30 రోజుల ధనుర్మాస భక్తి పాటించకపోతే 7 జన్మల దరిద్రం
30 రోజుల ధనుర్మాస భక్తి పాటించకపోతే 7 జన్మల దరిద్రం
అందరికి ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో (సూర్యోదయానికి సుమారు 90 నిం.లు ముందు) దేహశుద్ధిగా చేసే “శ్రీహరి నామస్మరణ” ఏడుజన్మల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ధనుర్మాసంలో ఒక్కరోజు ప్రాతః పారాయణ 1000 రోజుల ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే తమ ఆరోగ్యం, సంపద, పిల్లలు, కుటుంబం, కాబోయే వివాహము, కలగబోయే సంతానం, భవిష్యత్తు ఆనందంగా ఉండాలని కోరుకుంటారో (వారికి మాత్రమే) ఈ 30 రోజులు సరళంగా చేయగలిగే ఆచరణ, ఉపాయం చెప్తాను.
ప్రతిరోజు రాత్రిపూట ఆహారాన్ని 7.45 గం.లకి ముగించి, వృధా వ్యవహారాలను విస్మరించి, 8.30 గం.లకే నిద్రకు ఉపక్రమించినట్లైతే, ఆటోమాటిక్‌గా తరువాత రోజున బ్రహ్మముహూర్త సమయానికి అంటే తె.4 గం.లకే నిద్రనుండి లేవవచ్చు. మన శరీరమే మనకు అలారం లాగా తెలియచేస్తుంది. పిదప స్నానం చేసి, దీపం వెలిగించి, రోజుకి ఒక పాశురాన్ని చదివి "శ్రీరంగనాథ పాహిమాం రక్షమాం" అని అనుకుంటే చాలు. సాక్షాత్తు భూదేవి మనకోసం "ఆండాళ్ (గోదాదేవి)" గా తమిళనాట శ్రీవిల్లిపుత్తూర్ గ్రామంలో జన్మించి మనందరికి కేవలం భక్తితో శ్రీహరి పాదాలని ఎలా చేరుకోగలమో ఆచరణ పూర్వకంగా తెలియచేసింది. శ్రీమహావిష్ణువుని అర్చించే విధములు ఎన్నో ఉన్నా, ఈ కలికాలంలో మనందరి సోమరితనం, మందబుద్ధి ఎరిగి అత్యంత సులువైన పాశుర స్తోత్ర హారాన్ని అందించిన తల్లి, మనందరిని భరిస్తూ ఉన్న భూదేవి. తాను 29 రోజులు ఆచరించి 30వ రోజున శ్రీమహావిష్ణువునే వివాహమాడిన పవిత్రమూర్తి గోదాదేవి. అంటే రోజుకు ఒక శ్లోకం చొప్పున ఈ మాసానికి 30 శ్లోకాలు పఠిస్తే చాలు. ఆ వైకుంఠనాయకుడి కృప, కరుణ కలుగుతాయి.
ఏదీ చేయనివారు 7 జన్మలు దరిద్రులవుతారు. ఎవరికి తెలుసు ఇటువంటివి ఆచరించక పోవడం-నిర్లక్ష్యం చేయడం వలనే, ఈ జన్మలో మనం అనుభవిస్తోన్న పలువిధాల బాధలకి కారణమేమో? మరోప్రక్క, అన్నీఉండి, ఆరోగ్యం – వనరులు - ధనం - కాలం - అవకాశం ఉండి కూడా చేయనివారు వచ్చే జన్మలలో దరిద్రులవుతారు. వరుసగా వచ్చే ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసాలు మన జీవిత లక్ష్యాలకి దిశానిర్దేశం చేస్తాయి.ఎంతో అనువైన కాలం.వాతావరణం చల్లగా, మంచుతో కూడుకుని తెల్లవారుఝామున ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది (వేసవి కాలంతో పోలిస్తే). ఇటువంటి పుణ్యకార్యాలు చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పరమాత్మ ఆ విధంగా మనకి మంచి అవకాశం ఇచ్చాడు.
ఈ మాసంలోనే ఇంకొక 10 రోజులలో ఎంతో పరమపవిత్ర "వైకుంఠ / ముక్కోటి ఏకాదశి" వస్తోంది. ప్రసిద్ధ శ్రీరంగ క్షేత్రంలో మొదటి పదిరోజులు పగటి వేళ, వైకుంఠ ఏకాదశి పర్వదినం పిదప పదిరోజులు రాత్రి వేళ, అద్భుతమైన పారాయణ గోష్ఠి, సేవలు శ్రీరంగనాథునికి చేస్తారు. తద్వారా భక్తులందరికి ఎంతో అనుగ్రహం లభిస్తుంది.మరి ఇంతటి పుణ్యకాలంలో, కేవలం 30 రోజులు సులువుగా ఆచరించి, భక్తితో దినమూ పాశురంతో సుప్రభాతం పాడి జీవితాంతము శ్రీమహావిష్ణువు వెన్నంటి ఉండేలా చేసుకుని, ప్రారబ్ధకర్మ దుష్ప్రభావము తగ్గించుకుని సుఖసంతోషాలతో ఉండటమా? లేదా ఏమి చేయకుండా 7 జన్మల దరిద్రం పొందటమా? నిర్ణయం మనదే. ఇది పురాణాంతర్గత ధర్మసూక్షం.
ఆండాళ్ తిరువడిగళే శరణం !
⯁ శ్రీరామపాద భాగవతర్
ఆధ్యాత్మికవేత్త - నాదోపాసకులు
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
