వీరు చేసిన హోమం, పూజలు భగవంతుడి అనుగ్రహాన్ని ఇవ్వవు. ఎందుకు?
వీరు చేసిన హోమం, పూజలు భగవంతుడి అనుగ్రహాన్ని ఇవ్వవు. ఎందుకు?
- అవినీతిగా, అక్రమంగా సంపాదించిన ధనముతో చేసినపుడు.
- అసత్యముచే సేకరించిన దానముతో చేసినపుడు.
- అక్రమ సంబంధం కలిగిన వ్యక్తులు చేసినపుడు / నిర్వహించినపుడు.
- లోకానికి నీతి వచనాలు చెపుతూ, అంతర్గతంగా మోసపూరిత ధోరణితో వ్యవహరించేవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- కల్మష మనసు, కుయుక్తి, కుతంత్ర బుద్ధి కలవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- అధర్మము, అన్యాయము, అసత్యమునకు సాక్షియై, విచక్షణా రహితంగా నడుచుకునేవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- ఆధ్యాత్మిక సంస్థ (దేవాలయము, ఆశ్రమము, పీఠము, మఠము) వ్యాపార దృష్టితో చేసినపుడు.
- మనసా, వాచా, కర్మణా, దృష్ట్యా అపవిత్రమైనవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- మడి, ఆచారం, అనుష్ఠానం చేసేవారు, స్వలాభం కోసం శాస్త్ర ధర్మాన్ని విస్మరించి చేసినపుడు.
- గుప్తముగా ఆహారం తీసుకుని, ఉపవాసం ఉన్నట్లు బాహ్యంగా నటిస్తూ చేసినపుడు.
- మంత్రోఛ్ఛారణ లోపం, మంత్రం దాటవేసేవారు చేసినపుడు.
- నిత్య అగ్నిహోత్రం చేయనివారు, నిష్ఠగా లేనివారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- వివాహం అయి ఉండి, భార్య సమేతంగా చేయనివాడు చేసినపుడు.
- కీర్తి ప్రతిష్ఠ, కమిషన్‌ల కోసం గుడులు, ఆశ్రమాలు కట్టేవారు చేసినపుడు.
- నేరాలు, మోసాలను అవినీతిచే కప్పిపుచ్చి, బాహ్యంగా పవిత్రులమైనట్లు నటిస్తూ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేసేవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- పవిత్ర స్థలాలను ఊహించలేని / నమ్మలేని విధంగా అపవిత్రం చేసేవారు చేసినపుడు/నిర్వహించినపుడు.
- వక్ర భాష్యాలతో ప్రజలని బురిడీలు కొట్టించి, బ్రహ్మచారులమని ఘోషించుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటించని సన్నాసులు, స్వాములు, స్వామీజీలు, అవ-దూతలు చేసినపుడు / నిర్వహించినపుడు.
- అపవిత్రమైన, వర్జించిన ఆహారము తిని చేసినపుడు / నిర్వహించినపుడు.
- ధనాన్ని అన్యాయం, అధర్మం, పలుకుబడి, జూదం, మద్యం, స్త్రీ వ్యసనం కోసం దుర్వినియోగం చేసేవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- దేశ రాజుని, మంత్రులను చాకచక్యంగా తప్పుదోవ పట్టించి, మూర్ఖులను చేసి ఆహ్వానించి తమ పేరు ప్రతిష్ఠ, పరోక్షలాభం కోసం చేసినపుడు / నిర్వహించినపుడు.
- పరులు, బలహీనులను మోసం చేసి, పాప పరిహారార్థం చేసినపుడు.
- కుటుంబ సభ్యులకు, నమ్మినవారికి, భక్తులకు ద్రోహం చేసి “లోకకళ్యాణం/విశ్వశాంతి” అని బూటకపు నాటకాలు ఆడేవారు చేసినపుడు.
- వేదాన్ని అభ్యసించియుండి కూడ, మోసపూరితులకు సహకరించువారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- ద్రవ్యం/రుసుము తీసుకుని వారి గోత్ర నామాలతో సంకల్పం చేయనివారు చేసినపుడు / నిర్వహించినపుడు.
- గురు స్థానంలోనూ, ధర్మపీఠంపై కూర్చుని ఉండి, పై వాటిలో ఏదైనా అవలంభించేవారు చేసినపుడు / నిర్వహించినపుడు.
పైన ఉదహరించిన వారందరిని అపవిత్రులు అంటాం. వీటిలో కొన్ని విషయాలు తెలుసుకోవడం కష్టమే అయినా, పలు విధాలలో వారి లోపాలను గ్రహించవచ్చు.
అపవిత్రులు చేసే కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వలన, దుష్పరిణామాలు మీద పడే ప్రమాదం ఉంది. కావున అటువంటి వారిని విస్మరించడం మేలు. అపవిత్రులు పూజలు, పారాయణ యజ్ఞాలు, కాశి/ఇతర జ్యోతిర్లింగ క్షేత్రములలో ఎన్ని అతిరుద్ర మహాయాగాలు చేసినా, కాశి-అయోధ్య-కురుక్షేత్రలో కుటీరాలు కట్టినా, ఈశ్వర కృప లభించదు సరికదా కలిపురుషుడి సహవాసం మాత్రం వెంటనే లభించి, రాబోయే వేల జన్మలలో పాపం అనుభవించవలసివస్తుంది. అంటే పరమాత్మ తాత్కాలిక ఫలం ఇచ్చినట్లే కనిపించినా, మరొక రూపంతో పాపులను వధిస్తాడు. వీటికి పురాణ ఇతిహాసాలలో ఎన్నో దృష్టాంతాలు. అందుకే మెరిసేదంతా బంగారం కాదని సున్నితమైన హెచ్చరిక !
మరి మార్గము ఏమిటి 🧐 ఏది ఉత్తమం ?
ఎటువంటి పుణ్య కార్యమైనా, దానధర్మాలైనా, పూజ, హోమాలైనా మన కష్టార్జితముతో మనమే చేసుకోవడం అత్యుత్తమం. ఒక మంచి వేద బ్రాహ్మణుడుని ఏర్పరుచుకుని, మన ఇంటిలో స్వహస్తాలతో చేయగలిగితే ఫలితం శీఘ్రంగా లభించడమే గాక, మన ఖాతాలో పుణ్యం ఖచ్చితంగా జమ అవుతుంది. జాతకదోష పరిహార జపాలు కూడ మనమే చేసుకోవడం ఉత్తమం. కుదరకపోతే, వేదబ్రాహ్మణుడి చేత ఇంటిలోనే అన్ని ఏర్పాటుచేసుకోవాలి. స్వగ్రామ దేవాలయం కూడ శ్రేష్ఠమే. ఎక్కడికో వెళ్ళి, వేల రూపాయలు ఖర్చు చేయడం వృధా ప్రయాస. గోత్ర నామాలతో ఎక్కడో ధనాన్ని చెల్లించి ప్రయోజనం ఆశించడం అవివేకం.
మరో ప్రక్క, అత్యంత నిష్ఠ కలిగిన వేదోత్తముడినైనా, నిత్యాగ్నిహోత్రుడినైనా, ధర్మచింతన కలిగినవారినైనా అభ్యర్థించి ఏ విధముగానైనా ధర్మ కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు. అటువంటి వారు చేసే ధర్మ కార్యానికి, మన కష్టార్జితంలో పది రూపాయిలు ఇచ్చినా, భౌతికంగా సేవ లేదా మాట సాయం చేసినా పుణ్యం మూటలు కడుతుంది. ఏదీ చేయలేని వారు, ఆ ప్రాంగణములో కూర్చుని వేద శ్రవణం చేస్తూ తిలకించినా పుణ్యం లభిస్తుంది.
నిజం చేదుగానూ, ధర్మం సత్యం కఠినముగానే ఉంటాయి. సమయం మరియు ధనం విలువ, పోగొట్టుకున్న తరువాతే తెలుస్తుంది. హిందూ సనాతన ధర్మ విలువలు తెలుసుకుని అనుసరించి కాపాడుకోవాలనే తపన ఉన్నవారికి ఈ సూక్ష్మం ఎంతో ఉపయుక్తముగా ఉంటుంది. వ్యాపార పరముగా చేసే ఏ దైవ కార్యమూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. పైపెచ్చు దుష్పరిణామాలు సంభవిస్తాయి. ధర్మ సంబంధమైన యమ-నియమాలను అపహాస్యం చేస్తే అఘము (పాపము) చుట్టుకుంటుంది. తెలుసుకునే సమయానికి జరగవలసినదంతా జరిగిపోతుంది. అత్యంత విచారకరమైన విషయమేమంటే నిజాన్ని అంగీకరించే స్థితిలో ఉన్నవారు ఇంతమంది కోట్లలో కేవలం వందలలోనే ఉన్నారు. ఈ సంఖ్య రాను రాను వేలు, లక్షలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షితః !!
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted. V2.XI26.22
