ని సర్వకాల సర్వావస్థలలోను అనుసరించినవాడై ఉండాలి.
అంటే, ఇటు కుటుంబములోనూ అటు సమాజములోనూ మరొకరిని పరిహాసం చేసేవాడు "వసుదైవ(ధైక) కుటుంబకం" అనడానికి అనర్హుడు. ఈ కోవకు చెందిన మరికొంతమందిని తెలుసుకుందాం. అసత్యం - అవినీతి - అక్రమం - అన్యాయం - అరాచకం చేసేవారు, బాహ్యంగా నీతివాక్కులు చెపుతూ అంతర్గతంగా అధర్మాన్ని ప్రోత్సహిస్తూ సత్యాన్ని అణగతొక్కేవారు, విభజించి పాలించేవారు, కుటుంబ వ్యవస్థని, సమాజ శాంతిని నిర్వీర్యం చేసేవారు, ఈ అవలక్షణాలని చూస్తూ ఖండించనివారు కూడా "వసుదైవ కుటుంబకం" పలకడానికి అనర్హులు, ఎందుకంటే ఇవన్నీ ఘోరపాప కర్మలు.
భగవాన్ శ్రీకృష్ణుడు, ఈ మధ్యకాలంలో కంచి పరమాచార్యులు, శృంగేరి చంద్రశేఖర భారతి మహాస్వామి వారు సమస్త మానవాళి, ప్రాణికోటిపై (చీమ నుండి ఏనుగు వరకు) కరుణ చూపేవారు. నాస్తిక ఆస్తిక జాతి కుల ప్రాంతీయ భేదము లేవు వారికి. మరొకరి బాధలని తమ బాధలుగా భావించి పరిష్కరించేవారు. రాగద్వేషాలకి, బంధాలకి, లౌకిక ఆస్తులు, భోగాలకి అతీతులు. వీరు భౌతికంగా విదేశ యాత్రలు చేయలేదు సరికదా, ప్రపంచమే వీరి పాదాల చెంతకు వచ్చింది. అందుకనే జగద్గురువులయ్యారు. అటువంటి మహాపురుషుల లక్షణాలలో ఒక లక్షవ వంతైనా సాధించగలిగిన నాడు, మనం "వసుదైవ(ధైక) కుటుంబకం" ను నమ్ముతామని చెప్పడానికి అర్హులౌతాము.
నేటి విపత్కర కాలములో కూడా, కేవలం నిత్య భగవన్నామ స్మరణ వలన "ఉత్తమ గుణము" కలిగిన వ్యక్తిగా మారడం సాధ్యమే, అది ఎంతో దూరములో లేదు. మడి, ఆచారము ముఖ్యము కాదు. క్రమం తప్పకుండా జపించడమే ప్రధానం ! కాలం బాగా లేదు. లోకం సరిగ్గా లేదు. మంచి జరగాలంటే ప్రజలలోనే మార్పు రావాలి. కోట్ల మంది ప్రజలలో మార్పు వస్తే, పదులలో ఉండే అవినీతి - అధర్మ సమాజం ఏమి చేయలేదు. పైగా వారు కూడా మారితే, సమాజము శుభిక్షమే. ఆశించడంలో తప్పు లేదు కదా !
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏼
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.