ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి .. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్‌లో నా వ్యాసం
ఆధ్యాత్మికం వ్యాపారమా ? ఎవరు ప్రక్షాళన చేస్తారు ? ( ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్) ప్రపంచంలో గురువుని తప్ప ఎవరినీ నమ్మవద్దు అని సుప్రసిద్ధ హితోక్తి. అయితే, ఎల్లప్పుడూ విఐపిలు సందర్శిస్తే ఆయన నమ్మకమైన గురువా? పెద్దెత్తున కార్యక్రమాలు, యాగాలు చేస్తే జగద్గురువా? నిత్యం టీవీల్లో కనపడితే మహాస్వామియా? విదేశాలు తిరిగితే యోగులా? ఆభరణాలు సృష్టిస్తే అవతారపురుషుడా? పెద్దెత్తున కట్టడాలు కడితే పరమహంస పరివ్రాజకుడా? కోట్ల ధనం వసూలు చేస్తే సిద్ధులా? రాగద్వేషాలు కలవారు, లాబీయింగ్ చేసేవారు పీఠాధిపతులా? ఎవరు నిజమైన గురువు? నేటి గురువులు ‘శిష్యుడు ఎంత ఇవ్వగలడు? వేటిని సమకూర్చగలడు? ఏ విఐపిని తీసుకునిరాగలడు?’ అనే చూస్తున్నారు. ఇంకొకరికి పోటీగా ఎదగడమే లక్ష్యం తప్ప సనాతన ధర్మరక్షణ ఏ కోశాన కనిపించట్లేదు. ఆశ్చర్యమేమంటే, వీరు తలబెట్టే కార్యక్రమాలు మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటాయి. అయితే అవి జనాకర్షణ, ధనార్జన కోసమే. తమ ఆశ్రమవాసులను పవిత్రంగా ఉన్నతస్థితిలోకి తీసుకురాలేరు కాని లోకానికి ప్రవచనాలు చెప్తుంటారు. సనాతనధర్మాన్ని నిక్కచ్చిగా ఆచరించే గురువులు ఈ కర్మభూమిని దాటివెళ్ళక నిషేధం పాటిస్తారు. బ్రహ్మనిష్ఠుడై, బ్...