ఎవరు గొప్పవాడు ? ఎవరు పుణ్యాత్ముడు ?
ఎవరు గొప్పవాడు ? ఎవరు పుణ్యాత్ముడు ?
2-3 ఇళ్ళు ఉన్నవాడు కాదు; బ్యాంక్ ఖాతాలో పెద్ద
మొత్తం ఉన్నవాడు కాదు; లక్జరి (పెద్ద) కారు ఉన్నవాడు కాదు; అధికారంలో ఉన్నవాడు కాదు;
ప్రపంచమంతా విలాసవంతముగా విమానాల్లో తిరిగేవాడు కాదు; పలుకుబడి – ప్రత్యేకమైన కవరేజ్
ఉన్నవాడు కాదు; అందమైన దేహం, ఆభరణాలు ధరించినవాడు కాదు; ఖరీదైన వస్తువులను కలిగినవాడు
కాదు; పలు క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగినవాడు కాదు; కట్టల కొద్దీ ఆస్తులు-స్థలాల
దస్తావేజులు కలిగినవాడు కాదు; దేవుడి పేర తరచు కట్టడాలు కడుతూ లౌకిక ఆకాంక్ష కలిగినవాడు
కాదు …. ఎందుకంటే, ఇవేవి సత్యం కాదు, శాశ్వతం కాదు కనుక. మరియు, అందరికి తెలిసినట్లు
ఈ దేహం ఏదో ఒకనాడు పడిపోకతప్పదు, ఆత్మ మాత్రం విడిపోయి, అప్పటి వరకు చేసిన పాప-పుణ్య
కర్మలు అనుసరించి వేరే దేహంలోనికి ప్రవేశిస్తుంది. దీనికి సాక్ష్యం మనము అణునిత్యం
రకరకాల జీవులని, పలువిధాలైన మనుషులని కళ్ళతోనే చూస్తూ ఉన్నాము.
ఒక్కసారి మన వేదశాస్త్రాలు ఏమి ఘోషిస్తున్నాయో,
ఇతిహాసాలు ఏమి నిరూపణ చేసాయో చూద్దాం,
विपदो नैव विपद: सम्पदो नैव सम्पद: ।
विपद: विस्मरणं विष्णो: सम्पन्नारायणस्मृति: ॥
కనుక, ఎవరు గొప్ప అంటే ;
1) సత్యం పలికేవాడు, ఇతరుల మంచి కోరేవాడు, మంచి జరగాలని ఆశించేవాడు;
2) పరులకి ప్రత్యక్షంగా గాని - పరోక్షంగా గాని
హాని, కష్టం, నష్టం, బాధ కలిగించనివాడు;
3) ధర్మాన్ని, సంస్కారమును వాటి సాధనని - అలవాట్లని
పరిరక్షించేవాడు; సనాతనంగా ఉన్న పవిత్ర క్షేత్రాలని, దేవాలయాలని వాటి ఆస్తులని కాపాడేవాడు;
ఆగమ శాస్త్ర యుక్తంగా నిత్య కైంకర్యాలు నడిచే విధంగా సహకరించేవాడు; ఆలయాలని శుద్ధి
చేసేవాడు, శుభ్రపరిచేవాడు;
4) నిత్యం భగవన్నామాన్ని మనసారా నిష్కల్మషముగా
స్మరించేవాడు; ఇతరులని స్మరింపజేసేవాడు ఆ పరమాత్మనే సొంతం చేసుకున్న మహనీయుడు. ఆ పరమాత్మ
అటువంటివారి ఆత్మలో లీనమై ఉంటాడు. ఆత్మ ఈ దేహం విడిచిన తరువాత, వేరే దేహంలోనికి ప్రవేశించిన
పిదప కూడ ఈశ్వరుడు ఆ ఆత్మతోనే ఉంటాడు. అటువంటివాడే అత్యంత ఐశ్వర్యవంతుడు;
5) ఎవరైతే ఈ పైన చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తులతో
స్నేహం చేస్తారో వారు;
ముఖ్యంగా, ఈ కాలంలో చాలామంది ఈ దేహం ఉన్నంతవరకు
సరైన విషయాలని గ్రహించలేకపోతున్నారు. ఇది విచారకరం, వారికి బాధాకరం. చిట్టచివరికి తెలుసుకున్నా
ప్రయోజనం లేదు. ఆత్మ, దేహాన్ని వదిలిన తరువాత పడే బాధలు అంతా ఇంతా కాదు. చేసిన పాపాలకి
ఎటువంటి శిక్షలు అనుభవించవలసివస్తుందో గరుడపురాణం చదివినా, శ్రవణం చేసినా అవగతమౌతాయి.
ఇక్కడ సంపాదించిన ధనం, ఆస్తులు, మంది మార్బలం, పలుకుబడి అక్కడ ఏ కోశాన పనికిరావు. ఎవరూ
నిన్ను కాపాడలేరు. అందువలన, ఒకవేళ పాపం-తప్పులు చేసియుంటే ఎంత త్వరగా పశ్చాత్తాపం చెందగలిగితే
అంత మంచిది. పశ్చాత్తాపం అనేది ఒక గొప్ప లక్షణం. దీని వలన తనకే కాకుండా, తన సంతానం
భవిష్యత్తుకి ఇహపరంలో ఎంతో మంచిది.
కనుక, ప్రతి ఒక్కరు నిజం, న్యాయం, నీతి, నమ్రత,
దయ స్వభావాన్ని అలవరచుకోవాలి. దీని వలన తమ కుటుంబం, పిదప తను నివశిస్తూ ఉన్న సమాజంలో
శాంతి, సామరస్యాలు పెంపొంది జీవించి ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవించగలరు. సర్వే జనాః
సుఖినో భవంతు !
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.