శైవ - వైష్ణవ దూషణ రోగ కారకం !
శైవ - వైష్ణవ దూషణ
𝟏) శైవ - వైష్ణవ దూషణ
చెన్నై, ఫిబ్రవరి 1, 2022 : నేడు నెలకొన్న విపత్కర
పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కుటుంబ సౌఖ్యము, జీవనమార్గ ఉన్నతి కోసం భగవన్నామ చింతనతో
ఎక్కువ సమయం గడపవలసిన రోజులు ఇవని, కాలం-వయసు పరుగెత్తుతున్నాయని, బరువు-బాధ్యతలు తీరటం
కష్టమౌతోందని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ అభిప్రాయపడ్డారు. లోకం బాగా లేదని,
ఇంటి ద్వారం తెరచి బయట అడుగుపెడితే మోసం, అసూయ, కల్మషము, అధర్మం, అవినీతి, అక్రమమే
ఎక్కువ భాగము కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. తోడు-నీడగా నిష్కల్మషమైన స్నేహభావముతో
మెలిగేవారు దొరకడం దుర్లభమైందని శ్రీరామపాద అన్నారు.
మరోప్రక్క కొంతమంది మహనీయులు సమాజ అభ్యున్నతి,
శాంతి కోసం నిత్యం హోమాలు, సంగీత - సంకీర్తనలు, దానములు, వేద గోష్టిలు, భగవన్నామ పారాయణలు
చేస్తున్నారని, ‘సర్వే జనా సుఖినో భవంతు’ అని నిత్యం పరితపించే సజ్జన సమూహాలలో బ్రాహ్మణులు
ఎల్లప్పుడూ ముందుంటారని, వర్ణాలకి అతీతులు బ్రాహ్మణులని ఆయన చెప్పారు. నేటి పెంపక లోపమో,
సజ్జన సహజీవన/సాన్నిహిత్య లోపమో కొంతమంది శైవ, వైష్ణవ బేధముగా పరస్పరం దూషించుకుంటున్నారని,
ఇది ఎంతో బాధ కలిగిస్తోందని, ఇటువంటి పరిణామాలు దురదృష్టకరమని శ్రీరామపాద భాగవతర్ ఆవేదన
వ్యక్తపరిచారు.
నారాయణుడు, మహాదేవుడు వీరిద్దరికి లేని బేధభావాలు,
పూర్వజన్మ కర్మానుసారం మనుష్య జన్మనెత్తిన మనకు ఉండటం నీచ గుణానికి ప్రతీకని ఆయన వాపోయారు.
పురాణ-ఇతిహాసాలలో ఎన్నోచోట్ల నిరూపితమైన ‘ఈశ్వర తత్వం’ సకల వేదశాస్త్రాలను ఖండ-ఖండాలుగా
ఉపాసన చేసిన మహనీయులకు మాత్రమే అర్థమౌతుందని, అల్పజ్ఞానులమైన మనకు ఆ అద్భుతము తెలియదని,
మాట్లాడటానికి అర్హత కూడా లేదని శ్రీరామపాద తెలిపారు.
2) “శివ ద్వేషిని నారాయణుడు, విష్ణు ద్వేషిని
మహాదేవుడు రక్షించరు”
సకల శాస్త్ర కోవిదుడు, తపస్సంపన్నుడు, పరమ శివభక్తుడైన దశకంఠుడు (రావణుడు) విష్ణు-ద్వేషియై ప్రతిఘటించినపుడు పరమేశ్వరుడు రక్షించలేదని, విష్ణ్వావతారం శ్రీరాముని చేతిలో హతమయ్యాడని, అలాగే బ్రహ్మ పుత్రుడైన దక్షప్రజాపతి శివ-ద్వేషియై అహంకారముతో విర్రవీగినపుడు, అతని ఆరాధ్యుడైన విష్ణువు రక్షించలేదని, శివుని వెంట్రుక నుండి ఉద్భవించిన వీరభద్రుని చేతిలో హతమయ్యాడని, బృహస్పతిస్తవ యజ్ఞం పూర్తిచేయవలసిన విధి కోసం, దేవతల విన్నపము మీద పరమేశ్వరుడు దక్షునికి మేక తలతో పునర్జన్మనిచ్చాడని, ఆపై దక్షుడు కాశీ క్షేత్రములో శివనామ స్మరణతో జీవించాడని శ్రీరామపాద భాగవతర్ ఈ సందర్భముగా గుర్తుజేసారు.
అంటే, భగవంతుని దృష్టిలో శివకేశవ బేధము లేకుండా పరమాత్మని అర్చించేవారు ఉత్తములుగాను, శివ/కేశవులను ద్వేషించేవారు శిక్షార్హులుగా పరిగణించబడతారని అర్థమౌతోందని ఆయన అన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు పాదము మోపని క్షేత్రము, స్తుతించని భగవత్ స్వరూపము గణపతి, కుమారస్వామి, ఆంజనేయ, దేవి భవాని శారద శంకరి మహాలక్ష్మి, నారాయణ నారసింహ జగన్నాథ, దత్తాత్రేయ, అందించని స్తోత్రం భాష్యం వ్యాకరణ, తిరగని ప్రదేశములు లేవు. భగవంతుని అవతార కాలము చాలా తక్కువుగా ఉంటుంది, కాని మహిమ వర్ణించనలవి కాదు. అలాగే ఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాలు, సర్వజ్ఞ పీఠ పరంపర గురువులందరు శివకేశవుల అబేధ తత్వమునే బోధిస్తారు. సకల క్షేత్రాలను దర్శించి అదే భక్తులకి మార్గదర్శం చేస్తారు. నామయోగ వాశిష్టం ప్రకారం ఇతర సంప్రదాయాలను, వాటిని ఉపాసన చేసేవారిని కించపరచడం, హేళన చేస్తూ నామాన్ని ద్వేషించడం మహాపాపమని, పైగా ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం క్షీణించి, దోషం వెంటాడుతూనే ఉంటుందని శ్రీరామపాద భాగవతర్ ఉటంకించారు.
3) “శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయగ్ం శివః”
రామేశ్వరములో శ్రీరాముడు శివలింగమును ప్రతిష్ఠ
చేసి, మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి, ఆదిశేషావతారమైన లక్ష్మణుడు సహా పరమేశ్వరుడుని
శ్రద్ధ-భక్తితో అర్చించాడని, దీనికి శివాంశతో జన్మించిన ఆంజనేయుడి సహకారం ఎంతో ఉందని,
అలాగే జగన్మాత పార్వతితో పరమేశ్వరుడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ సూక్ష్మం "శ్రీరామ
రామ రామ" కదా అని శ్రీరామపాద భాగవతర్ గుర్తుచేసారు. మహాభారత యుద్ధము ముందు శ్రీకృష్ణుడు
పరమేశ్వరుడుని పూజించిన విషయము అందరికి విదితమేనని ఆయన జ్ఞప్తికి తెచ్చారు. శివకేశవులు
ఒకరికొకరు ఆరాధ్యముగా ఉన్నప్పుడు, వారిని పూజించే మనము వారిని అనుసరించి గౌరవించాలి
కదా అని శ్రీరామపాద అన్నారు.
ఈ దృష్టాంతాల ద్వారా మనందరం అర్థం చేసుకొనవలసినది ఏమంటే, ఎవరికి వారు తమ-తమ సంప్రదాయాల ప్రకారం తమకి తోచిన భగవన్ మూర్తిని అర్చిస్తూ, ఇతర సంప్రదాయస్తులను గౌరవిస్తూ ఉండాలని, అవసరమైనపుడు దుష్ట సంస్కృతిని-సంఘ విద్రోహ శక్తులను అణచివేయడానికి సమిష్ఠిగా లోకక్షేమ కైంకర్యాలను నిర్వహించాలని శ్రీరామపాద తన అభిప్రాయమును వ్యక్తపరిచారు.
ఈ సందర్భములో మనందరం గ్రహించవలసిన హెచ్చరిక
ఒకటి ఉందని, కొంత మంది పనిగట్టుకుని హిందువులని టార్గెట్ చేస్తూ సనాతన సంప్రదాయములను
విచ్చిన్నం చేసే దిశగా విభజించి పాలించడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారని, మత
మార్పిడిలు చేస్తున్నారని ఇటువంటి నీచ సంస్కృతికి మనం లోనుకాకూడదని ఆయన హెచ్చరించారు.
‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అనే మహోన్నత ఆశయం మన సనాతన హిందూ ధర్మానిదని, ప్రపంచమంతా
భారతదేశ సనాతన ధర్మానికి ప్రణమిల్లుతున్న వేళ, హిందువులందరు కలిసిమెలసి ఉండవలసిన బాధ్యత
ప్రతి ఒక్కరిపై ఉందని, దీనికై కృషి చేసే పాలకులు మన దేశానికి ఇప్పటికి లభించడం ఎంతో
శుభపరిణామమని శ్రీరామపాద భాగవతర్ అన్నారు. అందువలన, అందరం ఐకమత్యముతో సమాజ శ్రేయస్సు
కోసం వాడ-వాడలా భగవన్నామ పారాయణలు, యజ్ఞాలు, గోశాలలు, దేవాలయాలను సమిష్టిగా పోషించడం
నిరంతరము చేయాలని శ్రీరామపాద భాగవతర్ కోరారు.
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
