శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
శ్రీరామపాద భాగవతర్ కలం నుండి ప్రత్యేకం
తిరువైయారు, జనవరి 17 (నాదోపాసన): ఒక మహా మహిమాన్వితమైన భాగవతోత్తముడు శ్రీ త్యాగరాజ స్వామి. ఆయన భక్తి గానమునకు మెచ్చి శ్రీరాముడు (త్రేతాయుగంలో శ్రీమహావిష్ణు అవతారం) కేవలం నేటికి 178 సం.ల క్రితం తిరువైయారు వచ్చి దర్శనం ఇచ్చాడంటే భగవంతుడు నిత్యం మన ప్రక్కనే ఉన్నాడనడానికి సాక్ష్యమే కాక, మనం వేదశాస్త్ర సమ్మతమైన ఏ రూపంలో కొలచినా దర్శనమిస్తాడనేది సుస్పష్ఠం. ఈశ్వరుని చూడాలంటే కావలసిన అర్హత ఒక్కటే "నిష్కల్మష, నిష్కామ్య భక్తి" మాత్రమే. ఇదే సద్గురు త్యాగరాజస్వామి మనకు నిరూపణ చేశారు🙌
కర్ణాటక సంగీతంలో ఎన్నో తెలుగు సాహిత్య కీర్తనలను ఈ ప్రపంచానికి ఉపదేశించిన వాగ్గేయకార శిరోమణి త్యాగయ్య, తెలుగువాడిగా మనందరికి గర్వకారణం. తెలుగుబిడ్డలైన 'ఎందరో మహానుభావులు' తమిళనాట స్థిరపడి ప్రపంచానికి ఆరాధ్యులయ్యారు. వారిలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు💥
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఇద్దరు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి మరియు సదాశివ బ్రహ్మేంద్ర, నారాయణ తీర్థులు ఆంధ్రరాష్ట్ర బ్రాహ్మణ కుటుంబములో పుట్టిన మహనీయులు కావడం తెలుగువారిగా మనందరికి ఎంతో గర్వకారణం. అంతే కాకుండా మన అన్నమాచార్య, భద్రాచల రామదాసు కీర్తనలు ఇతర భాష విద్వాంసులకు ఆరాధ్యము. అటు ప్రాచీన భజన సిద్ధాంతకర్తలైన త్రిమూర్తులలో ఇద్దరు మరుదనల్లూర్ సద్గురుస్వామి, శ్రీధర అయ్యావాళ్ కూడ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పురుషోత్తములే 🔔
తరతరాలుగా భాష-ప్రాంతాలకి అతీతంగా ఎంతోమంది విద్వాంసులు ఆ మహానుభావులను ఆరాధిస్తూనే ఉన్నారు. వారి కీర్తనలను వినాలన్నా, గానం చేయాలన్నా, నేర్చుకోవాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆధ్యాత్మిక, శాస్త్రీయ సంగీతోపాసనా పరంగానూ, ఇటు లౌకికంగానూ ఆ మహనీయుడు ఎన్నో వేలమందికి జీవనోపాథి, భుక్తి ప్రసాదించాడు. ఇందుకు మనందరం శ్రీ త్యాగరాజస్వామి చరణదాసులమే !
అటువంటి మహనీయుల వారసత్వాన్ని పొంది భక్తి, సంగీతములో వేల సంఖ్యలో మన పిల్లలను తయారుజేసి కుటుంబాలు ధన్యమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భములో ప్రపంచ వ్యాప్తంగా శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్న సంగీత విద్వాంసులు, విధుషీమణులకు నా భక్తి పూర్వక శుభాకాంక్షలు. క్లుప్తంగా చెప్పాలంటే సంగీత సాధకులు, పోషకులు, ప్రచారకులు, రసికులు ఆ పరమాత్మకు అత్యంత సమీపంలోనే ఉన్న అదృష్టవంతులు 🎻
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.


