ఆధ్యాత్మికంలో ఆ..కలి సామ్రాజ్యాలు ... Andhra Jyothy Editorial


ఆధ్యాత్మికంలో ..కలి సామ్రాజ్యాలు !

నిజం నిప్పు కాదు, అగ్నిజ్వాలే


అతి రౌద్రాలు, నిషిద్ధ ద్వేషాలు, అప్రకటిత ఈర్ష్యలు, అంతర్గత వ్యాపార వ్యవహారాలుఅసత్యవాక్కుఅధర్మాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులు ... ఇదీ, నేటి చాలా ఆధ్యాత్మిక యంత్రాంగాల పరిస్థితి. మరి భక్తులనబడే శిష్యుల గతి, గమ్యం ఏమిటి ?

 

కర్ణాటకలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి కేసులో ఒక మఠాధిపతిని నిర్బంధించారు. ఇదే రాష్ట్రం మైసూరులోని మరొక ప్రసిద్ధ ఆధునిక (మనకు సుపరిచితమైన) పీఠంలో ఎయిడ్స్ సోకి చనిపోయిన ఆశ్రమవాసులు, అక్రమ సంబంధాలు కలిగిన ట్రస్టీలు, పరిచారకులు ఉన్నారు. అమాయక భక్తులారా నిద్ర లేవండి! అయోగ్యుడు సన్యాసి/పీఠాధిపతిగా, బ్రహ్మచర్యం పాటించనివాడు జగద్గురువుగా, గురుపరంపర లేనివాడు అవతార పురుషుడుగా చలామణి అవుతున్నారు. స్త్రీ సాంగత్యం చేస్తూ పరమపూజ్యుడినని ప్రజలను మోసం చేస్తున్నాడు. సంభావనకు ఆశపడి పండితులు అటువంటి ధర్మహీనులను ఆశ్రయిస్తున్నారు. ఆధునిక స్వామీజీలు చాలామంది లౌకిక వ్యవహారాలకు బానిసలయ్యారు. ఇక్కడ ఆధునికం అంటే విశ్వసించదగిన సనాతన గురుపరంపర లేని ఆధ్యాత్మిక సంస్థ. మానవాళి కోసం వివాహం చేసుకోక బ్రహ్మచారు(రిణి)లుగా ఉండిపోయామని ఈశ్వరసాక్షిగా పచ్చి అబద్ధాలాడుతున్నారు. చేతిలో అక్రమంగా వచ్చి పడుతున్న కోట్ల ధనమదంతో ఘోరపాపాలు చేస్తున్నారు. కాని ప్రపంచానికి జ్ఞానబోధలు చేస్తుంటారుజిగుప్సాకరమైన వామాచారం, వశీకరణ చేస్తూ ధర్మాచరణకు విరుద్ధంగా వేలమందిని ఆకర్షిస్తున్నారు, జనం అందుకు హారతులు పడుతున్నారు.  అసత్యమే శ్రీవారి మాట మంత్రం, అక్రమార్జితం వారి చతురంగ బలం, అదే వారి కీర్తికి ఆయుధం. ఆధ్యాత్మిక పీఠాల ముసుగులో అంతర్జాతీయంగా రియల్ ఎస్టేట్, సెటిల్‌మెంట్‌లు, పసిడి వజ్రాలు, బినామీ, ఫైనాన్స్ వ్యాపారాలు చేయవచ్చని, అవినీతే బ్రహ్మాస్త్రంగా సమాజాన్ని మోసం చేస్తూ పవిత్రులుగా నటించవచ్చని శాస్త్రం చెప్పింది? ఆధునిక స్వామీజీలు ఆడే నాటకాలు, పిచ్చివేషాలు పురుషోత్తములైన జగద్గురువుల వద్ద కనిపించవు. ఇవన్నీ తెలుసుకోలేక స్వామీజీలను నమ్మి వెళ్ళే వందల మందిని చూస్తే జాలి కలుగుతుంది. ఏం చేయగలం? సున్నితంగా చెప్పగలం, మహా ఐతే ఎంచుకున్న మార్గం బాగా లేదని హెచ్చరించగలం.




నిజం మాట్లాడితే వృత్తి దెబ్బతింటుందనో, తాంబూలాలు ఆగిపోతాయనో, సభలు, సత్కారాలకు పిలవరనో అకృత్యాలు, అధర్మాన్ని ఖండించకుండా ఉండలేము కదా! మాటకు వస్తే వేదశాస్త్ర నిష్ణాతులు, విద్వాంసులకు విషయంలో మక్కువ, భయం ఉండకూడదు. ధర్మాచరణయందు లోపం గలవారు ఎలా గురువులై ప్రసిద్ధి పొందుతారో, వారిని ఎలా గుర్తించాలో, ఆదిశంకర భగవత్పాదులు శతాబ్దాల క్రితమే చెప్పారు. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోకలికాలం రాబోతోంది, కపటులు గురువులై సిద్ధులనో, అవతార పురుషులనో ప్రచారం పొందుతారు, జనం వారి పాదాలకు మ్రొక్కుతూ కాలం వృధా చేస్తూ ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటారు,  పాలకులుపండితులు సైతం తప్పటడుగులు వేస్తారుఅని హెచ్చరించాడు. సరిగ్గా ఇప్పుడు జరుగుతోంది అదే !



వేషగాడు - వేదద్రష్టకు, అడ్డదారిలో గురువైనవాడు - కఠోర కృషితో సకల వేదశాస్త్రాధ్యయనం చేసి గురు-పరంపర వ్యవస్థలో గురుత్వం పొందినవాడు ఒక్కటే ఎలా అవుతారు? ఆశువుగా భాషిస్తూ, వేదశాస్త్రాలను సంస్కృతంలో ఉటంకిస్తూ ఉపదేశించే గురువుకి, మాయమాటల వచనము చెప్పేవాడికి పోలిక ఉందా?  దేశ విదేశాలు విచ్చలవిడిగా పూజలు, పారాయణలు పేరుతో తిరుగుతూ గుప్త వ్యవహారాలు చేసేవారే నేటి ప్రసిద్ధ గురువులు, ఆచార్యులైపోయారు. ఇది నిక్కచిగా దౌర్భాగ్యమే. సంప్రదాయం, సంస్కారాలను జనం మరచిపోవడమే ఆధునిక స్వామీజీల ఆధ్యాత్మిక వ్యాపారానికి మూలకారణం. ఆధునిక భక్తిలో జారిపడినవారికి ఆధునిక స్వామీజీల విచలన సలహాలు జాక్పాట్లాంటివి. వాటికి ఉబ్బితబ్బిబ్బై తమ ధనాన్ని దురిత దూతల మురికి పాదాల మీద వేస్తున్నారు. పరిణామాలు సనాతనధర్మ విలువలు క్షీణించడానికి కారణభూతమౌతున్నాయి.


నేను సామాజిక దృక్పథంతో ఆధునిక స్వామీజీలతో కూడ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, సనాతన ధర్మ ఆచరణ, పవిత్రతలకు విఘాతం కలుగుతుంటే వెంటనే సరిదిద్దుకోమని విన్నవిస్తుంటాను. ఎందుకంటే, వేలమంది భక్తులు ఎంతో నమ్మకంతో ఆశ్రమాలకు వస్తుంటారు. వారి జీవితాలతో చెలగాటం ఆడటం, వారి విశ్వాసాలతో వ్యాపారం చేయడం తగదు. లక్షల ధనం వెదజల్లి పండితులను, విద్వాంసులను రప్పించి, టీవీలలో ప్రసారం చేయించుకోవడం తద్వారా సమాజాన్ని మోసం చేసి అంతకు పదిరెట్లు ఆర్జించడమే వీరి లక్ష్యంగా కనబడుతోంది. దేశ ప్రముఖులను మూర్ఖులను చేస్తూ, వారి అండదండలతో రెచ్చిపోతున్నారు. రోజుల్లో, ఎలాగైతే ఫాస్ట్ ఫుడ్ను ఇష్టపడుతున్నారో, అలాగే మోడరన్ గురువులను ఆశ్రయించడమంటే




ఇటువంటివారు కురుక్షేత్రలో కుటీరాలు కట్టి గీతా పారాయణ చేసినా, అయోధ్యలో ఆశ్రమాలు నిర్మించినా, కాశీలో అతిరుద్ర మహాయాగాలు, కార్తీకంలో కోటి దీపోత్సవాలు చేసినా, కేదారఖండంలో నివసించినా యమయాతన తప్పదు. లౌకిక తపనలకు ఆధ్యాత్మికంలో చోటు కల్పించేవారు భ్రష్టులుగా పరిగణింపబడతారని వేదశాస్త్రాలు, ఇతిహాసాలు ఉద్ఘాటిస్తున్నాయి. పది మందికి పురాణాంతర్గతంగా మంచి, ధర్మం తెలియజెప్పే ప్రవచన కర్తలు, విద్వాంసులు స్వలాభం ఆశించి ధర్మహీనులను ఆశ్రయిస్తే ముక్తి కలుగదని జగద్గురు వాక్కు. ధర్మాచరణ అంటే బాహ్యంగా ప్రదర్శించడమే కాదని, అంతఃకరణ శుద్ధి కలిగి అత్యంత కఠినంగా పాటించాలని, భక్తుల ముందు ఒక విధంగా, లోపల విచ్చలవిడిగా ప్రవర్తించకూడదని శాస్త్రం ఖండించింది. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నట్లు, చివరికి భగవద్గీత పారాయణ కూడా కీర్తి, ప్రదర్శన, పురస్కారాల కొరకే పరిమితమైపోయింది. గీతలోని ఉపదేశాన్ని సాధన చేసి జీవితంలో అనుసరించాలనే చిత్తశుద్ధి గురుశిష్యులిద్దరికి కరువైపోయింది. అధర్మం జరుగుతున్నపుడు ధర్మాచరణపై శ్రద్ధ, నిష్ఠ కలవారు నోరెత్తకపోతే పాపంలో భాగస్వామి అయినట్లేనని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. ఇది విజ్ఞులందరికి తెలిసిన ధర్మశాస్త్ర సూక్ష్మంసనాతనధర్మ ఆచార వ్యవహారాలకుఆధ్యాత్మిక ముసుగులో భంగం కలిగిస్తున్నవారి గురించి ప్రజల మంచికోరి చెవులు చిల్లుపడేలా చెబుతూనే ఉండాలి. వినటమా, విస్మరించడమా అనేది వారి పాప, పుణ్య కర్మల మీద ఆధారపడి ఉంటుంది.

 

దొంగస్వామీజీలు, బాబాలు చట్టాలలోని లొసుగులు తెలుసుకుంటూ, వాటికి అనుగుణంగా నేరాలు చేస్తూ సాక్ష్యాలు లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తూ తద్వారా కేసు నమోదు కాకుండా చేస్తున్నారు. ఇవన్నీ మన కంటి ముందు జరుగుతున్నవే. కానీ, గ్రహించలేకపోతున్నాము. పైపెచ్చు, దేశ ప్రముఖులు వీరిచెంత సాగిలపడటం ప్రజలకు తెలియని ప్రమాదంగా దాపురించింది. కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికైనా చలించి కచ్చితమైన విచారణ చేయిస్తే దొంగ పీఠ/మఠ అధిపతులు, అవదూతలు, ఆర్థికఆధ్యాత్మిక నేరగాళ్ళు బయటపడతారు. గుండెలు పగిలే నిజాలు తేటతెల్లమవుతాయి. అప్పుడే ప్రజాస్వామ్యంలో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడినట్లవుతుంది.

 

ప్రారబ్ద, సంచిత కర్మలు మన చేతిలో లేకపోయినా, ఆగామి కర్మలనైనా ధర్మానికి కట్టుబడి చేయగలిగితే యమయాతన తప్పించుకోవచ్చు. సమయం, సంపద, విచక్షణా జ్ఞానాన్ని వృధా చేస్తే ఈశ్వరుడు క్షమించడు. కర్కోటకులు పాలకులు అయితే సమాజం ఎలా ఛిన్నాభిన్నం అవుతుందో, అలాగే ఆధ్యాత్మిక గురువులు సరిగా లేకపోతే భక్తులు భ్రష్టులైపోతారు. భక్తుల కోట్లధనం అదృశ్య భోగాలకు, పరిచారకుల విలాస జీవితాలకు దారిమళ్ళుతోంది. ఎన్నో అనుమానాస్పద మరణాలు సంభవించినాయి. ఇవన్నీ ఎవరు దర్యాప్తు చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు విషయాల్లో ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం కావట్లేదు. ప్రధానమంత్రి, వి..పిలు రావడం చూసి ఆశ్రమాలు పవిత్ర క్షేత్రాలనే భ్రమలో చేతులు దులుపుకుంటూ, తమ వంతుగా సత్కారాలు స్వీకరిస్తున్నారు. గురువులే భ్రష్టాచారాలను పోషిస్తుంటే ధర్మం భ్రష్టుపట్టక ఏమౌతుంది? రాజకీయాలలో ఇమిడిపోయిన స్వామీజీలు బ్రోకర్లు కాక ఆధ్యాత్మిక గురువులు ఎలా అవుతారు? పాలకులకు విచక్షణా జ్ఞానం, సరైన సలహాదారులు లోపించడం వలనే ఆధ్యాత్మికంలో లౌకిక కేంద్రాలు ఎక్కువైపోయాయి. సూటిగా చెప్పాలంటే, ఆధునిక ఆచార్యుల ఆధ్యాత్మికం సత్య సంధత, ధర్మ నిష్ఠల సమ్మేళనం కాదు. తెలుసుకున్నవాడు ధన్యుడుఎందుకంటే నష్టం జరిగినా ప్రజలకే!

                                            

                                                                                                                  శ్రీరామపాద భాగవతర్


Note :

ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ (సంపాదకీయం)


This is a published editorial in Andhra Jyothi, a Telugu leading daily newspaper

https://www.andhrajyothy.com/2022/editorial/modern-gurus-like-fast-food-934357.html


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper